ఆస్కార్‌ అవార్డుల వేడుకలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అవార్డు సాధించాలంటే ఎంత కష్టపడాలో.. ఆ అవార్డుకు ఎంపిక చేయడం మరింత కష్టమే. అంతేకాకుండా అవార్డుల కార్యక్రమం నిర్వహించడం మరో ఎత్తు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకల్లో ఈసారి చిన్న అపశృతి చోటు చేసుకుంది. 


ఆస్కార్‌ అవార్డు ఫంక్షన్‌ కోసం సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ప్రతి సినీ ఆర్టిస్ట్‌ కల ఆస్కార్‌ అందుకోవాలని, ప్రతి డైరెక్టర్‌ కల ఆస్కార్‌ లెవల్‌ లో సినిమా తీయాలని..! ప్రతి సినీ లవర్‌ మదిలో, ఆలోచనల్లో ఇదే ధ్యాస. అంతలా ఆస్కార్‌ పై సినీ రంగంలోని ప్రతి ఒక్కరు మమకారం పెంచుకుంటారు. అయితే దీన్ని అందుకోవడం అంత ఆషామాషీ కాదు. ఇందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యున్నత సినీ అవార్డుగా పరిగణించే ఆస్కార్‌ రేంజ్‌ ఫర్మార్‌ మెన్స్‌ అంటే మాటలు కాదు. ఆస్కార్‌ అవార్డు ఎంపిక నుంచి మొదలు, వేడుక నిర్వహణ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. అందుకే సినీ జనాలు ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు.


ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రపంచ సినీ ప్రేమికులు పండగొచ్చినంత సంబరపడతారు. ఈ నెలలోనే ఆస్కార్ వేడుక జరుగుతుంది. లాస్ ఏంజిల్స్‌ లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ పురస్కార ప్రదానోత్సవం ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడెమీ చేసే ఖర్చు భారీగా ఉండటమే కాదు... అంతకు మించిన ఆదాయం అకాడెమీకి వస్తోంది. ఆస్కార్‌ వేడుకకు మూడు నెలల ముందు నుంచే సందడి మొదలవుతుంది. నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాలు ఆస్కార్ అకాడెమీ సభ్యుల దృష్టిలో పడేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అకాడెమీ సభ్యులకు స్టార్ హోటళ్లలో విందులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆస్కార్ వేడుకకు విచ్చేసే వారితో అక్కడి హోటళ్లు కిటకిటలాడిపోతాయి. 


ఆస్కార్ వేడుక సందర్భంగా లాస్‌ ఎంజెల్స్‌ నగరం ప్రపంచ సినీ నటులతో నిండి పోతుంటుంది. హోటళ్లతో పాటు పర్యాటక ప్రదేశాలు కళకళలాడుతుంటాయి. ఏటా వందల కోట్ల ఆదాయం వస్తుంటుంది. పురస్కారాలను అందించే అకాడెమీకి ఈ వేడుకతో భారీ ఆదాయం సమకూరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసార హక్కుల నుంచే వస్తోంది. గత కొన్నేళ్లుగా ఆస్కార్ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న అమెరికన్ బ్రాడ్‌ కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థ.. అకాడెమీకి ఏటా రూ.515 కోట్ల వరకు  చెల్లిస్తోంది. ఆస్కార్ సమయంలో వాణిజ్య ప్రకటనల ద్వారా ఏబీసీకి భారీ లాభాలే వస్తున్నాయి. 30 సెకన్ల వాణిజ్య ప్రకటనకు సగటున రూ.13 కోట్లు ఆదాయం వస్తోంది.


ఆస్కార్‌ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎంత ఖర్చుకైనా అకాడెమీ వెనుకాడటం లేదు. యేటేటా ఈ ఖర్చు పెరుగుతున్నా అంతే స్థాయిలో క్రేజ్‌ ను కూడా సంపాదించుకుంటుంది ఈ ఆస్కార్‌ పండుగ. ఇందులో పాల్గొనాలని ఆయా దేశాలకు చెందిన నటీ నటులకు ఆహ్వానాలను కూడా పంపుతుంది కమిటీ. అయితే ఈ ఫంక్షన్‌ కు ఇండియన్స్‌ వెళ్లేది తక్కువే.
హాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ నటీమణులు క్రిస్సీ టైజెన్, హేలీ బెర్రీ, వియోలా డేవిస్, ఎమ్మా స్టోన్, నికోల్ కిడ్మన్, ఓలివియా హామిల్టన్, స్కార్లెట్ జాన్సన్, అలికా వికండర్తో పాటు నటులు రిజ్ అహ్మద్, మాట్ డామన్, దేవ్ పటేల్, జాకీచాన్ తదితరులు రెడ్‌ కార్పెట్‌ పై నడిచి కెమెరాలకు ఫోజులిచ్చారు.


గత ఏడాది లాగే ఈసారి ఆస్కార్‌ అవార్డుల సెర్మనీలో మెరిసిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ప్రియాంక వైట్  అండ్ గ్రే ఫిష్ కట్ డ్రస్సులో రెడ్ కార్పొట్ పై హొయలొలికించింది. స్పెషల్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయింది. హాలీవుడ్  నటుడు డ్వైన్  జాన్సన్ తో కలిసి ఆమె బే వాచ్ మూవీలో నటిస్తోంది. ప్రియాంక నటించిన అమెరికన్  టీవీ సిరీస్  క్వాంటికో ఆమెకు వాల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చింది. 


అయితే ఇంతటి క్రేజీ అవార్డు ఫంక్షన్‌ లో ఈసారి పెద్ద తప్పే దొర్లింది. నిర్వహాకులు ఉత్తమ చిత్రాన్ని ప్రకటించే క్రమంలో వేదికపైకి వచ్చిన ఫాయే డునావే, వారెన్‌ బిటీ ఉత్తమ చిత్రంగా లాలా ల్యాండ్‌ ఎంపికైనట్లు ప్రకటించారు. దీంతో సదరు సినిమా నిర్మాతలు వేదికపైకి వచ్చి అవార్డును తీసుకునేందుకు రెఢీ అయిపోయారు. ఇంతలోనే తప్పు తెలుసుకున్న నిర్వాహకులు తిరిగి ఉత్తమ చిత్రం లాలా ల్యాండ్‌ కాదని, మూన్‌ లైట్‌ ఈ ఏటి మేటి చిత్రమని ప్రకటన చేశారు. దీంతో కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు. ఈ అంశంపై ప్రైస్‌ వాటర్‌ హౌజ్‌ కూపర్స్‌ క్షమాపణ చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: