తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అందుకే ఆ కార్యక్రమ ప్రసార టీవీ ఛానల్ రెండో సీజన్ కు సన్నాహకాలు  ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు రాజమౌళితో తీయబోతున్న మల్టీస్టారర్, త్రివిక్రమ్ సినిమాల్లో నటించబోతుండడంతో డేట్లు కుదరక హోస్ట్ కి  నో చెప్పేసాడు.


ఎన్టీఆర్ తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ రూమర్లకు నేటితో తెరపడింది. బిగ్ బాస్ రెండవ సీజన్ హోస్ట్ గా నాని వ్యవహరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు సదరు కార్యక్రమ ప్రసార టీవీ సంస్థ స్టార్ మా ట్విట్టర్లో పోస్టును చేసింది. బిగ్ బాస్ హోస్టును ప్రకటిస్తామని ఒక ప్రకటనను విడుదల చేసిన మూడు గంటల అనంతరం నాని హోస్టుగా ఉండబోతున్నట్లు ఒక ఫోటోను షేర్ చేసింది.


అంతేగాక సదరు కార్యక్రమ రెండవ సీజన్ కు సంబంధించి ఈ మేరకు ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది. అందులో నాని చాయ్ తాగుతూ "బాబాయ్ ఈసారి ఇంకొంచెం మసాలా ..ఏదయినా జరగవచ్చు " అంటూ డైలాగ్ చెప్పి ఈ సారి బిగ్ బాస్ మరింత ఆసక్తిగా ఉంటుందన్న హింట్ ఇచ్చాడు. అయితే విడుదలయిన గంటలోపే ఈ ప్రోమో యూట్యూబ్లో ఒక సినిమాకు వచ్చినంతగా హిట్లు, లైకులతో దూసుకుపోతుంది. మొత్తానికి ఈ సీజన్లో నాని హోస్ట్ గా ఎలా  చేస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: