నటీనటుల పనితీరు, అన్ని కథలను సరిగ్గా ముగించడంనటీనటుల పనితీరు, అన్ని కథలను సరిగ్గా ముగించడంకథలన్నీ పేలవంగా ఉండటం, కథనం, డైలాగ్స్, బొత్తిగా ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, ఎడిటింగ్ఈ కథ సారథి(కిషోర్) దగ్గర మొదలవుతుంది, స్వతహగా రచయిత అయిన సారథి రోజూ చూసే పాత్రలతోనే లైఫ్ అని ఒక కథ రాయడం మొదలుపెడతాడు. అలా ఏడు కథలను కలిపి ఒక కథగా రాయడం మొదలుపెడతాడు, ఆ కథలు ఇలా సాగుతాయి ...

మొదటగా బిచ్చగాడు(కృష్ణేశ్వర రావు) కథ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చమెత్తుకొని రూపాయి రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నది ఇతని ఆశ అలానే అతను కొన్ని లక్షలు కూడబెట్టి ఒక ఇల్లు కొనాలని అనుకుంటాడు అతని ఆశ నెరవేరిందా లేదా అన్నది ఈ కథ ...

జి వెంకటేశ్వర రావు(కృష్ణుడు), అధార్ కార్డు ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , అతనికి లేనిదంటూ ఏదీ ఉండదు, బ్యాంకు లో బాలన్స్ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది కాని అతనికి ముప్పై ఏళ్ళు వచ్చినా లావుగా ఉండటాన్నే కారణంగా చూపెట్టి అతనికి పిల్లనివ్వరు అలా అతనికి పెళ్లి కాకపోవడం ఒక సమస్యలా మారుతుంది అతనికి ఎలా పెళ్లి అయ్యింది అన్నదే ఈ కథ ...

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో టాప్ లో ఉండి కనుమరుగయిపోయిన మోడల్ లిసా స్మిత్(లక్ష్మి మంచు), తన ప్రభను కోల్పోయాక అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ మోడల్ జీవితంలో ఏం జరిగింది అన్నదే ఈ కథ ...

అమెరికా నుండి ముప్పై ఏళ్ళ తరువాత వచ్చిన మోహన్(నరేష్) తన పాత ప్రియురాలు అయిన సరిత(ఆమని)ని కలవడానికి వెళ్తాడు. భర్తను కోల్పోయిన సరితను కలుస్తాడు మోహన్, ఇద్దరి పిల్లలకు తల్లి అయిన సరిత మరియు మోహన్ అనుకోని పరిస్థితిల్లో శారీరకంగా కలుస్తారు. తరువాత వీరి బంధం ఎటువైపు సాగింది అన్నది వీరి కథ...

అష్రఫ్(అభిజీత్) పాతబస్తీ లో ఒక కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాడు, అతని షాప్ కి రోజు వస్తుంటుంది హసీన(రిచా పనయ్) అలా వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. ఈలోగా హసీన ఇంట్లో సంభంధం చూస్తారు. తరువాత ఎం జరిగింది అనేది వీరి కథ...

రఘు(చైతన్య కృష్ణ) మరియు రేణు (షామిని అగర్వాల్) ఒక కాలేజీ లో చదువుకుంటూ ఉంటారు, స్వతహా గా సులభ మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే మనస్తత్వం ఉన్న రఘు, పొలిటీషియన్ కూతురు అయిన రేణుని ప్రేమలో దింపి తనతో ఏటయినా తీసుకు వెళ్లిపోవాలి అనుకుంటాడు. తరువాత ఏమయింది అన్నది ఈ కథ ..

రఘు(నాగ సౌర్య) మరియు గౌరీ(అమిత రావు) ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉంటారు . బలాదూర్ తిరిగే రఘు ఎలాగయినా అమితను ప్రేమలో పడేయాలని అనుకుంటాడు, గౌరీ మాత్రం రఘు ని ఇష్టపడదు. కాని అనుకోని పరిస్థితుల్లో గౌరీ కి ఇష్టం లేకపోయినా వీరిద్దరికీ పెళ్లి చేసేస్తారు, తరువాత వృత్తి రిత్య హైదరాబాద్ లో మునిసిపాలిటి లో పని చేస్తుంటాడు రఘు వీరిరువురి జీవితం ఎటువంటి మలుపు తిరిగింది అనేది వీరి కథ ...

చివరిగా సారథి కథకు వస్తే సారథికి ఒక కూతురు ఉంటుంది. సారథి కూతురు కాన్సర్ తో బాధపడుతూ ఉంటుంది. దాన్ని నయం చెయ్యడానికి కాను ఐదు లక్షలు అవసరం అంటారు వైద్యులు. ఒక రచయితగా తన దగ్గర అంత డబ్బులు ఉండవు, ఆ డబ్బు ఎలా సంపాదించాడు అన్నది ఈ కథ ..

ఇలా ఇన్ని వేరు వేరు కథలు ఒక చోట కలుస్తాయి ఎక్కడ అనేది తెర మీద చూడవలసిందే...

లక్ష్మి మంచు మోడల్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు ముఖ్యంగా తన యాస ఈ పాత్రకు చాలా ఉపయోగపడింది. ఈ పాత్రకు కావలసిన వ్యక్తిత్వాన్ని చాలా అందంగా చూపగలిగారు..

ఒక రచయిత పాత్రలో కిషోర్ ఆ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు ముఖ్యంగా కూతురి ఆరోగ్యం గురించి తెలిసాక అతని నటన చాలా బాగుంది.

నరేష్ మరియు ఆమని తమ పాత్రలకు తమ అనుభవాన్ని జోడించి నటించారు కాని వీరి పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి...

అభిజీత్ తన పాత్రకు తగ్గ న్యాయం చేసాడు, అదే సమయంలో రిచా పనయ్ కూడా బాగా నటించింది.

కృష్ణుడు పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచారు, బిచ్చగాడి పాత్రలో కనిపించిన కృష్ణేశ్వర రావు అధ్బుతంగా నటించారు.నిజానికి అతను నటించినట్టు ఎక్కడా అనిపించలేదు. నాగ సౌర మరియు అమిత రావు పరవలేధనిపించారు. ఇక కొండవలస లక్షమన రావు ,పావలా శ్యామల , వాసు ఇంటూరి, వెన్నెల కిషోర్, చైతన్య కృష్ణ మరియు శామిని అగర్వాల్ తమ పాత్రలకు తగ్గ ప్రదర్శన కనబరిచారు.

కథ మాటలు కథనం దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను హేండిల్ చేసిన ప్రవీణ్ సత్తారు కథ దర్శకత్వం లో మాత్రమే సఫలం అయ్యారు. కొత్తరకమయిన కథతో మన ముందుకు రావడం నిజంగా ధైర్యంతో కూడుకున్న పని, ఈ విషయంలో ఆయన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అలానే దర్శకత్వం విషయంలో కూడా అయన ఫస్ట్ క్లాసు మార్కులు కొట్టేసారు. ఇక ఈ చిత్రానికి ప్రధాన ఆయుధం అయిన కథనం విషయానికి వస్తే ఎనిమిది కథలను కలిపిన తీరు అద్భుతంగా ఉన్నా కథలను బాగా నెమ్మదిగా నడపడంతో చిత్రం మీద పూర్తిగా ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. మాటలు కొన్ని చోట్ల మాత్రమే బాగున్నాయి ఇంకాస్త పదునయిన మాటలు ఉండి ఉంటె చిత్ర ప్రభావం మరింత పెరిగేది. సినిమాటోగ్రఫీ అందించిన సురేష్ రగుటు చాలా అందంగా చూపెట్టారు ఏ కథకి ఆ కథకి మధ్య తేడా చూపించడంలో ఈయన పనితనం చాలా ఉంది ఏ పాత్రకు తగ్గ లైటింగ్ ఆ పాత్రకి ఇఛ్చారు. సంగీతం అందించిన మిక్కి జె మేయర్ పాటలు రెండు ఆకట్టుకోగా అయన అందించిన నేపధ్య సంగీతం అవసరానికి మించి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎడిటర్ చాలా సన్నివేశాలను కత్తిరించవలసి ఉంది ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో చాలా సన్నివేశాలు ఎడిటర్ కత్తెర ను తప్పించుకొని తెర మీదకు వచ్చేసాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి చిన్న చిత్రమే అయినా రిచ్ లుక్ ఉంటుంది.

అంథాలజి చిత్రం అనే విభిన్న కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చిన ప్రవీణ్ సత్తారు, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది ఈ చిత్రంలో ఏ కథ కూడా ఒక గమ్యం వైపు సాగదు, పోనీ ఆసక్తికరంగా అయినా సాగుతుందా అంటే బాగా నీరసంగా "సాగుతుంది". ఒక కథకు చెందిన ఒక సన్నివేశం వచ్చాక చాలా సేపటికి అదే కథకు చెందిన మరొక సన్నివేశం వస్తుంది, కాని ముందు వచ్చిన సన్నివేశానికి ఈ సన్నివేశానికి తేడా కనబడదు. కాని ఈ చిత్రంలో మెచ్చుకోదగ్గ కొన్ని అంశాలు ఉన్నాయి. ఇన్ని కథలను కలిపి రచించినా కూడా ఎక్కడా ప్రేక్షకుడికి గందరగోళం ఉండదు. ఏ కథకి ఆ కథ చాలా క్లియర్ గా చూపెట్టారు అంతే కాకుండా ప్రతి పాత్రను సరిగ్గా ముగించారు. కథలను ముగించిన విధానం అయితే అద్భుతం అని చెప్పుకోవాలి. కాని సమస్యల్లా చెప్పిన కథలో ఎటువంటి ఇంపాక్ట్ లేకపోవడం.చివర్లో చూపించిన ఒక ట్విస్ట్(అని అనుకున్న ట్విస్ట్) ని మొదట్లోనే చూపించి తరువాత అన్ని కథలను చెప్పుకుంటూ వచ్చి ఉంటె చిత్ర ప్రభావం మరోలా ఉండేది. ప్రయోగాత్మకమయిన చిత్రం చెయ్యడానికి నిర్మాత మరియు దర్శకుడికి చాలా ధైర్యం కావాలి. కాని ఒక ప్రయోగం విఫలం అయితే అటువంటి చిత్రాలను మరోసారి ప్రయత్నించని పరిశ్రమ మనది అలాంటప్పుడు మనం చేసే ప్రయోగం మీద మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది ఈ చిత్రం ఒక మంచి ప్రయోగం కాని చెడ్డ మార్గదర్శి అవ్వకూడదు అని కోరుకుందాం. ఈ చిత్రంలో జరిగిన తప్పులను దిద్దుకొని ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలని ఆశిద్దాం. మీరు విభిన్న చిత్రాలను ఇష్టపడే వారయితే ఈ చిత్రాన్ని ఒక్కసారి కష్టపడి చూడండి వినోదం కోసం అయితే ఈ చిత్రానికి ఎంత దూరంగా ఉంటె అంత మంచిది..

Lakshmi Manchu,Richa Panai,Praveen Sattaru,Chanakya Booneti.చందమామ కథలు : ప్రేక్షకుడికి తప్పవు వెతలు ..

మరింత సమాచారం తెలుసుకోండి: