రజనీకాంత్ సినిమా విడుదలైదంటే చాలు తమిళనాడులో పండగే పండగ. ఇక అభిమానుల కోలాహలం షూటింగ్ ప్రారంభం నుండే మొదలవుతుంది. రజనీ సినిమా వస్తుందంటే తమిళంలోనే కాదు... తెలుగులోనూ ఆ నెలలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడాల్సిందే. చెన్నైలో మరో అడుగు ముందుకేసి థియేటర్ ల వద్ద మిఠాయిలు పంచడం.. కటౌట్లకు భారీ పూలమాలలు వేయడం, లారీల్లో పూలు చల్లుతూ రజనీ బొమ్మను ఊరేగించడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒకటేమిటి దేవాలయాల్లో పూజలు సైతం నిర్వహిస్తారంటే తమిళనాడులో రజనీ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. వినడానికి దక్షిణాది సూపర్ స్టార్ అయినా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్క హీరో రజనీకాంత్. రోబో చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఏకంగా ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. రోబో చిత్రం కలెక్షన్ల రికార్డును ఇంతవరకు ఏ ఒక్క దక్షిణాది చిత్రం కూడా అధిగమించలేదు. దాదాపు బాలివుడ్ చిత్రాలతో సమాన స్థాయిలో ‘రోబో’ దుమ్ములేపింది. అయితే ఇది గతం. ప్రస్తుతం రజనీ కూతురు ఐశ్వర్య నిర్మాణ సారథ్యంలో ‘కొచ్చాడయాన్’ రూపుదిద్దుకుంటున్న విషయం విదితమే. రోబో చిత్రం కన్న ముందే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం కొన్ని అనివార్యనీయ కారణాల వల్ల అప్పట్లో వాయిదా వేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగులో ‘విక్రమ సింహా’గా రాబోతున్న ఈ చిత్రాన్ని రజనీ పుట్టిన రోజు కానుకగా 12- 12- 12 తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మక బ్యానర్ లక్ష్మీ గణపతికి చెందిన బి.సుబ్రమహ్మణ్యం అత్యధిక ఫ్యాన్సీరేటుతో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు. ‘కొచ్చాడయాన్’కు ఇప్పటికే రోబోని మించిన బిజినెస్ జరిగినట్లు తమిళనాడు సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి. మరి సినిమా విడుదలైతే ఎన్ని రికార్డులు బద్దలవుతాయో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: