తెలుగు ఇండస్ట్రీలో సుజాత, స్వర్గం, బొట్టు కాటుక వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలను రూపొందించిన అలనాటి దర్శకులు  నాగేశ్వరరావు (87) మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, రామాంతపూర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాసరి శిష్యుల్లో ఒకరైన దుర్గా నాగేశ్వరరావు బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి 14విజయవంతమైన సినిమాలు చేశారు.

ప్రముఖ కేరెక్టర్ నటుడు సీఎస్సార్ కు స్వయానా మేనల్లుడైన దుర్గా నాగేశ్వరరావు దర్శకుడిగా తన ప్రస్థానాన్ని 1979లో విజయ బాపినీడు నిర్మించిన 'విజయ' చిత్రం ద్వారా ప్రారంభించారు. అనంతరం పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ దర్శకుడిగా తనదైన ముద్ర వేయగలిగారు దుర్గా నాగేశ్వరరావు.

దుర్గా నాగేశ్వరరావు మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నివాళులు అర్పించింది. దుర్గా నాగేశ్వరరావుతో పాటు, కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన మరో ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ, సీనియర్ కో డైరెక్టర్ రామ సూరిలకు దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. నివాళులు అర్పించిన వారిలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కానూరి, దర్శకులు ధవళ సత్యం, సీవీ రావు, పర్వతనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: