ఆంధ్రులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రతి తెలుగోడు గొంతెత్తి నినదిస్తున్నా.. మన తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. నెలరోజులుగా జరుగుతున్న పోరాటం ప్రతి ఒక్కరినీ కదలిస్తున్నా వారిని మాత్రం కదలించలేకపోతోంది. మన స్టార్లకు ప్రేక్షకుల చప్పట్లే వినిపిస్తున్నాయి. ఆ చప్పట్ల వెనుక ఉన్న సంఘర్షణ మాత్రం అంతుపట్టడం లేదు. కేంద్రాన్ని నిలదీసి.. తెలుగువారి హక్కుల కోసం పోరాటంలో ముందుండాల్సిన మన సినిమావాళ్లు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.?

Image result for tollywood heros

ప్రేక్షకుల చప్పట్లు, వాళ్లు కొనే టిక్కెట్లే తప్ప వాళ్ల తిప్పలు సినిమా వాళ్లకు పట్టడం లేదు. నెలరోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అట్టుడికిపోతున్నా.. ఆ వేడి ఏసీ రూముల్లో ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉన్న తారలకు తాకడం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి తెలుగోడు గొంతుచించుకుని నినదిస్తున్నా.. డీజే సౌండ్ తో ఎంజాయ్ చేస్తున్న స్టార్స్ కు వినిపించడంలేదు. మెగాస్టార్, సడన్ స్టార్, సూపర్ స్టార్, రైజింగ్ స్టార్, యంగ్ రెబల్ స్టార్.. అంటూ ఆకాశమంత అభిమానాన్ని చాటుతుంటే.. వారు మాత్రం నేలచూపులు చూడడమే మానేశారు. ప్రత్యేకహోదా ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీని తాకేలా ప్రతితెలుగోడు ఉద్యమిస్తుంటే.. తెలుగుసినిమా స్టార్లంతా కలెక్షన్లపైనే ఫోకస్ పెట్టారు.

Image result for PARLIAMENT AGITATION

సమాజం, ప్రజలు అంటూ సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే బడాస్టార్ల పలుకే బంగారమైపోయింది. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రత్యేకహోదాపై పెదవి విప్పలేదంటే.. ప్రజల కష్టాలపై వీళ్లకున్న కమిట్ మెంట్ ఏపాటిదో అర్ధమౌతోంది. హోదా ఉద్యమం పట్టనట్టు వ్యవహరిస్తున్న మనస్టార్లు, సమ్మర్ సీజన్ పైనే దృష్టిపెట్టారు. సమ్మర్ లో వచ్చే కలెక్షన్లపైనే ఫోకస్ పెట్టారు. తాజాగా ఒకటి రెండు పెద్ద స్టార్ల సినిమా ఫంక్షన్లు అట్టహాసంగా జరిగిపోయాయి. అందులో ఒకటి రంగస్థలం ప్రీరిలీజ్ ఈవెంట్. ఈ వెంట్ లో పాల్గొనేందుకు వైజాగ్ వెళ్లిన మెగాస్టార్ కు ప్రత్యేకహోదా సెగ తగిలింది. హోదా ఉద్యమంలో కలిసిరాని చిరంజీవిని నిలదీశారు ఏయూ విద్యార్ధులు.

Image result for PARLIAMENT AGITATION

భరత్ అనే నేను సినిమాలో మహేష్  బిజీగా ఉంటే.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ప్రభాస్ లు సెట్స్ లో బిజీగా గడుపుతున్నారు. సొంతరాష్ర్ట సమస్యలను ఏమాత్రం పట్టించుకోని మన తెలుగు హీరోలకు.. తమిళనటుల పోరాట పటిమను గుర్తుచేస్తున్నారు మన రాజకీయ నేతలు.. అసలు టాలీవుడ్ కు ఏమైందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రేక్షకుల చప్పట్లే తప్ప వాళ్ల కన్నీళ్లు వీళ్లకు పట్టవా అంటూ ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ వీబీ రాజేంద్రప్రసాద్.

Image result for tollywood heros

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు.. ఏపీ ప్రయోజనాలను కాలరాస్తూ.. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీయాల్సిన సినీ పరిశ్రమ... సెట్స్ లో బిజీగా ఉంటూ ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. దివిసీమ ఉప్పెనప్పుడు ప్రజల కష్టాలకు చలించిపోయిన ఎన్టీఆర్ ఆనాడు జోలెపట్టి చందాలు అడిగారు. ఊరారా తిరిగి.. సహాయనిధిని సేకరించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నామని గొప్పలు చెప్పుకునే నేటి తారలు మానవత్వాన్ని మరిచి ప్రజల కష్టాలను విస్మరించి.. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ముసుగులోనే ఉండిపోయిన తీరును ప్రతిఒక్క తెలుగోడు ప్రశ్నిస్తున్నాడు.. మన తెలుగు సినీ పరిశ్రమకు ఏమైందని నిలదీస్తున్నాడు.. ఆపదలో ఉన్న తెలుగువాళ్ల సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత కళాకారులపై ఉంది.. అవసరమైతే కేంద్రాన్ని నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులు చేసే సామాజిక బాధ్యత వారిపై ఉంది. అవన్నీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తెలుగుసినిమా దేవుళ్లను ప్రేక్షక దేవుళ్లు సహించరని.. తారలు తెలుసుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: