బాల్యం నుండి చురుకుదనం.....పందెం కడితే గెలిచి సాధించే ధైర్యం.. వల్ల కాదంటే విశ్వరూపం చూపించే ధీమాతనం.. కదలకుండా కేవలం కనుచూపులతో నవరసాలను పండించగలిగే మహానటి.. అందాల తార సావిత్రి. 


జీవిత చరిత్ర అనగానే గెలుపు గురించి గొప్పగా.. ఓటమి గురించి తక్కువగా (ఒక పాటలో) కానిచ్చేస్తారు అనుకుంటాం.. కాని ఆమె మహానటి కిరీటం ఎలా ఎత్తుకుందో ఆమె పతనం కూడా అదే విధంగా తెరమీద చూపించారు. ఇది కచ్చితంగా గొప్ప విషయమని చెప్పొచ్చు. ఏ ప్రేక్షకుడు అభిమానించే వారిని దీనస్థితిలో చూడలేడు. అందుకే ఆమె బాధపడినా అభిమానులను బాధపెట్టలేదు.   


జీవిత కథ సినిమాగా చెప్పే ప్రయత్నంలో సావిత్రి జీవిత నిజానిజాలు ప్రస్థావించినా కథలో ఆమెని దూరం చేసినా.. మనసులకు ఇంకా దగ్గర చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అతను చేసిన మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఇక ఈ మహానటి అయితే మనుషుల ఆలోచనలను మార్చేస్తుంది.    


అభిమానించే ఓ మనిషి లేనప్పుడు.. కోట్ల కొద్ది ఆస్తి ఉండి ఏం లాభం .. సావిత్రి చనిపోయేప్పుడు దీనస్థితిలోనే ఉండొచ్చు కాక ఆమె మరణించి ఇన్నేళ్లు గడిచినా ఇన్ని కోట్ల హృదయాల్లో నిలిచి ఉండటమే అసలైన ఆస్తి. తరతరాలకు ఆమె జీవితం ఓ అద్భుత దృశ్యకావ్యం.  


తెలుగు సినిమా ఉన్నంతవరకు ఆమె మహానటే.. తెలుగుదనం ఉన్నంతవరకు సావిత్రమ్మ బ్రతికే ఉంటుంది. ఆకాశ వీధిలో అందాల జాబిలిగా తెలుగు సిని పరిశ్రమలో ఆమె పేరు ఎప్పటికి చిరస్మరణీయం అవుతుంది. దీనికి కోట్ల హృదయాలను గెలిచిన ఆమె అభిమాన జనమే సాక్ష్యం. 



మరింత సమాచారం తెలుసుకోండి: