KVJ Tweet Review || KVJ Full English Review లీడర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో దగ్గుబాటి రానా. ఇతను నటించిన తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించడంతో అంతా సినిమా కోసం అసక్తిగా  ఎదురుచూశారు. అలాగే, శ్రీరామరాజ్యం తరువాత నయనతార నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమా పై అందరి దృష్టి పడింది. మరి కృష్ణం వందే జగద్గురం ఏలా ఉందో చూద్దాం..!     చిత్రకథ :   బి.టెక్ చదువుకున్న బాబు (రానా) సురభి నాటక కంపెనీకి చెందిన వ్యక్తి. నాటక ప్రదర్శనలలో పాల్గొంటున్నా, అతనిని నాటకాలంటే అంతగా అసక్తి ఉండదు. ఎవరి బ్రతుకు వారే బ్రతకాలని అనుకుంటూ.. అమెరికా వెళ్లి స్థిరపడాలని భావిస్తుంటాడు. అయితే, బాబు తాత (కోట శ్రీనివాసరావు)కు బళ్లారిలో జరిగే నాటకోత్సవాలలో ‘కృష్ణం వందే జగద్గురం’ అనే నాటకాన్ని బాబు చేత ప్రదర్శించాలని ఆశిస్తుంటాడు.  నాటకాన్ని ప్రదర్శించడానికి సురభి బృందం బళ్లారి వెళుతుంది. అక్కడ రిపోర్టర్ దేవకి (నయనతార) బాబుకి పరిచయం అవుతుంది.  అక్కడ కొన్ని కారణాలతో అక్రమ మైనింగ్ చేసే రెడ్డప్ప మనుషులతో బాబు గొడవ పడతాడు. రెడ్డప్ప తో బాబు తలపడాల్సి వస్తుంది. రెడ్డప్ప ఎవరు..?, బాబుకి అతనికి సంబంధం ఏమిటి..?, కృష్ణం వందే జగద్గురం నాటకాన్ని బాబు ప్రదర్శించాడా.. అనే విషయాలతో చిత్ర కథ సాగుతుంది.    నటీనటుల ప్రతిభ : సురభి నాటక రంగానికి చెందిన వ్యక్తిగా రానా నటించాడు. కళ అంటే బ్రతకడం కోసం కాదని, బ్రతుకు నిచ్చేది కళ అని తెలుసుకుని మార్పు చెందే వ్యక్తిగా నటన బానేవుంది. అతని గత చిత్రాలతో పోల్చుకుంటే రానా నటుడుగా మెరుగయ్యాడు అని చెప్పుకోవాలి. ఫైట్స్ , డాన్సుల్లో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఆరు ఆడుగులు కంటే పొడుగు ఉండే రానా ను ఓ పాటలో మురుగుజ్జుగా చూపించడం బావుంది. నయనతార ఉన్నంతలో బానే చేసింది. ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. రఘుబాబు నటన ఓకే. టాక్సీ డ్రైవర్ టిప్పు సుల్తాన్ గా పోసాని తన మార్కు డైలాగులతో ఆకట్టుకుంటాడు. రంపంగా బ్రహ్మనందం చేసిన హస్యం పండలేదు. పద్మ, ఎల్బీశ్రీరాం తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. అన్నపూర్ణ, రూప చాలా కాలం తరువాత వెండి తెర మీద కనిపించడం, దర్శకుడి అభిరుచికి అద్దం పడుతుంది. ఒక పాటలో వెంకటేష్ కొంచెం సేపు కనిపించడం అతని అభిమానులను ఆకట్టకుంటుంది. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ, సంగీతం బావుంది. పాటల చిత్రీకరణ బావుంది. ఈ సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ అనవసరం అనిపిస్తాయి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది మాటల గురించి. ఆకట్టుకునే మాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ‘గర్భగుడిలో ఊరకుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు అపవిత్రం అయిపోడు.’, ‘ తొమ్మిది మాసాలు కష్ట పడి అమ్మ మనల్ని కన్నదని కొంత మంది అనుకుంటారు, నాన్న పక్కన పది నిమిషాలు సుఖ పడి మనల్ని కన్నదని మరికొంత మంది అనుకుంటారు, పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు. పురిటి కష్టం చూసిన వాడు మనిషి అవుతాడు’ ‘మా తరం వారు ఉన్నచోటనే స్వాతంత్ర్యం సంపాదించుకుంటే, ఈ తరం వారు స్వాతంత్ర్యం వెతక్కుంటూ వెళుతున్నారు.’ వంటి మాటలతో పాటు నాటకం గురించి, కళ గురించి చెప్పిన మాటలు బాగున్నాయి. ఇక దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సి వస్తే... గమ్యం సినిమాతో దర్శకుడిగా మారిన వ్యక్తి క్రిష్. ఆ సినిమా తోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత అతను రూపొందించిన వేదం కూడా సిని ప్రియలను ఆకట్టకుంది. కృష్ణం వందే జగద్గురం పై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం క్రిష్ దర్శకత్వం. అయితే ఈ సినిమాలో చాలా చోట్ల క్రిష్ తడపడినట్లు కనిపిస్తుంది. రానా గురించి ఈ సినిమా రూపొందించాలా.. లేక తన పద్ధతిలో సినిమాలో తీయాలా అనే మీమాంసలో క్రిష్ పడిపోయాడు. సురభి నాటకాల గురించి, అక్రమ మైనింగ్ గురించి క్రిష్ పూర్తిగా చెప్పలేక పోయాడు. చిత్రం మొదటి సగాన్ని నడిపించిన నేర్పును, రెండవ సగంలో చూపించలేక పోయాడు. పోలీస్ స్టేషన్ లో తన ముందుగా అంతగా అన్యాయం జరుగుతున్నప్పుడు కండల తిరిగిన హీరో కళ్లప్పగించుకుని చూస్తుండటం బాలేదు. అక్కడ ఓ ఫైట్ పెట్టి హీరో విలన్ ను వెతుక్కుంటూ వెళ్లితే బావుండును. అయితే, ఈ సినిమాలో హీరో వచ్చి మళ్లీ నాటకం వేసుకుంటాడు. ఇలాంటి పొరపాట్లు ఉన్నా విలన్ ట్విస్ట్, అక్రమ మైనింగ్ గురించి కొంత వరకూ అయినా చర్చించడం బాగుంది. అలాగే కొన్ని పాటలు అసందర్భంగా వస్తాయి. హైలెట్స్ :   మాటలు, సంగీతం, రానా-నయనతార నటన,   డ్రాబ్యాక్స్ :   బోర్ గా సాగే సెంకడాఫ్ లో సన్నివేశాలు, అంతగా ఆకట్టుకోని కథ- స్ర్కీన్ ప్లే.  చివరగా :   కృష్ణం వందే జగద్గురం : నాటకం కంటే ఎక్కువ - సినిమా కంటే తక్కువ    More Articles on KVJ || KVJ Photos & Wallpapers || KVJ Videos   

మరింత సమాచారం తెలుసుకోండి: