ఏమి లేవుఏమి లేవుఅన్నీ ఉన్నాయి

రిషి(తరుణ్) కాలేజీ విద్యార్థి, రాష్ట్ర విద్యార్ధి సంఘం నాయకుడు కూడా , ఏ కాలేజీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అతనే పరిష్కరిస్తుంటాడు. అలా ఒక సమస్యను పరిష్కరించే తరుణంలో మధు(యామి) ని చూస్తాడు రిషి. మొదటి చూపులోనే మధుతో ప్రేమలో పడ్డ రిషి ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా భూములను కబ్జా చేసే నక్క నాగినీడు(నాగినీడు) పధకాలను తిప్పి కొడుతుంటాడు శంకరన్న(శ్రీ హరి) దాంతో శంకరన్న మీద పగ పెంచుకున్న నాగినీడు , శంకరన్న చెల్లెలు అయిన మధుని తీసుకెళ్ళి శంకరన్న మీద తనకున్న పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అమెరికా నుండి ఇండియా కి వచ్చిన రిషి అన్నయ్య షాపింగ్ మాల్ లో మధుని చూసి ఇష్టపడతాడు. తనకు తెలియకుండానే రిషి వీరిద్దరి పెళ్ళికి శంకరన్నను ఒప్పిస్తాడు. ఇక రిషి మధు ఎలా కలిసారు? నాగినీడు పగ తీర్చుకున్నడా లేదా అన్నది మిగిలిన కథాంశాలు ...

ఒకప్పట్లో పరిశ్రమ హిట్ లు ఇచ్చిన తరుణ్ ఇప్పుడు హిట్ కొట్టడానికి కష్టపడుతున్నాడు, నటనా పరంగా కూడా ఆకట్టుకోలేని స్థాయికి చేరుకున్నారు తరుణ్. ఈ చిత్రంలో అయన చుపించాలనుకున్న లవర్ బాయ్ స్టేటస్ అతికించినట్టుగా ఉంది. ఇక యామి గౌతం బొత్తిగా ఇష్టం లేకుండా చేసిన చిత్రం లా అనిపిస్తుంది విక్కి డోనార్ చిత్రీకరణ సమయంలో ఒప్పుకున్న చిత్రం కాబట్టి ఏదో తూతూమంత్రంగా నటించినట్టు అనిపిస్తుంది. శ్రీ హరి నటనాపరంగా బలంగా కనిపించినా పాత్ర అంత బలంగా చూపించలేకపోవడం తో తేలిపోయింది, అందులోనూ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడంతో నప్పలేదు. నాగినీడు పాత్రలో బలం లేదు అలానే అయన నటనలోను లేదు. చంద్రమోహన్ నటన పరంగా ఒకే అయిన డబ్బింగ్ వేరే వాళ్ళ చేత చెప్పించడంతో ఆ పాత్రా తేలిపోయింది. కృష్ణ భగవాన్ మరియు వేణు మాధవ్ లు నవ్వించలేకపోయారు. మిగిలిన పాత్రలు తెర మీద ఉన్న కనబడటం కష్టమే...

దర్శకుడు భారతి గణేష్ దారుణమయిన విఫలానికి ప్రతీక ఈ చిత్రం, దర్శకత్వం , మాటలు, కథ ఇలా ఏ విభాగంలో పాస్ మార్కులు సాదించుకోలేకపోయారు భారతి గణేష్. సినిమాటోగ్రఫీ అందించిన జశ్వంత్ బ్యాంకాక్ అందాలను కూడా అందవిహీనంగా చూపెట్టారు. ఎడిటర్ పనితనం బాగోలేకపోవడం కాదు దారుణంగా ఉంది అని చెప్పాలి, ఒక సన్నివేశం నుండి మరో సన్నివేశంలోకి వెళ్ళేప్పుడు ప్రేక్షకుడు లాంగ్ జంప్ చెయ్యాలి అంత దారుణమయిన జంప్స్ ఉంటాయి. సంగీతం విషయంలో అవసరమయిన పాటలను బాగా ఇవ్వలేదు కాని అవసరానికి మించి నేపధ్య సంగీతం ఇచ్చారు అందులోనూ కొన్ని సన్నివేశాలలో అర్ధం పర్ధం లేకుండా నేపధ్య సంగీతం మారిపోతుంది. నిర్మాణ విలువలు అసలు బాగోలేదు.

ఒక చిత్రం తెరకెక్కించడానికి ఒక దర్శకుడి శ్రమ తెర మీద కనబడుతుంది అంటారు కాని ఈ చిత్రం కోసం దర్శకుడు పడిన కష్టాలు కనిపిస్తాయి తెర మీద తారల డేట్స్ కుదరక కాంబినేషన్ లేక క్లోజ్ అప్ షాట్ లతో కానిచ్చేసారు అంతే కాకుండా డబ్బింగ్ విషయం మరీ దారుణం ప్రధాన పాత్రలలో తరుణ్ మాత్రమే తన స్వంత గొంతుతో మాట్లాడారు. సాంకేతికంగా ఈ చిత్రం దారుణంగా విఫలం అయ్యింది సినిమాటోగ్రఫీ లో ఎంతో అందంగా ఉండే యామి గౌతం కూడా అందంగా చూపించలేకపోయారు.

ఇక ఈ చిత్రాన్ని ఎందుకు ఒప్పుకున్నాం రా బాబు ? అన్న ప్రశ్న చిత్రం ఆసాంతం యామి మొహంలో కనిపిస్తుంటుంది అసలు ఆమె వస్త్రాలంకరణ చూస్తే హీరోయిన్ ల అసలు కనిపించదు. కృష్ణ భగవాన్ మరియు వేణుమాధవ్ ల కామెడీ నవ్వించక పోగా చిరాకు పెట్టి విరక్తి కలిగిస్తుంది. నేను లవర్ బాయ్, నేను చేసేది నటన అన్న భావం నుండి బయటపడి ఏదయినా కొత్త అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తే తరుణ్ నిలదొక్కుకునే అవకాశం ఉంది. మాస్ హీరో గా ఆయనను చూసే ఓపిక ప్రేక్షకులకు లేదు అవే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి తప్పక చూడడానికి వచ్చిన ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు.. యుద్ధం అన్న పేరు చూసి ఎవరు ఎవరి మీద ప్రకటించారో అన్న సందేహం రావచ్చు ఇది దర్శకుడు ప్రేక్షకుడి మీద ప్రకటించిన యుద్ధం ఎంతటి వీరుడయిన ఓడిపోయే యుద్ధం ఇది ...

Tarun,Yami Gautam,Bharathi Ganesh,Natti Kumar.యుద్ధం - వెళ్ళడం వ్యర్థం

మరింత సమాచారం తెలుసుకోండి: