‘ఉగాది’ స్వచ్చమైన మన తెలుగు పండుగ. ఈరోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈరోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో  తెలుసుకోకుండా ఈ పండుగ పూర్తి కాదు. శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు వేదాలను రాక్షసులు ఎత్తుకుపోకుండా అడ్డగించి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఏర్పడింది అని పురాణ ప్రతీతి. ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు కూడా ఇప్పడే మొదలవుతుంది కాబట్టి  కొత్త జీవితానికి గుర్తుగా ‘ఉగాది’ పండుగను జరుపుకుంటారు. 
తెలుగు ఉగాది ఫోటోలు కోసం చిత్ర ఫలితం
ఆంధ్రుల చరిత్ర ప్రకారం శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనరోజు కాబట్టి ఈ ఉగాది పండుగగా  ప్రాశస్త్యంలోకి వచ్చిందని అంటారు. ‘ఉగాది’ మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన రోజు “ఉగాది” అని కూడ  అంటారు.  ఈరోజు ఉగాది భావాన్ని తెలియచేసే  ఉగాది పచ్చడి లేకుండా ఈపండుగ మొదలుకాదు. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈపచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. 
తెలుగు ఉగాది ఫోటోలు కోసం చిత్ర ఫలితం
జీవితంలో మనకు ఎదురుయ్యే అన్ని అనుభవాలకు అర్ధం ఈఉగాది పచ్చడిలో ఉంది.    ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వులోని - చేదు బాధను కలిగించే అనుభవాలను గుర్తు చేస్తుంది. చింతపండు పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను మనకు తెలియ చేస్తుంది. పచ్చి మామిడి ముక్కలులోని వగరు – కొత్త సవాళ్లను మన జీవితంలో ఎలా ఎదుర్కోవాలో మనకు  తెలియచేస్తుంది. ఈ పండుగ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలు కడతారు. శాస్త్రోక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటూ కొత్త పనులు వ్యాపారాలు మొదలుపెడతారు. ఉగాది రోజు రాశిఫలాలు, జాతక చక్రాలను తెలుసుకునే పంచాంగ శ్రవణం లేకుండా ఈ పండుగ పూర్తి కాదు. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని వింటారు. 
తెలుగు ఉగాది ఫోటోలు కోసం చిత్ర ఫలితం
ఈరోజున మనం చేసే అన్ని పండుగ పనులలో ఆరోగ్య నియమాలు దాగివున్నాయి. ఆ నియమాలు పాటించడం వల్ల మనస్సు, బుద్ది, ఇంద్రియాలకు ఆహ్లాదం, చైతన్యం కలుగుతాయి.  ‘త్వామష్టశోక నరాభీష్ఠ మధుమాస సముద్భవ నిచామిశోక సంతప్తాం మమశోకం సదాకురు’ అంటూ  ఉగాది పచ్చడి సేవించేటప్పుడు ఈ శ్లోకం పఠించాలని శాస్త్రవచనం. చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుంచి పౌర్ణమి వరకు పదిహేనురోజుల పాటు ఉగాది పచ్చడిని సేవిస్తే వివిధ వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.  సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖసంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్త్విక సందేశం ఉగాది పచ్చడిలో ఉంది. తెలుగు సంస్కృతికి దర్పణంగా కనిపించే ఉగాది పండుగలోని మాధుర్యం కోకిల గానం ప్రస్తుతం ఎక్కడో కాని వినిపించకపోయినా కొత్త సంవత్సరం వస్తోంది అంటే అందరి మనసులలోను కొత్తకొత్త ఆశలు చిగురిస్తూ ఉండటం సర్వసాధారణం. కాలగమనంలో నేడు ఉదయిస్తున్న ‘శ్రీవిళంబి’ నామ సంవత్సరం 15 కోట్ల తెలుగు వారందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తూ ఇండియన్ హెరాల్డ్ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: