CMGR Tweet Review || CMGR Full English Review       గబ్బర్ సింగ్ సూపర్ హిట్ సినిమా తరువాత హీరో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బద్రి సినిమా తరువాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఈ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను రాంబాబు అందుకున్నాడా..! చూద్దాం.. పదండి..!   చిత్రకథ : మెకానిక్ రాంబాబు (పవన్ కళ్యాణ్) కు సామాజిక బాధ్యత కొంచెం ఎక్కువ. దీన్ని గమనించిన కెమెరామెన్ గంగ (తమన్నా) అతన్ని మీడియా రంగంలోకి తీసుకుని వస్తుంది. మీడియాలో ప్రవేశించిన రాంబాబు రాజకీయ వేత్త రానాబాబు (ప్రకాష్ రాజ్) అరెస్ట్ కు కారణమౌతాడు. దీంతో రాంబాబుపై రానా పగబడతాడు. దుర్మార్గుడైన రానా బాబు సిఎం కావడానికి కుటిల యత్నాలు చేస్తుంటాడు. వీటిని సామాన్యుడైన రాంబాబు ఎలా ఎదుర్కొంటాడు..?, రానాబాబు ముఖ్యమంత్రి కాకుండా రాంబాబు ఎలా అడ్డుకున్నాడు...అనేది చిత్రకథ     నటీనటుల ప్రతిభ :   కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు పవన్ కళ్యాణ్ ఆయవుపట్టుగా నిలిచాడు. తమన్నాతో లవ్ సీన్లలో ఎంత బాగా ఆకట్టుకుంటాడో, రాజకీయ నాయకులను నిలదీసే సన్నివేశాలలో అంతకంటే రెచ్చిపోయాడు. హీరో పరిచయ సన్నివేశంలోనూ, ప్రకాష్ రాజును అరెస్ట్ చేసే సమయంలోనూ పవన్ కళ్యాణ్ నటన, డైలాగులు ఆకట్టుంటాయి. డాన్సులు, ఫైట్లలలో కూడా పవన్ తన మార్క్ చూపించాడు. అలాగే, తాను మంచినటి అని ఈ చిత్రంతో మరోసారి తమన్నా నిరూపించుకుంది. మగరాయుడిలా కనిపించడంతోపాటు, పవన్ కళ్యాణ్ తో తన ప్రేమను వెల్లడించడం, ఎం.ఎస్.నారాయణతో మందు కొట్టే సన్నివేశాలనూ తమన్నా ఆకట్టుకుంటుంది. అలాగే ‘ఎగస్ర్టానరీ..’ పాటలో తమన్నా గ్లామర్ కు మార్కులు వేయకుండా ఉండలేం. ప్రకాష్ రాజ్ నటన గురించి కొత్తగా చెప్పేదీ ఏమీ లేదు. ఇలాంటివి అతను గతంలో చాలా చేశాడు. లేడీ విలన్ పాత్రలో శృతి రాణించింది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పాత్ర తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని గుర్తుకు తెస్తుంది. పక్షవాతం సోకే సన్నివేశంలో కోట నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రిగా నటించిన నాజర్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే తాను పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిని అయ్యానంటాడు. అలీ, బ్రహ్మనందం, ఎంఎస్.. తమ పాత్రల పరిధిలో నటించారు.     సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ బావుంది. సంగీతం ఆకట్టకుంటుంది. మణిశర్మ స్వర పరిచిన పాటలు అభిమానులకు వీనుల విందు చేస్తాయి. భాస్కర భట్ల సాహిత్యం బావుంది. ‘కదిలిరా. ’ , ‘మెలికలు తిరుగుతుంటే. ’, ‘ఎగస్ర్టారడ్నీ.’ పాటల్లోని పదాలు ఆకట్టుకుంటాయి. పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే ఈ సినిమాలో అతడు దర్శకుడి కంటే మాటల రచయితగానే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తాడు. ప్రభుత్వమే విద్యార్థలకు అన్ని సౌకర్యాలు కల్పించి, మళ్లీ వారిని ఎస్.సి., బి.సి. అంటూ వేరు వేరు హస్టల్స్ లో ఉంచడం ఎందుకు అని ప్రశ్నించే మాటలతో పాటు, అమ్మాయిల గురించి తమన్నాతో పవన్ కళ్యాణ్ చెప్పే సన్నివేశంలోనూ పూరీ తన మాటలతో ఆకట్టుకుంటారు. అలాగే, కొన్ని వర్తమాన రాజకీయ సంఘటనలు, ఉద్యమాలను ఈ సినిమాలో పూరీ చాలా తెలివిగా వాడుకున్నాడు. పరాయి రాష్ర్టాల వారు మహారాష్టను వదిలిపెట్టి పోవాలనే పోరాటాన్ని తెలుగు తల్లి ఉద్యమం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్లు తీశాడు. ఇది మన రాష్ర్టంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకుతెస్తుంది. రాజకీయ నాయకులపై కొన్ని సైటర్లు వేసిన పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో హీరో పాత్రను మరింత గొప్పగా తీయడానికి ప్రయత్నిస్తే బాగుండేది. అలాగే ముగింపు సన్నివేశాల మీద కూడా దర్శకుడు మరింత దృష్టి పెడితే మరింత మంచి సినిమా వచ్చి ఉండేది.         హైలెట్స్ : పవన్ కళ్యాణ్ నటన, తమన్నా యాక్టింగ్, డైలాగులు, పాటలు డ్రాబ్యాక్స్ :   కొత్తతనం లేని కథ, పెద్దగా ఆకట్టుకోని దర్శకత్వం, పవన్ కళ్యాణ్-పూరీ జగన్నాథ్ ల నుంచి ఆశించే వినోదం లేకపోడం   చివరగా :   గబ్బర్ సింగ్ జోరుకు పూరీ జగన్నాథ్ బ్రేకులు      
Prasad can be reached at: Yedida.Viswaprasad@apherald.com   Editor can be reached at: editor@apherald.com
More Articles on CMGR || CMGR Photos & Wallpapers || CMGR Videos  

మరింత సమాచారం తెలుసుకోండి: