యువ హీరో రామ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఒంగోలు గిత్త’. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో విడుదల వేడుక కార్యక్రమాన్ని బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలోని పాటల్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాతలతో నేను గతంలో ‘ఛత్రపతి’ సినిమా చేశాను. అప్పుడు వారు ఎంతో సహకారం అందించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం భాస్కర్ చాలా కసితో పనిచేశాడని తెలుస్తోంది. ‘ఒంగోలు గిత్త’ అనేది రామ్ కు సరిగ్గా సరిపోయే టైటిల్. ఈ సినిమా వీరికి మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. హీరో రామ్ మాట్లాడుతూ ‘భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి మాస్ చిత్రంగా తెరకెక్కుతుందని’ తెలిపారు. మార్కెట్ యార్డు నేపథ్యంగా సాగే పాత్ర తనదని, ఈ సినిమాలో సంభాషణలు చాలా బాగుంటాయని రామ్ చెప్పాడు. అలాగే, జీవి ప్రకాష్, మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారని, ముఖ్యంగా మణిశర్మ బాణీలు ఇచ్చిన ఒక మాస్ గీతానికి డాన్స్ చేయలేక ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలని అనుకున్నట్లు ఈ సందర్భంగా రామ్ వెల్లడించాడు. దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఒక జానపద గీతం అందరికీ ఒక మంచి జ్ఝాపకంగా మిగులుతుందని, ఈ చిత్రం అందరికీ సంతృప్తి ఇచ్చే చిత్రం అవుతుందని’ నమ్మకంగా చెప్పాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కృతి కర్బందా, స్రవంతి రవికిషోర్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, భోగవల్లి బాపినీడు, అలీ, కోనవెంకట్, భాస్కర్ భట్ల, వనమాలి తదితరలు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: