రెజీనా అందాలు మరియు హావభావాలు , సినిమాటోగ్రఫీ , జెబి సంగీతం రెజీనా అందాలు మరియు హావభావాలు , సినిమాటోగ్రఫీ , జెబి సంగీతం అల్లు శిరీష్ , ఆసక్తికరంగా సాగని సెకండ్ హాఫ్ , కథనంలో అసలు పట్టు లేకపోవడం

శిరీష్(అల్లు శిరీష్) ఒక స్వార్ధపరుడు , సువర్ణ (రెజిన) కూడా స్వార్ధపరురాలు ఇద్దరు వై ఛానల్ లో పని చేస్తూ ఉంటారు. ఒకరేమో ప్రోగ్రాం ప్రొడ్యూసర్, ఇంకొకరు క్రియేటివ్ డైరెక్టర్ గా చేస్తుంటారు. ఆ ఛానల్ ఎండీ అయిన రమేష్(రావు రమేష్) వీరిద్దరిని హైదరాబాద్ బ్రాంచ్ ని పైకి తీసుకురావాలని నియమిస్తాడు. వీరిద్దరూ కలిసి "కొత్త జంట" అనే ప్రోగ్రాం ని మొదలు పెడతారు. ప్రేమించుకున్న జంటలకి పెళ్లి చేసే ఈ కార్యక్రమంలో వీరికి తెలియకుండా యూత్ లీడర్ వీరబాబు చెల్లికి అనుకోకుండా పెళ్లి చేసేస్తారు. అక్కడ నుండి వీరికి అనుకోని సమస్యలు మొదలవుతాయి. ఇదిలా ఉండగా పోసాని కృష్ణ మురళి, శిరీష్ కి ఒక ఆఫర్ ఇస్తాడు కాని సువర్ణ కూడా శిరీష్ తో కలిసి ఆ ఛానల్ కి పని చెయ్యాలని కండిషన్ పెడతాడు. కానీ దీనికి సువర్ణ ఒప్పుకోదు అప్పుడే శిరీష్ సువర్ణ మీద తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. అలా కొద్ది రోజులు గడిచాక సువర్ణ కూడా తన ప్రేమను వ్యక్తపరిచే సమయంలో శిరీష్ లో స్వార్థం గురించి తెలుస్తుంది. దాంతో విడిపోతారు.. ఇక్కడి నుండి వారు ఎలా కలిసారు? శిరీష్ లోని స్వార్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది మిగిలిన కథ ....

అల్లు శిరీష్ , ఈ చిత్రంలో స్వార్ధపరుడి పాత్రలో కనిపించిన ఈ నటుడు తన మొదటి చిత్రంతో పోలిస్తే బాగానే నటించారని చెప్పుకోవచ్చు అయన బాడీ లాంగ్వేజ్ మరియు టైమింగ్ బాగా మెరుగుపడింది కానీ అతని డిక్షన్ మరియు హావభావల ప్రదర్శన చాలా మెరుగు పడవలసి ఉంది. ఈ చిత్రానికి ప్రధానంగా నిలిచింది రెజీనా, తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఒకవైపు అల్లు శిరీష్ హావభావాలను ప్రదర్శించడానికి కష్టపడుతున్న తరుణంలో తన హావభావాలతో సన్నివేశాలను కాపాడగలిగింది ఈ నటి. రోహిణి పాత్ర చాలా చిన్నదయినా ఉన్న కాసేపట్లోనే తన పాత్రను గుర్తుండిపోయేలా చేసుకోగలిగారు. రావు రమేష్ పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. పోసాని కృష్ణ మురళి తనలానే నటించినా పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రతి నాయకుడి పాత్రలో నటించిన సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్ లో నటించినట్టే నటించారు. సప్తగిరి కాసేపు నవ్వించారు..

కథ కథనం మాటలు దర్శకత్వం ఇలా నాలుగింటినీ మారుతినే హేండిల్ చేసారు. కానీ ఇందులో ఏ ఒక్క విభాగంలో కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. కథ చాలా సన్నది అయిపోవడంతో దానికి పట్టు లేని కథనం కూడా తోడవడంతో చిత్రం ఆసాంతం ఒకేచోట తిరుగుతున్నట్టు అనిపిస్తుంది సరిగ్గా చెప్పాలంటే ఒక సీన్ ని రకరకాలుగా చూసినట్టు అనిపిస్తుంది. కానీ పాత్రలను మలచిన తీరు చాలా బాగుంది. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ తన "మార్కు" బూతు డైలాగ్స్ ని అక్కడక్కడా అవసరం లేకున్నా జొప్పించారు. చివరిగా దర్శకత్వం, ఈ విభాగంలో అయన గత చిత్రాలతో పోలిస్తే చాలా వీక్ గా అనిపించింది. ముఖ్యంగా శిరీష్ నుండి ఇంకాస్త నటనను రాబట్టుకొని ఉండవచ్చు అనిపించింది. సినిమాటోగ్రఫీ అందించిన రిచర్డ్ ప్రసాద్ చిత్రాన్ని చాలా అందంగా చూపెట్టారు. కానీ కొన్ని చోట్ల ఫోకస్ పెట్టడంలో చాలా ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. సంగీతం అందించిన జెబి చాలా కష్టపడ్డారు. పాటలన్నీ వినడానికి బాగా ఉన్నాయి అంతే కాకుండా నేపధ్య సంగీతం చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ చేసిన ఉద్ధవ్ కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో అనవసరంగా పొడిగించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గినట్టు అనిపించలేదు.

ఒక చిత్రం హిట్ అవ్వాలంటే ముఖ్యంగా కావాల్సింది మంచి కథ దానికి తగ్గ కథనం ఈ చిత్రంలో ఈ రెండు లోపించాయి అసలు బలం లేని కథకి పట్టు లేని కథనాన్ని జోడు చేసి చివరి వరకు ఒక్కటే సన్నివేశాన్ని రకరకాలుగా చూపెట్టి మాయ చెయ్యాలని ప్రయత్నించారు. నిజానికి శిరీష్ పాత్రను వివరించడానికే ఒక గంటకు పైగా తీసుకున్న దర్శకుడు శిరీష్ పాత్ర అర్ధం అయిపోయినా కూడా ప్రతి రెండు సన్నివేశాలకు ఒకసారి మళ్ళీ శిరీష్ పాత్ర ఏంటో చెప్పడానికి ప్రయత్నించారు. దీనివల్ల చూసిన సన్నివేశాల్నే మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇక శిరీష్ హావభావాలు సరేసరి, హీరోయిన్ ఎమోషనల్ గా నటించేస్తుంటే ఏం ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో అర్ధం కాక చాలా సార్లు బిక్కమొహం వేసుకొని చూసాడు. పాత్రలను మలచిన తీరు మరియు జెబి సంగీతం, రెజీనా అందాలు తప్ప ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ లేవు. నిజానికి ఈ చిత్రంలో "కొత్త" అన్నది పేరుకి మాత్రమే పరిమితం అయ్యింది. అదే పాత కథ అదే పాత కథనం అదే పాత ప్రేమ కథ ఇలా అని పాతవే ఉన్నాయి. దర్శకుడు మారుతి తీసిన బలహీనమయిన చిత్రం ఇది ఎంతకీ కథను చెప్పడం మొదలుపెట్టడు. నిజానికి ఇలాంటి పాత్రలకు మంచి కథనం అలానే మంచి దర్శకుడు జోడయ్యి ఉంటే చిత్రం చాలా బాగుండేది. మొదటి అర్ధ భాగం కాస్త వినోదాత్మకంగా సాగినా రెండవ అర్ధ భాగం పూర్తిగా నెమ్మదిగా సాగింది.. ఇక చివర్లో ఎమోషనల్ సన్నివేశాలలో రోహిణి గారు అద్భుతంగా నటిస్తుంటే శిరీష్ సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలి అంటే రెజీనా కోసం, ఎందుకు చూడకూడదు అంటే మీ జాగ్రత్త కోసం... తరువాత మీ ఇష్టం ...

Allu Sirish,Regina Cassandra,Maruthi,Bunny Vasuకొత్త జంట - కొత్తగా ఏమీ లేదు...

మరింత సమాచారం తెలుసుకోండి: