ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.మూత్ర సంబంధ వ్యాధితో గుండు హనుమంతరావు బాధపడుతున్నట్లు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు రూ.2 లక్షల ఆర్థికసాయం ఇటీవలే అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షలు మంజూరుచేసింది. కానీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తెల్లవారు జామును కన్నుమూశారు. 

1956 అక్టోబరు 10 విజయవాడలో జన్మించిన ఆయన 18వ ఏట నాటకరంగంలో ప్రవేశించారు. అనంతరం ‘అహ నాపెళ్లంట’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన హనుమంతరావు తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, కలిసుందాం రా, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.
Image result for గుండు హనుమంత రావు
ఇక బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గుండు హనుమంత రావు మృతి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా గుండు హనుమంత రావుతో ఎంతో స్నేహపూరితంగా ఉండే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎంతో ఆవేదనకు గురయ్యారు.  ఆయన పార్థీవ శరీరం చూసి కన్నీరు మున్నీరు అయ్యారు.

తనను ఎంతో ఆప్యాయంగా 'బావా' అని పిలిచే గుండు హనుమంతరావు ఇక లేరంటే నమ్మలేకున్నానని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం బోరున విలపించారు. గుండుతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన 'అహనా పెళ్లంట' సినిమా తామిద్దరికీ ఎంతో గుర్తింపును తెచ్చిందని అన్నారు. ఇండస్ట్రీలో తనకున్న అతి కొద్దిమంది మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని, మూడు వారాల క్రితం తన ఇంటికి వచ్చిన హనుమంతు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: