కథనం ,నేపధ్య సంగీతం ,సినిమాటోగ్రఫీ...కథనం ,నేపధ్య సంగీతం ,సినిమాటోగ్రఫీ...డైలాగ్స్, మొదటి అర్ధభాగం సాగదీయడం ,కుటుంబ సంభంధాలను సరిగ్గా చూపించకపోవడం,నేటివిటీ కనిపించకపోవడం

రాంబాబు(వెంకటేష్) రాజవరంలో కేబుల్ నెట్వర్క్ నడుపుతూ ఉంటాడు, అనత అయిన రాంబాబు కష్టపడి పైకి రావడంతో ఆ ఊర్లో రాంబాబు అంటే అందరికి గౌరవం ఉంటుంది. జ్యోతి (మీనా) రాంబాబు భార్య, రాంబాబు కి ఇద్దరు పిల్లలు ఉంటారు అంజు (కృతిక), అను (ఎస్తర్). వీరందరు చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వీరి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది అక్కడి నుండి వీరి జీవితాలు అల్లకల్లోలం అయిపోతుంది. వీరిని ఐ జి గీత ప్రభాకర్(నదియ) వెంటాడటం మొదలుపెడుతుంది. కాని వాటి నుండి ఎలాగయినా తన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటాడు రాంబాబు. అసలు వారి కుటుంబానికి పోలీస్ లకి ఉన్న సంభంధం ఏంటి? ఈ సమస్య నుండి రాంబాబు మరియు కుటుంబం ఎలా బయటపడ్డారు? అసలు రాంబాబు జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఉంటె దగ్గరలోని థియేటర్ కి వెళ్ళిపొండి...

వెంకటేష్ , కుటుంబ కథానాయకుడిగా పేరొందిన ఈ నటుడు మోహన్ లాల్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఈ పాత్రకు తగిన రీతిలోనే ఆకట్టుకున్నారు కాని ఒక కుటుంబానికి పెద్దగా అనిపించడంలో కాస్త తడబడ్డారు అనే చెప్పాలి. కాని ఎమోషనల్ సన్నివేశాల దగ్గర తనదయిన శైలిలో ఆకట్టుకున్నారు. మీనా , మలయాళంలో ఈ నటి చాలా సహజంగా నటించి ఆకట్టుకుంది కాని తెలుగులో మాత్రం కాస్త కృత్రిమ నటన కనబరిచినట్టు అనిపిస్తుంది. కృతిక చేసిన పాత్ర చాలా బాగుంది కాని తన నటన విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉండాల్సింది ఎందుకంటే చాలా సన్నివేశాలలో ఈ పాత్రకి లిప్ సింక్ కుదరలేదు. ఎస్టర్ చాలా బాగా నటించింది, మలయాళం లో నటించిన పాపనే తీసుకోవడంతో ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. నదియా పోలీస్ పాత్రలో చాలా బాగా నప్పింది అంతే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల వద్ద ఆమె అనుభవంతో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. నరేష్ పాత్రకు నటించే అవకాశం లేకపోయినా ఉన్నంతసేపు అయన పాత్ర ఉన్నట్టు అనిపించేలా నటించి ఆకట్టుకున్నారు. రవి కాలే నటన చాలా బాగుంది విలనిజం ని బాగా చూపెట్టారు. సమీర్, చైతన్య కృష్ణ, నెల్లూరు గిరి, చలపతి రావు, అన్నపూర్ణమ్మ, చిత్రం శ్రీను, ఉత్తేజ్ , కాశి విశ్వనాధ్ అందరు ఒక్కో సన్నివేశంలో కనిపించి ఆకట్టుకున్న వారే...

దర్శకురాలు శ్రీ ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే మక్కి కి మక్కి అన్న సూక్తిని ఎటువంటి పరిస్థితిల్లో కూడా మరిచిపోకుండా ప్రతి ఫ్రేమ్ ప్రతి లొకేషన్ ని మలయాళం లో ఎలా ఉందో అలానే ఉండాలి అన్న నిబంధనతో చిత్రాన్ని తీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలలో అదే బాగా సహాయపడినా చాలా చోట్ల మన నేటివిటీ కనపడలేదు. కాబట్టి ఇది మన చిత్రం అనే భావన ఎక్కడా కలగదు పేరుకి రాజవరంలో కథ జరుగుతున్నా కూడా కేరళలో స్థిరపడిన తెలుగు కుటుంబం గురించిన కథ లా అనిపించింది. ఈ విభాగం గురించి చెప్పడానికి ఇంకేం లేదు ఎందుకంటే అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది ఆమె చేసింది ప్రత్యేకంగా ఎం లేదు కాబట్టి శ్రీ ప్రియ డైరెక్టర్ అనడం కన్నా కాపీ రైటర్ అనడం బెటర్..

కథ మరియు కథనం జీతూ జోసెఫ్ , కథ పరంగా ఈ చిత్రంలో చాలా ఉత్తమం అయిన కథ ఉంది ఒక కుటుంబ కథ చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలను జోడించడం అనే ఆలోచన చాలా బాగుంది దానికి తగ్గట్టుగానే ఏక్కడా వేగం తగ్గకుండా చిత్రాన్ని నడిపించారు. చివరి సన్నివేశం వరకు కూడా సస్పెన్స్ చాలా బాగా వ్రాసుకున్నారు. మలయాళం లో ఎలా ఉందో ఇందులో అలానే ఉంది. ఇక డార్లింగ్ స్వామి రచించిన సంభాషణలు గురించి చెప్పాలంటే మలయాళ చిత్రం లో ని సంభాషణల సబ్ టైటిల్ ని అనువదించితే ఈ చిత్ర సంభాషణలు వచ్చేస్తాయి. అవి కూడా సందర్భానికి తగినట్టుగా ఉన్నాయి కాని సన్నివేశానికి బలం చేకూర్చలేకపోయాయి. ఇది కాకుండా ఈ చిత్రంలో అనువదించిన అంశం మరొకటి ఉంది చంద్రబోస్ రచించిన సాహిత్యం కూడా అలానే ఉంది అక్కడ పాటలను తీసుకొని అనువదించారు. ఈ చిత్రం రీమేక్ అన్న భావన ఎక్కడా కనపడదు ప్రతి సన్నివేశంలో ఇదొక అనువాదం అన్న భావనే కలుగుతుంది. సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి పనితనం చాలా బాగుంది, కేరళ అందాలను చాలా బాగా చూపించారు. పేరుకి రచన పరుచూరి బ్రదర్స్ అని వేసారు కాని వారు ఎం చేసారు అన్న విషయం అయితే ఎవరికీ అర్ధం కాని విషయం.. శరత్ అందించిన సంగీతం మలయాళంలోకి సరిపోయింది కాని తెలుగులోకి నప్పలేదు, పాటలు చిత్రానికి సరిపోలేదు కాని నేపధ్య సంగీతం చాలా బాగుంది.. ఎడిటర్ మొదటి అర్ధ భాగంలో చాలా సన్నివేశాలు రెండవ అర్ధ భాగంలో కొన్ని అనవసర సన్నివేశాలను కత్తిరించి ఉండచ్చు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఒక చిత్రాన్ని అనువదించడానికి రీమేక్ చెయ్యడానికి తేడా ఉంది అక్కడి నేటివిటీ కి ఇక్కడి నేటివిటీ కి సంబంధం ఉండదు కాబట్టి దాన్ని మనకు తగ్గట్టుగా మార్చుకోడానికి రీమేక్ చేస్తారు అలా లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు అనువదించి ఊరుకుంటారు. దృశ్యం అనే చిత్రం ఈ రెండింటిలో దేని కింద వస్తుంది అనేది ఎవరికీ క్లారిటీ ఉందని అంశం ఎందుకంటే ఈ చిత్ర రీమేక్ హక్కులు అయితే కొనుక్కున్నారు కాని ఏది మారిస్తే ఎమోస్తుందో అన్న భయంతో దాదాపుగా ఎం మార్చడానికి కూడా ధైర్యం చెయ్యలేదు పిన్ టు పిన్ ఏదీ మార్చలేదు.. అక్కడ వాడిన కలర్స్ అక్కడ చూపించిన లొకేషన్స్ అక్కడ చూపించిన ఇల్లు ఇలా అన్ని అక్కడ చూపించినట్టే ఉంటె ఇక్కడ చిత్రంలా ఎలా ఫీల్ అవ్వడం... ఇప్పటి వరకు ఈ చిత్రం ఆ చిత్రంలో పొంతనలు చూసాం ఇప్పుడు ఆ చిత్రానికి ఈ చిత్రానికి తేడాలు చూద్దాం అక్కడ మోహన్ లాల్ నటన అచ్చమయిన పల్లెటూరి వ్యక్తి లాగా అనిపిస్తుంది అంతే కాకుండా ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిలాగా కనిపిస్తాడు, కాని వెంకటేష్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. అక్కడ మోహన్ లాల్ కి తన కుటుంబం ఎంత ముఖ్యం అన్న అంశాన్ని చాలా చక్కగా చూపించారు కాని ఇందులో కథనం ప్రకారం నటిస్తున్నారు కాని వారి మధ్య బంధాన్ని సరిగ్గా చూపించలేకపోయారు. దానివలన ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకుల మీద పడలేదు. అంతేకాకుండా వారి మీద ఎటువంటి జాలి కలగలేదు. వారు చేసింది సరయిన పనే అన్న భావన కలగలేదు. ఇంకా ఈ చిత్రాన్ని ఆ చిత్రాన్ని పోల్చకుండా చూస్తే ఇది మంచి చిత్రమే, నిజానికి ఎంత రీమేక్ చిత్రం అయిన మాతృకతో పోల్చలేము కాని మరీ మాతృక లానే ఉండాలి అని మన ప్రాంతీయత లేకుండా చెయ్యడం ఒక్కటే ఈ చిత్ర విషయం లో బాదించే విషయం.. ఒకవేళ మలయాళంలో ఈ చిత్రం చూడకుండా నేరుగా ఈ చిత్రం చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మలయాళం లో చూసినా మరోసారి ప్రయత్నించదగ్గ చిత్రమే ఇది...

Venkatesh,Meena,Sripriya,D. Suresh Babu,Sharreth.దృశ్యం - మలయాళం,తెలుగు సేం టు సేం

మరింత సమాచారం తెలుసుకోండి: