గోపి సుందర్ సంగీతం , సినిమాటోగ్రఫీ , సినిమా కథ , నాని మరియు మురళి శర్మ నటన , నిర్మాణ విలువలు , కామెడీ గోపి సుందర్ సంగీతం , సినిమాటోగ్రఫీ , సినిమా కథ , నాని మరియు మురళి శర్మ నటన , నిర్మాణ విలువలు , కామెడీ అక్కడక్కడా సాగదీసిన సన్నివేశాలు , రొటీన్ గా సాగిన సెకండ్ హాఫ్ నేరేషన్ , లాజిక్స్ లేకపోవడం , హడావిడి గా ముగించిన క్లైమాక్స్

లక్కి (నాని) మొక్కల మీద పరిశోధన చేసే శాస్త్రవేత్త ఇతనికి ఒక వింత లోపం ఉంటుంది అదేంటంటే ఏదయినా పని చేస్తూ మధ్యలో వేరే పని గుర్తొస్తే మొదటి పని మరిచిపోతాడు. అలా ఇతనికి వచ్చిన పెళ్లి సంభంధాలను మరిచిపోయి కలవకుండా ఉండిపోతాడు. అలాంటి ఒక సందర్భంలో పాండురంగ రావు (మురళి శర్మ) ను కలుస్తా అని చెప్పి మరిచిపోతాడు. దీంతో విసుగు చెందిన పాండురంగ రావు లక్కి మీద కోపంతో ఆ సంభందాన్ని వద్దనుకుంటారు. తరువాత లక్కి ఒకరికి రక్తదానం చెయ్యబోయి మరిచిపోయి వేరొకరికి ఇచ్చేస్తాడు ఆ సమయంలోనే మొదటి చూపులోనే నందిని(లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు. ఆమె ముందు తన మతిమరుపు లోపం బయటపడకుండా ఉండటానికి పలు సాకులు మరియు పలు నాటకాలతో బయటపడుతుంటాడు. ఇలా ఉండగా నందిని తన ప్రేమను తన తండ్రి ఒప్పుకున్నాడని వచ్చి కలవమని లక్కికి చెప్తుంది. అక్కడికి వెళ్ళిన లక్కి కి షాక్ తగులుతుంది. నందిని మరెవరో కాదు పాండురంగారావు కూతురు అని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన్ని ఎలా ఒప్పించాలి? నందిని కి తన లోపం గురించి ఎలా చెప్పాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో నే.

మతిమరుపు మనిషి పాత్ర చెయ్యాలి అంటే ముఖ్యంగా ప్రథమంగా కావాల్సింది టైమింగ్, అమాయకంగా కనిపిస్తూనే తన టైమింగ్ తో ఈ పాత్రకు ప్రాణం పోశారు నాని. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ అద్భుతం చాలా సాధారణం అయిన సన్నివేశాలలో కూడా తన టైమింగ్ తో ప్రేక్షకుల్లో నవ్వు పుట్టించారు నాని. చిత్రం మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంటే మొతాన్ని తన భుజాల మీద నడిపించారు. ఈ పాత్ర ఈయనకి సూట్ అవ్వడం కాదు ఈయన కోసమే ఈ పాత్ర అనడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఎన్ని ప్రయోగాలు చేసినా అప్పుడప్పుడు ఇలా తన మార్క్ పాత్రలను పోషిస్తూ అలరిస్తారని ఆశిద్దాం. లావణ్య త్రిపాఠి , అందము మరియు అభినయము కావలసిన పాత్ర ఇది రెండింటిని సమపాళ్ళలో బాలన్స్ చేయడంలో ఈ నటి సఫలం అయ్యారు. ఈ పాత్రని తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్ళడం లాంటివి చెయ్యలేదు కాని పాత్రకి ఎం ఇవ్వాలో అది ఇచ్చారు ఈ నటి .. నాని మరియు లావణ్య మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మురళి శర్మ హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా బాగా కుదిరారు ఈయన నటనతో చాలా సన్నివేశాలను నిలబెట్టారు. నరేష్ హీరో తండ్రి పాత్ర పోషించారు చాలా సన్నివేశాలలో అయన టైమింగ్ తో నవ్వించారు. సితార మరియు మధుమిత ఉన్నదీ కాసేపే అయినా ఆకట్టుకున్నారు. ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి మరియు వెన్నెల కిషోర్ వారి శైలి టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించారు. అజయ్ తనకి ఇచ్చిన కాసేపట్లో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. 

ఈ విభాగంలో సాధారణంగా మనం మొదట కథ కథనం గురించి మాట్లాడుకుంటాం కాని ఈ చిత్రంలో మాత్రం అన్నింటికన్నా అందరికన్నా ముందు చెప్పాల్సింది గోపిసుందర్ గురించి , తెర ముందు చిత్రాన్ని నాని హనుమంతుడు సంజీవిని మోసినట్టుగా నాని ఈ చిత్రాన్ని మోస్తే తెర వెనుక సాంకేతిక విభాగంలో గోపి సుందర్ ఈ చిత్రాన్ని  గోవర్ధన గిరిని చిటికెను వేలు మీద మోసిన గోపి కృష్ణుడి లా అలవోకగా గోపి సుందర్ ఈ చిత్రాన్ని మోశారు. కామెడీ , రొమాన్స్ , సెంటిమెంట్, యాక్షన్ ఇలా దేనికదే ఒకదానికి ఒకటి తక్కువ కాకుండా తన నేపధ్య సంగీతంతో చిత్రాన్ని అమాంతం సింహాసనాన్ని ఎక్కించారు. గోపి సుందర్ తరువాత ఈ విభాగంలో ముఖ్యంగా చేపుకోవలసిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ , చిత్రం ఆసాంతం కళ్ళకు క్యాండీ లా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఇక నాని, లావణ్య మరియు మురళి శర్మ ని చూపించిన తీరు ప్రశంశనీయం. ఇప్పుడు కథ కథనం మాటలు దర్శకత్వం విషయానికి వస్తే కథ చాలా సన్నని కథ ఎంచుకుని బలమయిన కథనం తో మనముందుకి వచ్చారు దర్శకుడు మారుతి , అతని చిత్రాలలో ఇంత మంచి కథనం ఎప్పుడు గమనించలేదు. కాని రెండవ అర్థభాగం అవ్వగానే చిత్రం సేఫ్ మోడ్ లో కి వెళ్ళిపోయింది ప్రేక్షకుడి ఊహించిందే జరుగుతుంది. మాటలు కూడా చాలా బాగా కుదిరాయి సరయిన టైమింగ్లో సరయిన మాటలతో సన్నివేశాలను రక్తి కట్టించారు. దర్శకత్వం విషయంలో మారుతికి చాలా క్లారిటీ ఉన్నట్టు కనిపించింది ప్రతి పాత్రా చాలా క్లియర్ గా వ్యవహరించింది. ఎడిటింగ్ విషయంలో  వహించాల్సింది , సన్నివేశాలను మరింత షార్ప్ గా కట్ చేసుంటే చాలా సన్నివేశాలలో డ్రాగ్ అనిపించేది కాదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి దర్శకుడికి కథ మీద ఉన్న నమ్మకం నిర్మాతకు దర్శకుడి మీద ఉన్న నమ్మకం నిర్మాణ విలువల్లో కనిపిస్తుంది.. 

ఈ చిత్రం మొదలయిన పదకుండవ నిమిషంలో ఒక విషయం క్లారిటీ వచ్చేస్తుంది నాని కి ఉన్న మతిమరుపు గురించి అప్పటికే ప్రేక్షకుడు నాని పాత్రతో చాలా బలంగా కనెక్ట్ అయిపోతాడు ఎంతలా అంటే , నాని రోడ్ మీద కార్ దిగగానే .. కార్ మరిచిపోయాడు అని నవ్వేసుకునేంత లా ఇక్కడే దర్శకుడు మారుతి విజయం సాదించాడు. పలు రివ్యూ లలో నేను చెప్పాను ప్రేక్షకుడు పాత్రతో కనెక్ట్ కాకపోతే కథ ఎంత బలంగా ఉన్నా ప్రభావం ఉండదు అని, ఈ చిత్రం ఉదాహరణగా తీసుకుంటే ప్రేక్షకుడు పాత్రతో కనెక్ట్ అయితే కథ ఎంత సన్నగా ఉన్నా చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ చిత్రంలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నాని కి లోపం ఉందని తెలిసినా అతని పాత్ర మీద జాలి కలిగించడానికి ప్రయత్నించకపోవడం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అతని పాత్ర మరిచిపోవాలి అని ఎటువంటి పరిస్థితుల్లో దర్శకుడు మరిచిపోకపోవడం. సినిమా మొత్తం హీరో మరిచిపోవడం మీదనే ఉంటుంది ప్రేక్షకుడు చాలా ఉత్సాహంగా వేచి చూసేది నెక్స్ట్ ఎం మరిచిపోతాడు  దాన్ని ఎలా కవర్ చేస్తాడు అనే ఈ సన్నివేశాలన్నిటికీ హ్యుమర్ మిక్స్ చేసి మారుతి చాలా బాగా బాలన్స్ చేసారు. కాస్త ఊహాజనితంగా ఉండటం మరియు అనసవరంగా కొన్ని సనివేశాలను సాగదీయడం రెండవ అర్ధ భాగంలో ఒకానొక సన్నివేశం నుండి చిత్రాన్ని సేఫ్ మోడ్ లోకి తీసుకెళ్ళిపోవడం లాంటి సమస్యలు ఉన్నా ప్రేక్షకుడు ఏదయితే ఆశించి చిత్రానికి వెళతాడో అది మనసు నిండుగా పెట్టి పంపారు ఈ చిత్ర నిర్మాతలు.. ఎటువంటి సంకోచం లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం ఇది .. ఆలోచించకుండా డైవెర్ట్ అయ్యి మరిచిపోకుండా ఈ చిత్రానికి వెళ్ళిపొండి ... 

Nani,Lavanya Tripathi,Maruthi Dasari,Geetha Arts & UV Creations,Gopi Sunder.భలే భలే మ... రిచిపోయాడు !!

మరింత సమాచారం తెలుసుకోండి: