ఇట్స్ నాట్ బై తేజ అని సినిమాకి కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడే ఓ అబ‌ద్ధం ఆడేశాడు తేజ‌. ఇప్పుడు ఇంకో అబద్ధం ఆడేశాడు. ఇక 998 అబ‌ద్ధాలు మిగిలివున్నాయి. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేలోపు ఆ కోటా కూడా పూర్తవుతుందేమో చూడాలి. ఇంత‌కీ ఇటీవ‌ల ఆడిన రెండో అబద్ధం ఏమిటంటే... 1000 అబ‌ద్ధాలు సినిమాని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‌ని. డిస్ట్ర్టిబ్యూట‌ర్లకు, ఎగ్జిబిట‌ర్లకు అలా వ‌ర్తమానం పంపిన మ‌రుస‌టి రోజే తూచ్ అని చెప్పేశారు.

మ‌ళ్లీ ఎప్పుడు విడుద‌ల చేస్తున్నారో కూడా ప్రక‌టించ‌లేదు. తేజ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 1000 అబ‌ద్ధాలు. సాయిరామ్‌శంక‌ర్‌, ఎస్తేర్ జంట‌గా న‌టించారు. ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. న‌వ్వక‌పోతే ఒట్టే అంటూ చెప్పుకొస్తున్న తేజ ఈ సినిమాపై భారీగా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ఇటీవ‌ల విజ‌యాల్లేక మొహం వాచిన తేజ‌కి ఈ సినిమా చాలా కీల‌కం.

ఒక పెళ్లి చేయ‌డం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే ఓ గ‌మ్మత్తయిన జంట క‌థ ఇది. పేరు కూడా కాస్త ఆక‌ర్షణీయంగా పెట్టాడు తేజ‌. మ‌రి సినిమా ఏమ‌వుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: