చదువు పూర్తి చేసుకొని వీరయ్య పాలెం గ్రామంలో ఆకతాయిగా తిరిగే కుర్రాడే మన డెబ్యూ హీరో చంటి(నాగ అన్వేష్). చంటి తన ఫ్రెండ్స్ అయిన వీర్రాజు(శకలక శంకర్), చారి(జబర్దస్త్ శీను), సుబ్బు(హరీష్)లతో కలిసి ఎలాంటి పని లేకుండా రోజూ ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. మన చంటి సీరియస్ గా చేసే పని ఒక్కటే తన చిన్ననాటి ఫ్రెండ్, ఊరి పెద్ద చౌదరి(ప్రకాష్ రాజ్)గారి అమ్మాయి జానకి(కృతిక జయకుమార్)ని సిన్సియర్ గా లవ్ చేయడం. రోజూ తన వెంటపడే చంటి తన ప్రేమని మాత్రం ఎప్పుడూ జానకికి తెలియచేయడు. కానీ ఫ్రెండ్స్ కి మాత్రం జానకి, తను లవర్స్ అని చెప్పుకుంటూ ఉంటాడు మన చంటి. అలా సాగిపోతున్న టైంలో చౌదరి జానకికి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ టైములో చంటి తన ప్రేమని చెప్పినా తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని జానకి చెబుతుంది. దాంతో బాధ పడుతున్న చంటికి ఏమన్నా హెల్ప్ చెయ్యాలని ఆలోచించిన ఫ్రెండ్స్ శీను(అలీ) సాయంతో పెళ్లి మండపం నుంచి జానకి మరియు చంటిలను కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ తో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి ఏం జరిగింది.? కిడ్నాప్ అయిన వాళ్ళు ఏమయ్యారు.? చివరికన్నా జానకి చంటి ప్రేమని అర్థం చేసుకొని తనతో ప్రేమలో పడిందా.? లేదా.? అన్నది వెండితెరపై చూడాలి.
వినవయ్యా రామయ్యా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో నాగ అన్వేష్.. నాగ అన్వేష్ లో ఏదో చెయ్యాలనే ఈజ్, తపన ఉన్నాయి కానీ ఏం చెయ్యాలి.? ఎలా చెయ్యాలి.? అనేదానిపై పెద్ద క్లారిటీ అండ్ మెచ్యూరిటీ లేవు, అదీకాక డైరెక్టర్ కూడా సరిగా చెప్పకపోవడంతో అతని నటన బాగా తేలిపోయింది. దాంతో మొదటి సినిమాకి కావాల్సిన కనీస పెర్ఫార్మన్స్ ని కూడా ఆన్ స్క్రీన్ చూపలేకపోయాడు. నటనలో తనకి తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత.. ఇకపోతే ఈ కుర్రాడు డాన్సులు బాగా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన దృశ్యం ఫేం కృతిక జయకుమార్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా తనకి అనుభవం లేదు, అలాగే తనకు ఎవరూ గైడ్ చెయ్యలే.. అందుకే స్క్రీన్ ప్రెజన్స్ మీద పెద్దగా ఐడియా లేనట్టు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. చూడటానికి 90% సీన్స్ లో ఓవర్ మేకప్ తోనే కనిపిస్తుంది. పెర్ఫార్మన్స్ పరంగా నిల్ అయినా లుక్ పరంగా లంగా ఓనీల్లో బాగుంది. అలాగే పాటల్లో గ్లామరస్ గా కనిపించింది. కృతికలో మంచి ఈజ్ ఉంది, దాన్ని సరిగా వాడుకోగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. వీరి తర్వాత మిగతా నటీనటుల విషయానికి వస్తే.. చౌదరిగా ప్రకాష్ రాజ్ డీసెంట్ గా ఉన్నాడు. కానీ ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ చేసేంత డెప్త్ లేదు. బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, షకలక శంకర్, జబర్దస్త్ శ్రీను, హరీష్ లు అక్కడక్కడా బానే నవ్వించడానికి ట్రై చేసారు. ఈ సినిమాలో రిలీఫ్ గా అనిపించేది వీరు కనిపించే కొన్ని నిమిషాలు మాత్రమే. విలన్ గా చేరన్ బాగా చేసాడు. చలపతిరావు, హేమ, సీనియర్ నరేష్, తులసి తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఒక కొత్త హీరోని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు అతని చేత ఓ టోటల్ డిఫరెంట్ సినిమా చేయిస్తే అతను ప్రేక్షకుల మదిలో రిజిష్టర్ అవుతాడు. ఇప్పటికే ఈ ఫార్ములాని చాలా మంది ప్రూవ్ చేసారు కూడా.. కానీ అలా ట్రై చేసింది చాలా కొద్ది మంది మాత్రమే.. మిగతా వారందరూ రియాలిటీకి దూరంగా, కథ అనే విషయన్ని పక్కన పెట్టేసి కమర్షియాలిటీ అనే దాని చుట్టూ పరిగెడుతున్నారు. కథ - కథనం అనే విషయాలకు కూసింత కూడా విలువ ఇవ్వకుండా నాలుగు కామెడీ సీన్స్, నాలుగు పాటలు, ఓ ఫైట్, లాస్ట్ లో ఓ సెంటిమెంట్ సీన్ ఉంటే చాలు అనే ఫార్మాట్ లో వచ్చిన సినిమా 'వినవయ్యా రామయ్యా'. ఈ సినిమాలో మొదటి నుంచి నేరేషన్ అనేది ఎటో ఎటేటో వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఒకటి రెండు సార్లు మీ పెదాలపైకి చిరునవ్వును తెచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్ప మీరు చూడటానికి ఏమీ లేదు.. మీరు పెట్టే టికెట్ ధరలో కనీసం 10% కూడా మిమ్మల్ని మెప్పించలేని సినిమా ఇది. ఓవరాల్ గా చెప్పాలంటే కమర్షియాలిటీ అనే చెట్టు కింద మొలిచిన మరో ఓల్డ్ ఫార్మటు నడ పరమ బోరింగ్ మూవీ వినవయ్యా రామయ్యా.. ఈ కమర్షియాలిటీ అనే దాని వెనక పరిగెడుతున్న వారందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా... కమర్షియాలిటీ అంటే 6 పాటలు, ఐదు సీన్స్, నాలుగు కామెడీ బిట్స్, మూడు ఫైట్స్, రెండు సెంటిమెంట్ సీన్స్ ఉండేలా కథని రాసుకోవడం కాదు.. ఎలాంటి కథని అయినా ప్రేక్షకుడు మెచ్చుకునేలా, ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా చెప్పడం. కానీ ఈ లాజిక్ ని మరిచిపోయి ఓ డూప్లికేట్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారు. కథ - కథనం - లాజిక్స్ అనేవి ఏమీ లేకుండా గుడ్డిగా ఓ కమర్షియాలిటీ అనే ఫార్మాట్ లో తీసే అట్టర్ ఫ్లాప్ సినిమాలకు పర్ఫెక్ట్ ఉదాహరనే ఈ 'వినవయ్యా రామయ్యా'.