స్వాతి దీక్షిత్ అందాలు స్వాతి దీక్షిత్ అందాలు కథనం ,ఎడిటింగ్ , నేరేషన్ , దర్శకత్వం , సంగీతం ,మొదలుగునవి.

నిడదవోలు లో తనకి పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి "సత్యనారాయణ విలాస్ కాఫీ క్లబ్" ని కాపాడుకుంటూ ఉంటాడు సత్తిబాబు(అల్లరి నరేష్), తనకి నష్టాలు వచ్చినా కూడా ఆ హోటల్ ని అమ్మడానికి ఇష్టపడడు. ఇదిలా సాగుంతుండగా రాజమండ్రిలో వజ్రాల వ్యాపారి అయిన రావు రమేష్ తన తెలివితో సంపాదించిన పది కోట్ల విలువయిన వజ్రాలను ఒక సెల్ ఫోన్ లో దాచి ఖయ్యుం కి ఇచ్చి నిడదవోలు కి పంపుతాడు. ఇదిలా ఉండగా నిడదవోలు కొత్తగా వచ్చిన హెల్త్ ఇన్స్పెక్టర్ మాధవి(ఇషా చావ్లా) సత్తిబాబు హోటల్ కి నోటీసు లు ఇస్తుంది. దీని గురించి మాట్లాడాలి అనుకున్న సత్తిబాబు మాధవిని చూసి ప్రేమలో పడిపోతాడు. కాని మాధవి అందుకు అంగీకరించకపోగా ఒక నెలలో హోటల్ ని మూసి వేస్తాను అని చెప్తుంది ఇలా తనకి ఉన్న సమస్యల చిట్టా పెరుగుతూ ఉండగా సత్తిబాబు జీవితంలో కి వస్తాడు రాంబాబు(ఇంకొక అల్లరి నరేష్).

రాంబాబు వృత్తి పరంగా దొంగ అయితే ఒక దొంగతనం చేస్తూ పట్టుబడి రాజమండ్రి జైలు నుండి విడుదల అయిన రాంబాబు మొదటిసారి చూడగానే గంగ(స్వాతి దీక్షిత్) తో ప్రేమలో పడిపోతాడు. తాత (కోట శ్రీనివాస రావు) సహాయంతో వీరందరు కలిసి హోటల్ ని అభివృద్ధి లో కి తెస్తారు. ఇదే సమయంలో మాధవి తాత సమర సింహ రెడ్డి(ఎం ఎస్ నారాయణ) మాధవిని నరసింహం(పోసాని) కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో నిడదవోలు ఎస్ ఐ సత్తిబాబు హోటల్ ని ఎలాగయినా వీరి చేత అమ్మించాలని అనుకుంటాడు.. ఇదంతా ఒక పక్క అయితే రావు రమేష్ వజ్రాలు ఉన్న సెల్ ఫోన్ కబపడకుండా పోతుంది ఇక్కడ నుండి అందరి కథలు మలుపు తిరుగుతుంది ఎలా తిరగింది? తరువాత ఏమయింది? అని తెలుసుకోవాలంటే చిత్రాన్ని తిలకించవలసిందే...

అల్లరి నరేష్ , మొదటి సారి ద్విపాత్రిభినయం చేసిన ఈ నటుడు తన పూర్తి స్థాయి ప్రతిభ కనబరచలేకపోయారు , ముఖ్యంగా అయన టైమింగ్ ఈ సినిమాలో అసలు బాగోలేదు. ఒక పాత్రలో ఎలా నటించాలో తెలియక తడబడినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈయన కొత్తగా ప్రయత్నించిన డాన్స్ లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు . సరిగ్గా చెప్పాలంటే ఎప్పుడు తన టైమింగ్ తో చిత్రాన్ని కాపాడే అల్లరి నరేష్ ఈ చిత్రంలో టైమింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డాడు. రెండవ పాత్ర అయిన రాంబాబు పాత్ర ఎప్పుడు తను చేసే పాత్ర లాంటిదే కావడంతో అందులో ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. ఇక కథానాయికలలో ఇషా చావ్లా , నటన చూపించుకోగలిగిన పాత్ర దొరికిన అందాలను మాత్రమే చూపెట్టి సరిపెట్టుకుంది. రెండవ కథానాయిక స్వాతి దీక్షిత్ తనకి నటించే అవకాశం లేదని తెలుసుకొని అందాల అరబోతకే పరిమితం అయ్యింది.

పోసాని పాత్ర నిజానికి నవ్వించాల్సిన పాత్ర కాని నవ్వించకపోగా విసుగుపుట్టించింది. రావు రమేష్ పాత్రను కామెడీ గా చూపించాలా విలనిజం చూపించాలా తెలియక జనాన్నే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని వదిలేసారు. రఘుబాబు, ఎం ఎస్ నారాయణ మరియు తాగుబోతు రమేష్ లు ఉన్నారు కాని కామెడీ చెయ్యలేకపోయారు. కోట శ్రీనివాస్ రావు అయన అనుభవాన్ని అంతా రంగరించి పాత్రను బలపరిచారు. మిగిలిన అందరు అలా వచ్చి వెళ్ళినవారే...

సుందర్ సి అందించిన కథలో చిన్న మార్పులు చేసారు కాని అవన్నీ బెడిసికొట్టాయి కాని దాదాపుగా అదే కథను ఉంచేశారు. కథాపరంగా ఈ చిత్రం అంత గొప్పది కాదు కొన్ని ఆంగ్ల చిత్రాలు మరియు కొన్ని హిందీ చిత్రాలను కలిపి చేసిన "కలకలప్పు" నే తెలుగులో "జంప్ జిలాని" చేయించారు. కాని సుందర్ సి తమిళంలో కథనం మీదనే ఎక్కువ దృష్టి సారించారు తెలుగులో మాత్రం ఎక్కడా చిత్రానికి పట్టు కనపడదు.. పైగా సన్నివేశాలను సాగదీసి ప్రేక్షకుడిలో నీరసాన్ని నింపేశారు. కామెడీ అనే పేరుతో ఈ చిత్రంలో చెయ్యంది అంటూ లేదు, అన్ని రకాల కామెడీ ని ప్రయత్నించి విఫలం అయ్యారు. సత్తిబాబు దర్శకుడిగా దారుణంగా విఫలం అయ్యారు చిత్రాన్ని ఒక పట్టుతో నడపడానికి అయన చాలా ఇబ్బంది పడటం తెర మీద కనిపిస్తూనే ఉంది. సినిమాటోగ్రఫీ అందించిన దాసరథి శివేంద్ర బాగానే మెప్పించారు నటీనటులను మరియు లొకేషన్ లను చాలా అందంగా చూపెట్టడం లో ఈయన పనితనం కనబడుతుంది, ఎడిటింగ్ విషయం లో గౌతం రాజు చాలా జాగ్రత్త తీసుకోనవలసింది చిత్ర నిడివి అక్షరాలా నూట అరవై ఐదు నిముషాలు .. ఒక గంట రెండు గంటలు అయితే ప్రేక్షకుడిని మోసం చెయ్యవచ్చు కాని మూడు గంటల పాటు మాయ చేసి కూర్చోబెట్టాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం ఈ చిత్రంలో కూడా అదే జరిగింది.

ఈ కథకు ఇంత నిడివి అవసరం లేదు , ప్రీ క్లైమక్స్ వద్దనే క్లైమాక్స్ ని తీసుకు వచ్చేసి ఉండవచ్చు కాని అక్కడ చాలా అనవసర సన్నివేశాలు తీసుకొచ్చి నింపేశారు వీటన్నింటినీ కత్తిరిస్తే ప్రేక్షకుడికి కాస్తయిన ఉపసమనం కలుగుతుంది. ఒక్క విషయం మాత్రం ప్రేక్షకుడికి ప్రశ్నార్థకమే ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు అక్కడక్కడ కట్ అయినట్టు అనిపిస్తుంటాయి. వీటిని కత్తిరిస్తేనే ఇలా ఉంది అంటే ఇక ఇవి కూడా ఉన్నట్టు అయితే పరిస్థితి మరోలా ఉండేది. సంగీతం అందించిన విజయ్ ఎబెంజేర్ పాటలు గొప్పగా లేవు ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది. అయన అందించిన నేపధ్య సంగీతం అయితే సరే సరి పాత్రకి సరిపడే దానికి మించి మూడు రెట్లు అధికమయిన శబ్దంతో ప్రేక్షకుల చెవులు చిల్లు పడేలా చేసారు, ఇక ఈయన పాటలకు జోగయ్య శాస్త్రి గారు అందించిన సాహిత్యం అయితే అసలు బాగోలేదు "సమంత సమోసా, ఇలియానా బజ్జి, అనుష్క ఆమ్లెట్, శృతి హసన్ సూప్" వంటి సాహిత్యంతో ప్రేక్షకులకు చిర్రెత్తించారు. మాటలు అందించిన క్రాంతి కుమార్ ఎక్కడా ఆకట్టుకోలేదు, పైగా బూతు డైలాగ్ లు కూడా రాసి ప్రేక్షకులను హింసించడం లో అయన పాత్ర అయన పోషించారు. ఇక ఈయన ప్రాస కోసం పెట్టిన పరుగు అయితే ఒలింపిక్ స్థాయిలో ఉంది.. దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది...

ద్విపాత్రాభినయం అంటే రెండు పాత్రలను ఒక నటుడు చెయ్యడం.. ఒక నటుడు రెండు పాత్రలను చెయ్యడం అంటే రెండు వేరు వేరు పాత్రలను ఒక నటుడు వేరు వేరు గా చెయ్యడం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ద్విపాత్రాభినయం చిత్రాలు అన్నింటిలో ఈ విషయం మరిచిపోయారు. రెండు ఒకరే చేస్తున్నారు రెండు పాత్రలను ఒకేలా చేస్తున్నారు, వాటి మధ్యన తేడా చూపించ లేకపోతే ఎన్ని పాత్రలు చేసిన ఎం లాభం.. ఈ చిత్రంలో కూడా అదే జరిగింది నరేష్ పేరుకి రెండు పాత్రలు చేసాడు కాని రెండు ఒకేలా చేసాడు. ఒకటేమో అమాయకమయిన నిజాయితి గల పాత్ర ఇది అతనికి కొత్త కావడంతో అతని పాత స్టైల్ కనపడకుండా ప్రయత్నించడానికి కొత్త స్టైల్ ప్రయత్నించడానికి మధ్యలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డాడు ఇక రెండోది తనకి కంచుకోట అయిన పాత్ర కావడంతో అలవోకగా చేసేసారు... కథానాయికలను అందాల ఆరబోతకే పరిమితం చేసెయ్యడం లో దర్శకుడి ఆలోచన ఏంటో అర్ధం కావడం లేదు. తమిళంలో చేసిన శివ మరియు సంతానం టైమింగ్ ని నరేష్ మరియు పోసాని అందుకోలేకపోయారు. ముఖ్యంగా తమిళంలో రెండవ అర్ధ భాగాన్ని కాపాడింది సంతానం టైమింగ్ ఈ చిత్రంలో పోసాని ఆ స్థాయి టైమింగ్ కనబరచకపోవడంతో రెండవ అర్ధ భాగం నీరు గారిపోయింది కామెడీ సరిగ్గా కుదరక సగం ఉడికిన చిత్రం గా మిగిలిపోయింది.

నరేష్ కామెడీ చేస్తాడు సత్తిబాబు కామెడీ బాగా డీల్ చేస్తాడు అని ఈ చిత్రానికి వస్తే మీకు కలిగేది నిరాశే.. ఈ చిత్రంలో ఖయ్యుం పాత్రకి చిత్రానికి వచ్చిన ప్రేక్షకుడికి ఒక పోలిక ఉంటుంది అక్కడ తెర మీద ఒక పాత్ర అతన్ని పదే పదే కొడుతూ ఉంటుంది ఇక్కడ తెర ముందు అన్ని పాత్రలు నిరంతరం ప్రేక్షకుడిని చితక్కోడుతూ ఉంటుంది. మీకు ఈ చిత్రాన్ని చూడాలి అనిపిస్తే ముందుగా తమిళంలో "కలకలప్పు" అనే చిత్రం చూసాక దాన్ని ఎలా నాశనం చేసారు అని తెలుసుకోవాలి అనుకుంటేనే ఈ చిత్రానికి వెళ్ళండి ఎందుకంటే మూడు గంటలు అనేది జీవితంలో చాలా ముఖ్యమయిన సమయం ఆ సమయాన్ని వేరే ముఖ్యమయిన పనులకి కేటాయించుకోవచ్చు... ఇంతకు మించి మేము చెప్పేది ఎం లేదు..

Allari Naresh,Isha Chawla,E Satthi Babu,Ambica Krishna,Vijay Ebenezer.జంప్ జిలాని - పేరుకి తగ్గ చిత్రం .. జంప్ అవ్వకపోతే జిలాని అయిపోతారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: