Star cast: SrihariLekha WashingtonRoja Selvamani
Producer: Siddharth ArimandaDirector: Lakshmikant Chenna

Kamina - English Full Review

కమీనా రివ్యూ: చిత్రకథ 
బిజినెస్ పార్టనర్స్ అయిన ధర్మ(సాయి కుమార్) , శివ(సుబ్బరాజు), తేజ(ఆశిస్ విద్యార్ధి), కైలాష్(బ్రహ్మాజీ) మరియు సిద్దార్థ్(క్రిష్) మంచి స్నేహితులు వీరందరు కలిసి లీగల్ గా కొన్ని పనులు ఇల్లీగల్ గా కొన్ని పనులు చేస్తుంటారు. ఒకరోజు వీరికి కళ్యాణ్(రవిబాబు) ఒక ఆఫర్ ఇస్తాడు. 10 కోట్లు విలువ చేసే సరుకుని 5 కోట్లకే అమ్ముత అని చెప్పగా వీరందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి శివకి డబ్బులు ఇచ్చి పంపగా మధ్య దారిలో శివ అనుమానాస్పదంగా మృతి చెందుతాడు. అంతే కాకుండా వీరు ఐదుగురిలో ఒక్కొక్కరుగా హత్య చెయ్యబడుతుంటారు. వీరిని ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అసలు వాసుకి(లేఖ వాషింగ్టన్) కి వీరికి ఉన్న సంబంధం ఏంటి? అసలు 5 కోట్లు ఏమయ్యాయి? అన్న ప్రశ్నలు థ్రిల్లింగ్ గా అనిపిస్తే సినిమాలో జవాబులు వెతుక్కోండి.

కమీనా రివ్యూ: నటీనటుల ప్రతిభ
ఈ సినిమాలో ఒక్క హీరో తప్ప మిగతా వాళ్ళందరూ సీనియర్ నటీనటులే కావడం విశేషం. అలాగే వారి వారి పాత్రలకు వారు పర్ఫెక్ట్ గా సరిపోయారు. సాయి కుమార్ తన గ్యాంగ్ కి లీడర్ గా, అందరినీ కంట్రోల్ చేసే సీరియస్ పాత్రలో మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆశిష్ విద్యార్థి కాస్త కామెడీ. కాస్త రొమాంటిక్, కాస్త వైలెంట్ యాంగిల్ ఉన్న పాత్రలో బాగానే చేసాడు. అమాయకుడైన పాత్రలో బ్రహ్మాజీ, అతనిపై అరిచే గయ్యాలి భార్య పాత్రలో ఇద్దరూ బాగా చేసారు, అలాగే అక్కడక్కడా కాస్త నవ్వించారు కూడా.. లేఖ వాషింగ్టన్ కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితమయ్యింది. చివరిగా చెప్పుకోవాల్సింది హీరో పాత్ర చేసిన క్రిషి గురించి.. సినిమాలో అతనిది చాలా కీలకమైన పాత్ర, ఎన్నో హావభావాలను పలికించాల్సిన పాత్ర కానీ మన క్రిషి మాత్రం రొమాటిక్ సాంగ్/సీన్ వచ్చినా, ఫైట్ వచ్చినా, ఆనందం వచ్చినా, ఏడుపు వచ్చినా, కోపం వచ్చినా ఇలా ఏది ఒచ్చినా ఒకే ఎక్స్ ప్రెషన్ తో ఆడియన్స్ ని చితక్కోట్టేసాడు. ఎవరు ఏమన్నా అనుకోనీ పట్టువదలని విక్రమార్కుడిలా సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఒకే ఎక్స్ ప్రెషన్ ని ఆడియన్స్ మీదకి సందిస్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అతని నటన ఏ రేంజ్ లో ఉందో.

కమీనా రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

ముందుగా ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన 'జానీ గదర్' సినిమాకి రీమేక్. రీమేక్ సినిమా అనగానే ఎప్పుడూ ఒరిజినల్ కథలో వేలు పెట్టకూడదు, అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో అస్సలు వేలు పెట్టకూడదు. కానీ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాలో తెలుగు నేటివిటీ అని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంతో స్క్రీన్ ప్లే చాలా వరకూ దెబ్బతింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరో కొత్త వ్యక్తి ఈ కథని మార్పులు చేర్పులు చేసి చెడగొట్టి ఉంటే పెద్ద ఫీల్ అయ్యుండే వాళ్ళు కాదు. హిందీలో కథ రాసుకొని డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన శ్రీరామ్ రాఘవన్ గారే సినిమా చెడగొట్టడం అనేదాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కథ - స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదు, దానికి తోడు డైరెక్టర్ తీయడం సరిగా రాకపోవడంతో సినిమా పరిస్థితి బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యింది. సినిమాలో కాస్తో కూస్తో బెటర్ అంటే సినిమాటోగ్రఫీ ఒక్కటే. ఇక డైలాగ్స్ ఎక్కడో ఒకటి బాగుంటుంది అది బాగుందనుకునే లోపు అది వెళ్ళిపోతుంది మళ్ళీ మరో మంచి డైలాగ్ వినాలంటే మరో పుష్కర కాలం ఎదురు చూడాలి. ఎడిటింగ్ పదింట ఒకింత మాత్రమే బాగుంది. మిగతా అంతా హుస్సేన్ సాగర్ పాలైపోయింది. అగస్త్య మ్యూజిక్ అందించిన పాటల్లో ఒక్క పాట కూడా వినడానికి పనికిరాదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జస్ట్ ఓకే.. ఆర్ట్ డైరెక్టర్ వర్మ పనితనం బాగుంది.


కమీనా రివ్యూ: హైలెట్స్
  • సీనియర్ నటీనటుల నటన
  • ఇంటర్వల్ బ్లాక్

కమీనా రివ్యూ: డ్రా బాక్స్
  • కథ - స్క్రీన్ ప్లే లో చేసిన మార్పులు చేర్పులు.
  • డైరెక్టర్ టేకింగ్
  • సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సస్పెన్స్ లేకపోవడం
  • ఇక నేను చెప్పలేను.. మిగతా ఎన్ని ఉంటే అన్ని ఈ కేటగిరీలోకే వస్తాయి.

కమీనా రివ్యూ: విశ్లేషణ

థ్రిల్లర్.... దీన్ని థ్రిల్లర్ అని అనుకుని దర్శకుడు తెరకెక్కించారేమో.. థ్రిల్లర్ లో ఉండవలసిన అన్ని అంశాలు ఉన్నాయి, డబ్బులు, పబ్బులు, హత్యలు, పోలీసులు కానీ ఒక్కటి మిస్ అయ్యింది అదే థ్రిల్లింగ్ సన్నివేశాలు. ఎలా ఉంటాయిలే రాబోయే సన్నివేశాన్ని ముందే గ్రహించిన ప్రేక్షకుడు బలవంతంగా అయిన థ్రిల్లింగ్ గా ఫీల్ కాలేడు. ముందే గ్రహించడం ముమ్మాటికి ప్రేక్షకుడి తప్పే..పోనీ తప్పు చేసేసాం గ్రహించేసాం అనుకుందామంటే ఆ సన్నివేశానికి హీరో హవాభావానికి అసలు పొంతన ఉండదు. ఉడెన్ పేస్ కి మీనింగ్ కావాలంటే ఈ హీరో యాక్టింగ్ చూడాల్సిందే.ఇక్కడే అసలు సమస్య వచ్చింది మనం ఊహించిన సన్నివేశమే నడుస్తున్నా కాస్త అనుమానంగా చాలా అసహనంగా ఉంటుంది. థ్రిల్లర్ అనగానే పరిగెత్తే స్క్రీన్ ప్లే, సరయిన మోతాదులో సస్పెన్స్ ఉండాలి. ఈ చిత్రంలో రెండూ లేవు. టైటానిక్ చిత్రంలో ప్రేమించుకోవడం నుండి మునిగిపోవడం వరకు ఇన్ని సన్నివేశాలు ఉండగా మన దర్శకులు "ఆ" సన్నివేశాన్నే ఎత్తి చూపించడం వెనకున్న ఆంతర్యం ఏమిటో..నిజానికి ఈ చిత్రం హిందీ రీమేక్ పోనీ అదయినా సరిగ్గా చేసారా అంటే అదీ లేదు. దీనికన్నా సొంత కథతో ఏదయినా చేసుంటే కనీసం ప్రయత్నించామన్న తృప్తి వాళ్ళకి ఏదో ప్రయత్నించాడన్న ఆనందం మనకి మిగిలేది. ఇంతే ఇంతకు మించి ఒక్కమాట కూడా చెప్పలేను. సినిమాటోగ్రఫీ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం అయితే ఈ సినిమాని చూడలేరు, ఈ సినిమాని చూడటానికి మరో కారణం లేదు.


కమీనా రివ్యూ: చివరగా
కమీనా - ఇదీ ఒక రీమేకేనా?
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Kamina | Kamina Wallpapers | Kamina Videos

మరింత సమాచారం తెలుసుకోండి: