కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కోలీవుడ్ డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు నిర్మాణంలో ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేసిన సినిమా పెంగ్విన్. ఓటిటిలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతో ఆసక్తి పెంచింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా.. ఇంతకీ పెంగ్విన్ సినిమా కథ ఏంటి..? సినిమా ఆడియెన్స్ కు ఎంతవరకు రీచ్ అయ్యిందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ : రిథమ్ (కీర్తి సురేష్), రఘు (లింగ)ల కొడుకు అజయ్ (మాస్టర్ అద్వైత్). సడెన్ గా ఒకరోజు అజయ్ కనిపించకుండాపోతాడు. కిడ్నాప్ అయ్యాడన్న విషయం తెలుసుకున్న రిథమ్  అతన్ని వెతకడానికి ప్రయత్నిస్తుంది. అజయ్ వేసుకున్న బట్టలు అడవిలో అక్కడక్కడ కనిపించడంతో అజయ్ చనిపోయాడని నమ్ముతాడు రఘు. కాని రిథమ్ మాత్రం అజయ్ బ్రతికే ఉన్నాడని అతనికోసం వెతుకుతుంది. రఘు నుండి దూరమైన రిథమ్, గౌతం (రంగరాజ్)ను పెళ్లాడినా అజయ్ ను వెతకడం మాత్రం ఆపదు. ఇంతకీ అజయ్ బ్రతికే ఉన్నాడా..? అజయ్ ను ఎవరు కిడ్నాప్ చేశారు..? కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది..? అజయ్ తో పాటుగా మరో ఆరుగురు పిల్లలను ఎవరు కిడ్నాప్ చేశారు..? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ :

 

కనిపించకుండాపోయిన కొడుకు కోసం ఓ తల్లిపడే ఆవేదన ఎలా ఉంటుందో చెప్పిన సినిమా పెంగ్విన్. ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా లేకుండా దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ డీల్ చేసిన విధానం బాగానే ఉంది. అయితే టీజర్, ట్రైలర్ లో ఉన్న ఆసక్తి సినిమాలో కనిపించదు. అజయ్ కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ సినిమా రాను రాను ఆడియెన్స్ ను విసిగిస్తుంది.

 

కథ, కథనాలను ఆడియెన్స్ కు ఎంగేజ్ చేయడంలో కొద్దిగా తడపడ్డాడు దర్శకుడు ఈశ్వర్ కార్తిక్. మొదటి భాగంలో కొన్ని సీన్స్ బాగున్నా అవి ఇలా వచ్చి అలా వెళ్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో డౌట్స్ వచ్చేలా కనిపించే పాత్రలు కొన్ని ఉంటాయి. ఈ సినిమాలో కూడా కొన్ని పాత్రలు అలానే ఉంటాయి. అవి కూడా సరిగా లేవని చెప్పొచ్చు.

 

మొదటి నుండి కీర్తి సురేష్ మీదనే నడిపించిన దర్శకుడు చివరకి క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ చేసే సరికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు ఆడియెన్స్ లో ఎక్కడో ఓ చోట ఏదో చెప్పబోతున్నాడు.. ఏదో రివీల్ చేయబోతున్నాడు అన్న ఇంట్రెస్ట్ కాస్త పోతుంది. మొత్తానికి పెంగ్విన్ థ్రిల్ లేని సస్పెన్స్ మూవీగా చెప్పుకోవచ్చు.

 

నటీనటుల ప్రతిభ :

 

సినిమా మొత్తం కీర్తి సురేష్ మీదనే నడిపించారన్న విషయం తెలుస్తుంది. మాహానటితో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ కెరియర్ లో మరో మంచి పాత్ర చేసిందని చెప్పొచ్చు. రిథమ్ పాత్రలో కీర్తి సురేష్ చాలా రిస్క్ తో కూడిన సన్నివేశాలు చేసింది. కీర్తి సురేష్ ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. కీర్తి సురేష్ వరకు ఈ సినిమాకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఇక మిగత పాత్రలన్ని పరిధి మేరకు నటించాయి. అయితే తెలుగు ఆర్టిస్ట్ ఒక్కరు లేకపోవడంతో మన ప్రేక్షకులకు పెద్దగా మెప్పించదు. బడ్జెట్ కంట్రోల్ కోసమనో మరే కారణమో కాని సినిమా కూడా లిమిటెడ్ బడ్జెట్ లోనే ముగించారనిపిస్తుంది.   

 

సాంకేతికవర్గం పనితీరు :

 

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అలరిస్తుంది. బిజిఎం సినిమాకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కొడైకెనాల్ అందాలను బాగా చూపించారు. ఈశ్వర్ కార్తిక్ డైరక్షన్ టాలెంట్ బాగున్నా పెంగ్విన్ సినిమా కథ, కథనాల్లో తన సత్తా చాటలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

కీర్తి సురేష్

 

సినిమాటోగ్రఫీ

 

బిజిఎం

 

అక్కడక్కడ కొన్ని సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

 

స్క్రీన్ ప్లే

 

సెకండ్ హాఫ్

 

క్లైమాక్స్

 

బాటం లైన్ :

 

పెంగ్విన్.. థ్రిల్ లేని సస్పెన్స్ మూవీ..!

 

రేటింగ్ : 2/5
 

మరింత సమాచారం తెలుసుకోండి: