Star castRahul RavindranNiti Taylor
ProducerB. Nagi ReddyDirectorSekhar Chandra

Pelli Pustakam - English Full Review

పెళ్లిపుస్తకం రివ్యూ: చిత్రకథ 
సత్యం(నాగినీడు) ఓ ఉమ్మడి కుటుంబానికి పెద్ద. ఆ కుటుంబంలో తన తాతల కాలం నుంచి అనాగరికంగా ఓ సాంప్రదాయం నడుస్తుంటుంది. అదేమిటంటే తన కుటుంబంలోని అమ్మాయిలని బయటి వారికి ఇచ్చి పెళ్లి చేయరు అలాగే అబ్బాయిలకు బయటి అమ్మాయిలను కోడళ్ళుగా చేసుకోకుండా తమ కుటుంబంలోనే ఉన్న బావా మరదల్లకి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. అలాగే రాహుల్(రాహుల్ రవీంద్రన్) - నీతి(నీతి టేలర్) బావా మరదళ్ళు. వీరిద్దరికీ తాత అయిన సత్యం వీదిద్దరికి ఇష్టం లేకపోయినా ఓ నాటకం ఆడి పెళ్లి చేస్తాడు. కానీ వారిద్దరూ ఒకే చోట ఉన్నా భార్యా భర్తల్లా ఉండరు. అదే సమయంలో రాహుల్ నీతిని ప్రేమిచడం మొదలు పెడతాడు, కానీ నీతి ఏమో తనతో పాటు చదివే చెర్రిని ప్రేమిస్తుంది. నీతి తనని ప్రేమించడం లేదని తెలుసుకున్న రాహుల్ నీతి ప్రేమని పొందడానికి ఏమేమి చేసాడు? ఎలా నీతి ప్రేమని పొందాడు? అనే విశేషాలను మీరు వెండితెరపైనే చూడాలి.

పెళ్లిపుస్తకం రివ్యూ: నటీనటుల ప్రతిభ
మొదటి సినిమాలో ఒకే మూస ధోరణిలో నటించిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో తన నటనని కాస్త మెరుగుపరుచుకున్నాడు. సెంటిమెంట్ సీన్స్ పరవాలేధనిపించినా కామెడీ సీన్స్ చేయడంలో మాత్రం తేలిపోయాడు. నీతి టేలర్ నటనలో పెద్ద కొత్తేమీ లేకపోయినా ఈ సినిమాతో తను కూడా అందాల ఆరబోత చేయడానికి సిద్దమే అని చెప్పకనే చెప్పింది. బీచ్ సాంగ్ లో బాగానే అందాలు ఆరబోసింది. తనకిచ్చిన పాత్రకి నాగినీడు న్యాయం చేసాడు. ఇంకా చెప్పుకోదగ్గ రీతిలో ఎవరి నటనా అనిపించలేదు. 

పెళ్లిపుస్తకం రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సినిమా తీసే వారికి చూసే వారు లోకువ అన్న రీతిలో డైరెక్టర్ పాత కథకి ఏవో రంగులు అద్ది చూపించాలనుకున్నాడు. సినిమా సగం చూసేటప్పటికే అది అర్థం కావడంతో డైరెక్టర్ ఆలోచన బెడిసికొట్టింది. స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది సీన్ టు సీన్ చెప్పొచ్చు, సినిమా పండితులైతే డైలాగ్స్ తో సహా చెప్పేస్తారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు స్క్రీన్ ప్లే అనేది ఏ రేంజ్ లో ఉందో అని. రామకృష్ణ డైరెక్షన్ లో అసలు పస లేదు. డైరెక్టర్ టేకింగ్ చూస్తే చదివిన వాడికన్నా చాకలే మేలు అన్న సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఏమీ చేతకాని వారికి మెగా ఫోన్ ఇచ్చి డైరెక్ట్ చెయ్యమంటే ఎలా ఉంటాడో అలా రామకృష్ణ దర్శకత్వం ఉంది. డైరెక్షన్ ఏ చేతకాలేదు అన్నప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో అప్పటికీ ఇప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచే కొన్ని పాటల్ని, సినిమా పేర్లని టచ్ చేయకూడదు. కానీ ఈ మూవీ డైరెక్టర్ వాటిని కూడా గెలికేసాడు అవే 'పెళ్లి పుస్తకం' టైటిల్, 'శ్రీరస్తు శుభమస్తు' సాంగ్. 

ఎడిటర్ అయినా కాస్తో కూస్తో శ్రద్ధ తీసుకొని సినిమాని సాగానికి సగం కత్తెర వేసేసి ఉంటే ఆడియన్స్ ని బతికించి ఉండేవాడు. మరుధూరి రాజ డైలాగ్స్ ఒక్కటి కూడా పేలలేదు. సినిమా మొత్తం మీద టెక్నికల్ విభాగంలో కాస్తో కూస్తో చెప్పుకోదగినవి సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..


పెళ్లిపుస్తకం రివ్యూ: హైలెట్స్
  • రాహుల్ రవీంద్రన్, నాగినీడుల నటన
  • నీతి టేలర్ గ్లామర్

పెళ్లిపుస్తకం రివ్యూ: డ్రా బాక్స్
  • కథ, స్క్రీన్ ప్లే
  • అనుభవం లేని దర్శకత్వం
  • సమయం సందర్భం లేకుండా వచ్చే సాంగ్స్
  • 15 నిమిషాల్లో చెప్పాల్సిన కథని రెండున్నర గంటలు సాగాదీయటం
  • సినిమాకి అవసరమే లేని కొన్ని ఎపిసోడ్స్.. ఉదాహరణకి రాహుల్ - ఓ లేడీ లెక్షరర్ ఎపిసోడ్, ర్యాగింగ్ ఎపిసోడ్స్, రాహుల్ - నీతి మధ్య కామెడీ ఎపిసోడ్స్ ..

పెళ్లిపుస్తకం రివ్యూ: విశ్లేషణ

దర్శకుడు ఏమనుకొని సినిమా మొదలు పెట్టాడో గానీ సినిమా పూర్తి చేసేటప్పటికి చెప్పాలనుకున్న విషయాన్ని గంగలో కలిపేసి, కమర్షియల్ అంశాలు జత చేయాలి అనే ధోరణిలో చాలా మంచి ఫీల్ తో ముగించాల్సిన సినిమాని ఒక భయంకరమైన సినిమా చూసిన ఫీల్ తో ముగించాడు. సినిమా చూడగానే అందరూ మొదటగా బాపు - రమణలు 'పెళ్లి పుస్తకం' అని ఎంతో అద్భుతంగా గీసిన ఓ అందమైన బొమ్మని చీల్చి చెండాడాడు కదరా వీడు అంటున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా వేసి ఎటువంటి సమాచారం లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా చీకట్లోనే కలిసిపోతుంది. ఈ సినిమా ద్వారా రాహుల్ రవీంద్రన్ మాత్రం తన నటనని కాస్త మెరుగుపరుచుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ గానీ, రొమాన్స్ గానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ గానీ, యాక్షన్ గానీ ఇలా ఏవీ దాదాపు లేకపోవడం ఉన్న ఒకటి రెండు ఆకట్టుకోకపోవడంతో ఆడియన్స్ అనవసరంగా జేబుకి చిల్లు పడిందని సినిమా పూర్తి కాకముందే లేచి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమా జోలికి ఎ నుంచి సి సెంటర్ వరకూ ఎవరూ వెళ్లరు, వెళ్ళకపోవడమే మంచిది. ముఖ్యంగా నూతన దర్శకులకి ఒకటి చెప్పాలి మీకు చేతకాకపోతే కొన్ని అద్భుతమైన సినిమాల జోలికి, ఎవర్గ్రీన్ పాటల జోలికి వెళ్ళకండి. వాటిని అనవసరంగా టచ్ చేసి వాటిపై ప్రజలకున్న మక్కువని చెడగొట్టకండి.


పెళ్లిపుస్తకం రివ్యూ: చివరగా
మేడి పండు చూడ మేలిమై ఉందును పొట్ట విప్పి చూడ పురుగు లుండు(ఇలా ఎందుకు చెప్పానంటే ఈ సినిమా టైటిల్ అంట ఆకర్షణీయంగా ఉంటుంది కానీ సినిమా చూస్తే అయ్యా బాబోయ్ ఇంత టార్చర్ ఆ అని ఆడియన్స్ థియేటర్ నుండి పరుగులు తీస్తున్నారు).
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Pelli Pustakam | Pelli Pustakam Wallpapers | Pelli Pustakam Videos

మరింత సమాచారం తెలుసుకోండి: