గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’చిత్రంపై ఎన్నో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.  అయితే వాటన్నింటిని దాటుకుంటూ మొత్తానికి సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించి రేపు విడుదల కాబోతుంది.  అయితే న్యాయపరంగా 'పద్మావత్‌' విడుదలను అడ్డుకోలేకపోయినా.. హింసాత్మక ఆందోళనల ద్వారా సినిమాను అడ్డుకోవడానికి కర్ణిసేన ప్రయత్నిస్తోంది. చిత్ర విడుదల వేళ.. గుజరాత్, రాజస్థాన్‌లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి.
 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో..:
థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను ధ్వంసం చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్‌, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై దాడులకు దిగారు. సినిమా విడుదలకు సిద్దమౌతున్న హిమాలయ, అహ్మదాబాద్‌ వన్‌ మాల్స్‌, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలపెట్టేశారు.
 మాస్కులు ధరించి మరీ..:
పార్కింగ్‌ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.రాష్ట్రంలో కర్ణిసేన ఆందోళనలపై డీజీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.కర్ణిసేన దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానంగా 'పద్మావత్' ప్రదర్శించబోయే థియేటర్లకు భద్రత పెంచారు.

రాష్ట్రంలో ఆందోళనలపై సీఎం విజయ్ రూపానీ కూడా స్పందించారు. అందరూ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు గురుగ్రామ్‌లో అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకూ ఎవరూ గుంపులగా తిరగొద్దంటూ అహ్మదాబాద్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.అల్లర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నారు. 

వరుస ఆందోళనల నేపథ్యంలో థియేటర్‌ యజమానులు సినిమా ప్రదర్శించట్లేదంటూ బయట బోర్డులు పెట్టారు.  గుజరాత్ లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గంటల్లోనే.. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో కర్ణిసేన కార్యకర్తలు రోడ్డెక్కడం గమనార్హం. కాన్పూర్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు, అక్కడి సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. భారత దేశంలో ఒక సినిమాను ఇంతగా వ్యతిరేకించడం అనేది ఇదే మొదటి సారి అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: