ఈ ఏడాది బాలీవుడ్ ఓ వెలుగు వెలిగింది. ఎన్నెన్నో అరుదైన విజయాలను అందుకుంది. హాలీవుడ్‌తో పోటీపడే స్థాయిని, మార్కెట్‌ను చేరుకున్న బాలీవుడ్ తెరపై ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు కనిపించాయి. బాలీవుడ్ కు ఈ ఏడు వచ్చినన్ని కమర్షియల్ హిట్స్ గతంలో ఎప్పుడు కనిపించలేదు. గతంలోని సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీల స్థానంలో సక్సెస్‌ను సూచించే కొలమానంగా ‘వందకోట్ల క్లబ్’ ఏర్పడింది ఈ సంవత్సరమే. 2012లో ఎనిమిది సినిమాలు వంద కోట్ల క్లబ్‌లోకి చేరడంతో బాలీవుడ్‌కి ఈ ఏడాది పూర్తి సంతృప్తినిచ్చింది. 2012లో కూడా బాలీవుడ్‌లో ప్రధానంగా యాక్షన్ చిత్రాల హవా కొనసాగింది. మాస్ ప్రేక్షకుల్లో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ‘మేనియా’కి తిరుగులేదని ప్రూవ్ చేసింది. యశ్‌రాజ్ బ్యానర్‌లో సల్మాన్, కత్రీనా జంటగా కబీర్‌ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా ఈ ఏటి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల పరంగా దమ్ముదులిపింది. 165 కోట్లకు పైగా వసూళ్లు చేయడమేకాక శాటిలైట్ ప్రసార హక్కులకు 65 కోట్లను పొంది కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మరో సినిమా రౌడీరాథోడ్ కూడా బాలీవుడ్ స్ర్కీన్ పై చమక్కున మెరిసింది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, సోనాక్షీ సిన్హా జంటగా వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ‘విక్రమార్కుడు’కి రీమేక్. వంద కోట్ల క్లబ్ లోకి చేరి తిరుగులేని హిట్ అందుకుంది ఈ సినిమా. ఈ ఏడు వంద కోట్ల క్లబ్ లోకి చేరిన మరో చిత్రం అగ్నిపథ్. కరణ్ మల్హోత్రా డైరెక్షన్‌లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా వచ్చిన ‘అగ్నీపథ్’ సినిమా రివేంజ్, యాక్షన్‌తో సూపర్‌హిట్ అయింది. మరోవైపు సాజిద్‌ఖాన్ డైరెక్షన్‌లో అక్షయ్‌కుమార్, అసిన్, జాన్ అబ్రహం, రితేశ్‌దేశ్‌ముఖ్, మిథున్ చక్రవర్తి, రణధీర్‌కపూర్, రిషీకపూర్ వంటి మల్టీస్టార్‌కాస్ట్‌తో వచ్చిన ‘హౌజ్‌ఫుల్ 2’ సూపర్‌హిట్ అయింది. బాలీవుడ్ తెరపై విజయం సాధించిన మరో కామెడీ ఎంటర్ టైనర్ ‘సన్ ఆఫ్ సర్దార్’. తెలుగు ‘మర్యాదరామన్న’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కూడా హిందీలోనూ సూపర్ హిట్ అందుకుంది. రణబీర్‌కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రల్లో అనురాగ్‌బసు తీసిన బర్పీ కూడా సూపర్ హిట్ మూవీయే. ఇందులోని చాలా సీన్లు కాపీ అని చెప్పినప్పటికీ ఆస్కార్ పోటీలకు భారత్ తరపున ఎంట్రీకి ఎంపికైంది. ఈ సినిమాకు కూడా భారీ కలెక్షన్ల వచ్చాయి. ఈ ఏడు బాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ చిత్రం బోల్ బచ్చన్. అజయ్‌దేవ్‌గన్, అభిషేక్‌బచ్చన్‌లతో రోహిత్‌శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ ఖాతాలో నిలిచింది. ఇక బాలీవుడ్ సినీ శిఖరం యశ్‌చోప్రా చివరి చిత్రంగా తెరకెక్కింది ‘జబ్ తక్ హై జాన్’. షారూఖ్‌ఖాన్, కత్రీనా జంటగా వచ్చిన ఈ సంవత్సరపు రొమాంటిక్ లవ్ స్టోరీస్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ కుతూహలాన్ని రేకెత్తించే సినిమాలు కూడా ఈ ఏడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాయి. సుజోయ్‌ఘోష్ దర్శకత్వంలో కోల్‌కత్తా నేపథ్యంలో విద్యాబాలన్ హీరోయిన్‌గా వచ్చిన ‘కహానీ’ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. విద్యాబాలన్ యాక్టింగ్ కు మంచి పేరువచ్చింది. ఇలా ఈ ఏడాది బాలీవుడ్ ఓ వెలుగు వెలిగింది. ఎన్నెన్నో అరుదైన విజయాలను అందుకుంది. హాలీవుడ్‌తో పోటీపడే స్థాయిని, మార్కెట్‌ను చేరుకున్న ఈ సందర్భంలోనే మరెన్నో కొత్త సూత్రాలను ఆవిష్కరించింది బాలీవుడ్. ఒకవైపు హండ్రెడ్ క్రోర్స్ క్లబ్, ‘సల్మానియా’, మాస్ మసాలా యాక్షన్ బాలీవుడ్ గమనాన్ని శాసించే సూచికలుగా 2012 నిర్థారించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: