ఈ నెల 28న అట్టహాసంగా విడుదలయ్యేందుకు బాహుబలి2 మూవీ సిద్ధంగా ఉంది. ఇటువంటి సమయంలో ఈ మూవీకి సంబంధించిన విడుదల విషయంలో కొంత గంధరగోళం క్రియేట్ చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రాజమౌళి మాత్రం బాహుబలి2 ను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


సినీచరిత్రలో ఏ సినిమాకూ లేని విధంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బాహుబలి-2కు మాత్రమే ఆరు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వడంపై పలు రకాల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనే విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని, ఆరు షోలకు అనుమతినిస్తూ జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేయాలని తెలుగు సినిమా ప్రేక్షుల సంఘం డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లలో షోలను ప్రదర్శించాల్సిన వేళలపై చట్టంలో చాలా స్పష్టమైన అంశాలు ఉన్నాయని ప్రేక్షకుల సంఘం వాదన.


రాత్రి 1 గంటల నుంచి ఉదయం 8గంటలవరకు సినిమా థియేటర్లలో ప్రదర్శనలు ఉండరాదని చట్టంలో ఉండగా, అందుకు విరుద్ధంగా బాహుబలి-2కు ఆరు షోల అనుమతి ఇవ్వడం సరికాదని సంఘం పేర్కొంది. అయితే ఇందుకు థియోటర్ యజమానులు ఉదయం 8 గంటల నుండి రాత్రి 1 గంట లోపే ఆరు షోలను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు రాజమౌళి…ప్రేక్షకుల సంఘంని కూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇప్పటికే ప్రేక్షకుల సంఘంకి తమవైపు నుండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు అంటూ రాజమౌళి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి కన్నడలో జరిగిన సత్యరాజ్ విషయంలో అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆరు షోల విషయంలోనూ పలు సంఘాలకు బుజ్జగించే పనిలో ఉన్నారు. మొత్తంగా రాజమౌళి…తన మూవీకి సంబంధించిన రిలీజ్ విషయంలో ఏ ఒక్కరినీ నొప్పించకుండా ముందుకు వెళ్లటానికి రెడీగా ఉన్నారనేది ఈ సందర్భాలను చూస్తే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: