సినిమాటోగ్రఫీ ,జేబీ సంగీతం ,సప్తగిరి కామెడీ సన్నివేశాలు సినిమాటోగ్రఫీ ,జేబీ సంగీతం ,సప్తగిరి కామెడీ సన్నివేశాలు నటవర్గం పనితీరు ,సందర్భానుసారం అంటూ లేని పాటలు,మొదట అర్ధ భాగం,రొటీన్ కథనం

సిద్దు ( సుమంత్ అశ్విన్) , ఒక చర్చి కి వెళ్లి తన మనసులోని మాటలను ఆ చర్చి ఫాదర్ (ఎం ఎస్ నారాయణ) తో చెప్పుకుంటాడు. తను ఒక అమ్మాయిని చంపేయాలి అనుకుంటున్నాను అని అదే సమయంలో ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అసలు కథేంటి అని ఫాదర్ అడుగగా తన కథ చెప్పడం మొదలు పెడతాడు.. ఆ కథ ఇలా సాగుతుంది .. సిద్దు ఇంటర్ చదువుకునే రోజుల్లో గీత (తేజస్వి మండవ) ని ప్రేమిస్తాడు కాని ఆమె స్నేహితురాలు అయిన చిత్ర సుబ్రహ్మణ్యం(నందిత) వలన వీరు విడిపోతారు ఆ తరువాత సిద్దు సౌమ్య(షామిలి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి కూడా చిత్ర బాలసుబ్రహ్మణ్యం స్నేహితురాలు కావడంతో చిత్ర వలన సిద్దు ప్రేమ మరొకసారి విఫలం అవుతుంది.ఈ విషయంలో చిత్రకి మరియు సిద్దు కి ఫోన్ లో పెద్ద గొడవ జరుగుతుంది.ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సిద్దు ఒక అమ్మాయిని గుడిలో చూసి ఇష్టపడటం మొదలుపెడతాడు ఆ అమ్మాయే చిత్ర అని తెలుసుకున్నాక పాత గొడవలు గుర్తుకు వస్తుంది. అయినా సరే ఎలాగయినా చిత్రని తన ప్రేమలో పడేయాలని అనుకుంటాడు. సిద్దు, చిత్రని తన ప్రేమలో ఎలా పడేసాడు ఎలా ఒప్పించాడు అన్నదే మిగిలిన కథ ...

సుమంత్ అశ్విన్ నటనాపరంగా ఇంకా చాలా నేర్చుకోవాలి , ఇతనిలో కాస్త కామెడీ టైమింగ్ మరియు డాన్స్ కళలు కనిపిస్తున్నా కూడా ఎమోషనల్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాల వద్ద హావభావాలు పూర్తిగా తేలిపోతున్నాయి. ఈ నటుడు మరింత శ్రద్దగా కీలక సన్నివేశాలలో హావభావాల మీద దృష్టి సారించాల్సి ఉంది. నందిత , ఈ చిత్రంలో ఈ నటి పాత్ర కీలకం కాని ఈ పాత్ర కి ఉన్న ప్రాధాన్యత తన నటనతో చూపించడంలో నందిత విఫలం అయ్యిందనే చెప్పాలి కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే ఆ పాత్రలో ఉన్న ప్రాధాన్యత ఎక్కడా కనపడదు.. అందంపరంగా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సాయి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు ఈ చిత్రం లో అతనికి తెర మీద ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని అతను బాగా వినియోగించుకున్నారనే చెప్పాలి. రెండవ అర్ధ భాగంలో కనిపించే నెల్లూరు గిరి ఒక్కసారికి చిత్రాన్ని వంద మైళ్ళ వేగంతో పరిగెత్తించారు. ఈ నటుడు కనిపించింది చాలా తక్కువ సమయం అయినా కూడా అందరిని దాటేసి ఈ విభాగంలో ప్రధమ స్థానం లో నిలిచారు. వీరు కాకుండా తేజస్వి మండవ, షామిలి, అనిత చౌదరి, ఎం ఎస్ నారాయణ, చాందిని పాత్రల పరిధి మేరకు నటించారు. ఆహుతి ప్రసాద్, వేణు, ఎస్ కే ఎన్ మిగిలిన నటీనటులు అలా కనిపించి మాయం అయిపోయారు..

ముందు కథ దర్శకుడిదే అని చెప్పినా తెర మీదకు వచ్చేసరికి మారుతి లిస్టు లో కి చేరుకుంది. ముందు అనుకున్న కథను మార్చారో లేదా కథ ఎందుకు అనుకున్నారో తెలియట్లేదు కాని ఈ చిత్రంలో కథ అనేది అసలు కనపడదు. కామెడీ సన్నివేశాలను కూర్చి పేర్చి కథనం రాసుకొని దానికి తగ్గట్టు రెండు పాత్రలను సృష్టించారు అనిపిస్తుంది. ఇక మొదటి అర్ధభాగంలో కామెడీ కోసం ప్రయత్నించని విషయం లేదు మారుతీ బలం అయిన బూతు కామెడీ కూడా నవ్వించలేక పోయింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. చిత్రంలో ఒక్కసారి కూడా హీరో హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు హీరోయిన్ హీరో ని ప్రేమించాలి అన్న ఫీల్ కలిగించలేదు.. "హీరో కాబట్టి హీరోయిన్ ని ప్రేమించాలి" అన్న సన్నివేశాలకు "హీరోయిన్ కాబట్టి హీరో ని ప్రేమించాలి" అన్న సన్నివేశాలను జతపరిచి మధ్యలో "కామెడీ మిస్ అవ్వకూడదు" వంటి సన్నివేశాలను బలవంతంగా జొప్పించి రాసుకున్న కథనం ఇది. చిత్రం ఆసాంతం ఒక్క చోట కూడా ఆసక్తికరంగా కనిపించదు. డైలాగ్స్ విషయంలో మారుతీ తన శైలిలో ప్రయత్నించారు కాని ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా పేలలేదు ఇక సెంటిమెంట్ సన్నివేశాలలో బొత్తిగా తేలిపోయింది.. సన్నివేశానికి తగ్గ బలం చేకూర్చడంలో ఈ విభాగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.. దర్శకుడు హరినాథ్ కష్టం కనిపిస్తుంది కాని పట్టులేని కథనంలో అతని కష్టం కలిసిపోయింది. సినిమాటోగ్రఫీ అందించిన జోషి లోకల్ లొకేషన్ లను కూడా చాలా అందంగా చూపించారు. ఉద్ధవ్ ఎడిటింగ్ బాగుంది కాని మొదటి అర్ధభాగంలో మరిన్ని సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది.. జేబీ అందించిన సంగీతం బాగుంది , ముఖ్యంగా అతని నేపధ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు మంచి బలాన్ని ఇచ్చింది.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

"మీరు పొగిడిన వాడిని తిడతారు తిట్టిన వాడి చుట్టూ తిరుగుత్తారు ఇది మీ తప్పు కాదు మాన్యుఫాక్చర్ డిఫెక్ట్ " .. ఇది చిత్రం చివర్లో వచ్చే డైలాగ్, చిత్రం మొత్తం ఈ ఒక్క లైన్ చుట్టూ తిరుగుద్ది కాని మొదలు పెట్టింది మాత్రం ఫ్రాయిడ్ సైకాలజీ దగ్గర.. ఒకవేళ అయన ప్రేమికుల మనస్తత్వం గురించి చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు మొదలెట్టి మధ్యలోనే వదిలేసి రొటీన్ పంథాలోకి చేరుకున్నారు అక్కడ నుండి కథకు ఒక గమ్యం అంటూ ఉండదు. చిత్రం ఒక్క్కొక్క మెట్టు ఎక్కి చివరి సన్నివేశానికి చేరుకోవాలి ఒక్కో సన్నివేశం ఒక్కో మెట్టు లాగా ఉండాలి కాని ఈ చిత్రంలో ఒక సన్నివేశానికి మరొక సన్నివేశానికి బలమయిన బంధం ఉండదు. ఇక ప్రేక్షకుడికి ఎటు వెళ్తున్నామో క్లారిటీ ఉండదు. మొత్తం మీద ఈ చిత్ర మొదటి అర్ధ భాగం చప్పగా సాగిపోతుంది రెండవ అర్ధ భాగంలో సప్తగిరి కామెడీ ఒక్కసారిగా పడిపోతున్న చిత్ర వేగాన్ని పెంచారు. ఈ సన్నివేశాలు మరియు జేబీ సంగీతం కోసం మాత్రమే ఈ చిత్రాన్ని చూడగలం .. ఇవి ఉంటె చాలు అనుకుంటే వెంటనే థియేటర్ కు వెళ్ళిపొండి లేదు ఇవి సరిపోదు అనుకునేవాళ్ళు మరొకసారి ఈ రివ్యూ పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోండి..

Sumanth Ashwin,Nanditha,Harinath,Suryadevara Naga Vamsi,JB. లవర్స్ : ప్రేక్షకుడి చెవిలో ఫ్లవర్స్

మరింత సమాచారం తెలుసుకోండి: