తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చారు అక్కినేని. నటుడుగానే కాదు, నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు అక్కినేని. కాగా, శనివారం నాడు జరిగిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్, మీడియా కార్యక్రమంలో ఈ మహానటుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ‘చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేదు. నేనేం నేర్చుకున్నా సినిమాల్లోకి వచ్చిన తరువాతే’ అని అక్కినేని చెప్పారు. అలాగే, వృత్తిరీత్యా ఎప్పుడూ కడుపు నిండా అన్నం తినలేకపోయేవాడినని, లావైపోతాననే భయంతో అలా చేసేవాడినని, ఇప్పుడూ అదే అలవాటైపోయిందని ఆయన చెప్పారు.   అలాగే, ఇటీవల కాలంలో ‘స్క్రీన్ ప్లే’ అనే పదం ఎక్కువగా వాడుతున్నారని, స్ర్కీన్ ప్లే అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి విసుగురాకుండా సన్నివేశాలు రాసుకోవడమని అక్కినేని చెప్పారు. ఎడిటింగ్ దశలో సన్నివేశాలను కత్తిరించడం కంటే స్క్రిప్టు దశలోనే వడబోత చేయ్యాలి. కె.వి.రెడ్డి ఆవిధంగా చేసే వారని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు కావాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని అక్కినేని చెప్పారు. అలాగే సినిమాల నుంచి తప్పుకోవాలంటే కుదరడం లేదని చెప్పారు. 1974లో శస్త్ర చికిత్స జరిగిన వెంటనే నటన నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, అయితే కొన్ని కారణాలతో సినిమాల్లో నటిస్తున్నానని అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: