ఈ మద్య సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తుంది. అంతే కాదు సోషల్ నెట్ వర్క్ లో కూడా కొన్ని పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ కి ముందు..రిలీజ్ అయిన మూడు గంటల్లో ఆన్ లైన్లో దర్శనమిస్తున్నాయి.  వందల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఓ సినిమా తెరకెక్కిస్తుంటే..కొంతమంది స్వార్థపరులు ఆ సినిమాలు పైరసీ చేయడం నెట్ లో పెట్టడం చేస్తూ నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నారు.  ఈ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా కొన్ని లూప్ లైన్లతో వారు తమ పని ఈజీగా కానిస్తున్నారు.  తమ అభిమాన హీరోలు సినిమాలపై ఎన్నో అంచనాలు పెంచుకుంటున్న తరుణంలో పైరసీ రాయుళ్ళు రిలీజ్‌కి ముందే వాటిని మార్కెట్లలో లీక్ చేసి వారి కష్టాలపై నీరుగారుస్తున్నారు. తమ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా ఇండస్ట్రీనే కుంగదీస్తున్నారు.

ఇప్పటికే ‘ఉడ్తా పంజాబ్’, ‘సుల్తాన్’ వంటి భారీ సినిమాలు ఈ పైరసీ బారిన పడగా.. తాజాగా వీరి సరసన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ కూడా చేరిపోయింది.  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి..అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్లు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ తరుణంలో సినిమా లీక్ కావడం చిత్ర యూనిట్ నెత్తిమీద బండరాయి పడ్డట్లయ్యింది. పా.రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను దాదాపు రూ.110 కోట్ల వ్యయంతో ‘కబాలి’ సినిమాని నిర్మించారు. గత కొంత కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్నా కబాలి చిత్రం ఎట్టకేలకు ఈనెల 22వ తేదీన రిలీజ్‌కి సిద్ధమైంది.

దీంతో అభిమానుల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. కానీ ఇంతలో ఈ సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీకయ్యింది. ఈ చిత్రం లీకైన విషయాన్ని వెంటనే గుర్తించిన నిర్మాత ఎస్.థాను.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 180కి పైగా పైరసీ లింకులను తాము గుర్తించామని, వీటి సంఖ్య ఇంకా ఎక్కవగానే ఉండడంతో వెంటనే ఆయా సైట్లలోంచి ఆ లింకుల్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్.థాను కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: