మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ విషయంలో అతి పొదుపును పాటిస్తూ అతి తక్కువ డైలాగ్స్ ను తన పాత్రల చేత చెప్పిస్తూ ఉంటాడు. అయితే ఈ డైలాగ్స్ ధియేటర్స్ లో తూటాలులా పేలుతూ అచ్చ తెలుగులో ఎటువంటి ఇంగ్లీష్ పదాల వాడకం లేకుండా అచ్చమైన తెలుగుదానాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. 

అలాంటి త్రివిక్రమ్ వ్యవహార శైలి మారింది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సెటైర్లు హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబడ్డ పవన్ ‘అజ్ఞాతవాసి’ మూవీలోని పాట ‘బయటకు వచ్చి చూస్తే టైమ్ ఏమో త్రిఓ క్లాక్’ ఈ పాట విడుదలైన ఒక్కరోజు పూర్తి అయ్యే సరికి ఈపాటకు దాదాపు 20 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే ఈ పాట పవన్ అభిమానులకు ఏవిధంగా కనెక్ట్ అయిందో అర్ధం అవుతుంది. 

అయితే ఇప్పుడు ఈపాటలో 37 ఇంగ్లీష్ పదాలు వాడటం అనేక విమర్శలకు తావిస్తోంది. అందువలనే సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పై సెటైర్లు పడుతున్నాయి. వాస్తవానికి ఈపాట రాసింది త్రివిక్రమ్ కాకపోయినా రాయించింది త్రివిక్రమ్ కదా అంటూ టార్గెట్ చేస్తున్నారు. స్వచ్చమైన సంభాషణలకు చిరునామాగా ఉండే త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి ఇంగ్లీష్ పదాల ప్రయోగం ఏమిటి అన్న విమర్శల దాడి జరుగుతోంది.

అయితే పవన్ త్రివిక్రమ్ ల అభిమానులు మాత్రం ఇది అంతా ‘అజ్ఞాతవాసి’ మొదటి పాటకు వచ్చిన స్పందన చూడలేక కావాలని కొందరు చేస్తున్న నెగిటివ్ ప్రచారం అంటూ ఈ విమర్శలను తేలికగా తీసివేస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా మొన్న విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మూవీలోని మొదటి పాట స్పందన ఈ రేంజ్ లో ఉంటే ఇక విడుదలకాబోయే మిగిలిన నాలుగు పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ తెలియాలి అంటే డిసెంబర్ మొదటి వారంలో జరగబోతున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంచ్ వరకు వేచి ఉండాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: