తమిళనాట సినీ ప్రముఖులకు కష్టకాలం వచ్చింది. కమల్ కష్టాలు తీరయో లేదో.. అప్పుడే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కూడా కష్టాల 'కడలి'లో చిక్కుకున్నాడు. మణిరత్నం తెరకెక్కించిన 'కడల్'(తెలుగులో కడలి) ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నష్టాలను మూటగట్టుకుంటోంది. పాతిక కోట్లకుపైగా బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీ మొత్తంలో నష్టపోయారు. తమను నష్టాల పాల్జేసిందంటూ చిత్ర పంపిణీదారులు ఆందోళనకు దిగారు. ఆ సినిమా మూలంగా తీవ్రమైన నష్టాలు వచ్చాయంటూ చెన్నైలోని మణిరత్నం నివాసాన్ని పంపిణీదారులు ముట్టడించారు. ఆ నష్టాల్ని మణి భరించాలంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ సినిమాకు 'విశ్వరూపం' తరహాలోనే కోర్టు కేసులు కూడా మొదలయ్యాయి. సినిమాలో క్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నట్లు జాన్సన్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. చిత్ర ప్రదర్శనను వెంటనే ఆపేయాలని కోరారు. మరో ప్రక్క ఈ చిత్రంలోక్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని కోరుతూ ఇండియా క్రైస్తవ జననాయగ కట్చి నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌కి ఓ ఫిర్యాదు అందించింది. అందులో ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొంటూ.. తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలను తొలగించటంతోపాటు దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రావణ్' సినిమా ప్లాపు తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న మణిరత్నంకు ఇప్పుడు పెద్ద కష్టాలే వచ్చిపడ్డాయి. మరి మణిరత్నం కష్టాల 'కడలి' నుంచి తీరం ఎలా చేరుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: