1970 లలో ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి అనే పేరు మారుమ్రోగిపోయేది. యూనివర్సిటీ టాపర్ గా ఉంటూ విద్యార్థుల తరుపున పోరాడిన జార్జ్ రెడ్డి గురుంచి ఇప్పటి తరానికి తెలియదు. చరిత్ర మరిచిన ఒక గొప్ప విద్యార్ధి నాయకుడి తెలియజేయడానికి డైరెక్టర్ జీవన్ రెడ్డి తీసిన "జార్జి రెడ్డి " సినిమా ఈరోజు విడుదల అయింది. ఈ సినిమాపై ఎక్స్ క్లూజివ్ రివ్యూ...

 


కథ విషయానికి వస్తే తల్లి ప్రోత్సాహంతో చిన్నతనం నుండే భగత్ సింగ్, చేగువేరా ల జీవితాలను చదువుతూ ఉండే జార్జి రెడ్డికి వారి లాగే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను కలిగి తన ముందు ఎలాంటి అన్యాయం జరిగిన వాటికి ఎదురు తిరుగుతుంటాడు. చదువుతో పాటు అనేక విషయాల్లో జార్జి రెడ్డి చురుకుగా ఉంటాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుబెట్టిన తరువాత జార్జి రెడ్డి జీవితమే మారిపోతుంది. యూనివర్సిటీ టాపర్ గా, విద్యార్ధి నాయకుడిగా ఉన్న జార్జి రెడ్డిని కొంతమంది దారుణంగా హత్య చేస్తారు. అస‌లు జార్జిరెడ్డిని హ‌త్య చేసిందెవ‌రు? ఎందుకు హ‌త్య చేశారు? అనే విష‌యాలు తెర మీద చూడాల్సిందే..!

 


ఎవరెలా చేశారు..?.. వంగవీటి సినిమాలో వంగవీటి రంగా, రాధా పాత్రలలో సూపర్ గా నటించిన సందీప్ మాధవ్ జార్జి రెడ్డి పాత్రలో కూడా ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్‌, దుస్తులు, హావభావాలు అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. ముఖ్యం కొన్ని సీన్ లలో సందీప్ చెప్పే డైలాగ్స్ తో జార్జి రెడ్డిని కళ్ళముందు చూస్తునట్లుగానే ఉంటుంది. ఇక మిలిగిన పాత్రల్లో జార్జి రెడ్డి తల్లిగా చేసిన  మరాఠీ నటి దేవిక అద్భుతంగా నటించింది. సత్య దేవ్ కి పవర్ ఫుల్ పాత్ర ఉన్నప్పటికి సరైన సీన్స్ పడలేదు. జార్జి రెడ్డి స్నేహితులుగా నటించిన అభయ్, యాదమ్మరాజు సూపర్బ్ గా నటించారు.

 

విశ్లేషణ: జార్జి రెడ్డి అనే సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై ఇండస్ట్రీలో బజ్ ఏర్పడింది. ప్రేక్షకుల్లో కూడా జార్జి రెడ్డి గురించి తెలిసిన వారు… అత‌ని క‌థ‌ని ఎలా తీశారో చూద్దామ‌ని, తెలియ‌నివాళ్లు అస‌లు జార్జి రెడ్డి క‌థేమిటో తెలుసుకుందామ‌ని ఈ సినిమాపై ఆసక్తిని కనబరిచారు. ఈ ఆసక్తిని క్రియేట్ చేయడంలో దర్శకుడు జీవన్ రెడ్డి వంద శాతం విజయం సాధించాడు. 

 

జార్జి రెడ్డి సినిమా దారుణ హత్యకు గురైన గొప్ప విద్యార్ధి నాయకుడి సినిమా కావడంతో దర్శకుడికి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కథలో చేర్చుకోవడానికి ఆవకాశం దొరికింది. 1970 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప‌రిస్థితుల‌ను, అప్ప‌టి హెయిర్ స్టైల్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ల‌ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశారు.  ఫస్ట్ హాఫ్ లో జార్జి రెడ్డి చిన్నతనం నుండి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఎమోషన్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి క్యారెక్టలు ఎక్కువ కావడంతో కొంచెం తడబడ్డాడు.  

 

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించాలనే ఉద్దేశంతో కథను కాస్త డీవియేట్‌ అయినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్లు అతికినట్టుగా కనిపించడం, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ల కోసం అనేక చోట్ల ఇంగ్లీష్‌, హిందీ బాషను వాడటం రుచించలేదు. ఇలాంటి సినిమాలకు మాటలు ముఖ్యం. కానీ చాలా చోట్ల తేలిపోయినట్లు కనిపిస్తోంది. పలు చోట్ల తల్లి కొడుకుల సెంటిమెంట్‌, వారి మధ్య వచ్చే ఎమోషన్‌ సీన్స్‌ ప్రేక్షకుల హృదయాలను కదలించడం ఖాయం. ఇక హీరోయిన్‌ వన్‌ సైడ్‌ లవ్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మరో ప్రధాన అంశం సినిమాటో​గ్రఫి. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం. మొత్తానికి గొప్ప విద్యార్ధి నాయకుడి జీవిత చరిత్రను ఇప్పటి తరానికి తెలియజేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇక  రేటింగ్ 3 /5  ఇవ్వడం జరిగింది 

 

మరింత సమాచారం తెలుసుకోండి: