బ్యానర్ : ఎల్లో ఫ్లవర్స్,   చిత్రం : శ్రీమన్నారాయణ నటీనటులు : బాలకృష్ణ, పార్వతి మెల్టన్, ఇషాచావ్లా, విజయ్ చందర్, కోట, సురేష్ సంగీతం : చక్రి,  మాటలు : ఘటికాచలం నిర్మాత : రమేష్ పుప్పాల, దర్శకత్వం : రవి కుమార్ చావలి నందమూరి హీరో బాలకృష్ణ అంటే అభిమానులకు ఓ ప్రత్యేక అభిమానం. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఇప్పుడు సినిమాలలో కొనసాగుతున్న ఏ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా జర్నలిస్టుగా నటించిన సినిమా శ్రీమన్నారాయణ. సూపర్ హిట్ కోసమే ఈ సినిమాలో నటించానని బాలకృష్ణ చెప్పడం, ఆడియో హిట్టవ్వడం అలాగే దర్శక, నిర్మాతల గత సినిమాలు విజయం సాధించడంతో ఈ శ్రీమన్నారాయణ సినిమాపై అంచనాలు పెరిగాయి. వరస ప్లాపుల నుంచి బాలకృష్ణ ను శ్రీమన్నారాయణ గట్టెక్కిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి సింహా తరువాత బాలకృష్ణ మరో హిట్ ఖాయం చేసుకున్నాడా... అసలు శ్రీమన్నారాయణ సంగతి ఏంటో చూద్దాం..!   చిత్ర కథ : మాజీ సైనికుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని సమాజంలో పెద్ద మనుషులు గా చెలామణి అయ్యే విలన్ గ్యాంగ్ కబ్జా చేస్తుంది. జర్నలిస్టు శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) ఈ భూకుంభకోణాన్ని భయట పెడతాడు. అర్హులకు భూమి అందే విధంగా సహాయ పడతాడు. దీంతో ఆ విలన్ గ్యాంగ్ శ్రీమన్నారాయణ ను ఒక భారీ నగదు కుంభకోణంలో ఇరికించి, ఆ ధనాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేస్తారు. శ్రీమన్నారాయణ ఆ ప్రయత్నాన్ని ఏలా అడ్డుకున్నాడు. ఆ ధనాన్ని తిరిగి ఏలా రాబట్టాడు అన్నది చిత్ర కథ. (రైతు సంక్షేమం కోసమే ఆ భారీ నగదును శ్రీమన్నారాయణ తండ్రి విరాళాల ద్వారా సేకరిస్తాడు). నటీనటుల ప్రతిభ : అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమాను బాలకృష్ణ తన భుజాల మీద మోసాడు. పోషించింది జర్నలిస్టు పాత్రే అయినా ఎక్కడా తన అభిమానులు నిరాశ చెందకుండా చూశాడు. పవర్ పుల్ మాటలు పేల్చాడు. ఫైట్స్ బాగా చేశాడు. ఇక పాటలలో కొత్త బాలకృష్ణను చూడొచ్చు. ఒక్కో పాటలో ఒక వైరటీ స్టెప్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ సర్దార్ పాపారాయుడు పోలిన గెటెప్ లోనూ, శ్రీ నరసింహ స్వామి గెటెప్ లోనూ కనిపించి థియేటర్లలో అభిమానుల చేత జై జై బాలయ్య అనిపించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సిబిఐ మీద బాలకృష్ణ చెప్పిన డైలాగులు త్వరలో జరిగే బాలకృష్ణ రాజకీయ ప్రవేశానికి ఢంకా మోగించే విధంగా ఉన్నాయి. శ్రీమన్నారయణకు తోటి జర్నలిస్టుగా పార్వతి మెల్టన్, మరదలుగా ఇషా చావ్లా అందాలు ఆరబోశారు. బొద్దుగా కనిపిస్తూ ఇషాచావ్లా అలరిస్తే.. జీరో సైజ్ తో పార్వతి మెల్టన్ ఆకట్టుకుంది. ఆరుగురు విలన్లలను బాలయ్య హీరోయిజం చూపెట్టటానికి పెట్టినట్లు ఉంది. మిగిలిన వారు తమ పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫి బాగుంది. చక్రీ స్వర పరిచిన పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే వాటి చిత్రీకరణ కూడా బాగుంది. ఇక మాటలు విషయానికి వస్తే బాలకృష్ణ అభిమానులు ఆకట్టుకుంటూనే మంచి మాటలు రాయటానికి రచయిత కృషి చేశాడు. ‘బాదటానికి బయోడేటా ఎందుకురా..’, ‘అనార్యోగంతో చస్తే దేవుడి ఖాతాలో పోతావు. అవినీతి చేస్తే నా ఖాతాలో పోతావు.’ ‘జైజైలు కొట్టిన 99 మంది కోసం కాదు. వేలెత్తి చూపిన ఒక్కడి కోసం నిజాన్ని భయటపెడతా..‘ ‘ శ్రీమన్నారాయణే నాకు దిక్కు, నాకు శ్రీమన్నారాయణే కిక్కు’ వంటి మాటలు బాగున్నాయి. నిర్మాత బాలకృష్ణ స్థాయి తగ్గట్లుగానే ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడు విషయానికి వస్తే బాలకృష్ణ ఇమేజ్ ను ఉపయోగించుకుంటూనే అతడిని కొత్తగా చూపడానికి కృషి చేశాడు. ఒక సాధారణ కథను తన శక్తి మేర బిగువైన కథనంతో నడపటానికి ప్రయత్నం చేశాడు. ప్రారంభంలో సినిమా నెమ్మదిగా సాగినా ఫస్టాఫ్ మధ్య నుంచి వేగంగా సాగుతుంది. సెకాండఫ్ మొత్తం ఆసక్తి కలిగేటట్లుగా దర్శకుడు తన పనితనాన్ని చూపెట్టాడు. బాలకృష్ణ అభిమానుల కోసమే ఈ సినిమా తీసినా తన శైలి చూపించడానికి రవికుమార్ చావలి ఎక్కడా వెనకడుగు వేయలేదు. హైలెట్స్ : బాలకృష్ణ నటన, గెటప్పులు, హీరోయిన్ల అందాలు, పాటలు, మాటలు డ్రాబ్యాక్స్ : వినోదం పెద్దగా లేకపోవడం, సాధారణంగా సాగే ఫస్టాఫ్ మొదటి బాగం, బలమైన విలనిజం లోపించడం. చివరిగా : శ్రీమన్నారాయణ సినిమా బాలకృష్ణ అభిమానులకు బిర్యానీ పెట్టకపోయినా... ఫుల్ మీల్స్ కు మాత్రం లోటు చేయదు. Srimannarayana English Review :: http://bit.ly/SWYRWw Srimannarayana Articles :: http://bit.ly/STrZ2q Srimannarayana Images :: http://bit.ly/PPb4M7 Srimannarayana Videos :: http://bit.ly/QB75nO 

మరింత సమాచారం తెలుసుకోండి: