సినీ సాహితీ సేద్యంలో అసాధ్యులు వాళ్లు.. మాట‌లు ఆగిన‌చోట పాటై ప్ర‌తీ గొంతులో ప‌ల్ల‌వించారు.. అమ్మ‌ను మించి దైవ‌మున్న‌దా.. ఆత్మ‌ను మించి అర్థ‌మున్న‌దా.. అంటూ ఈ లోకాన్ని ప్ర‌శ్నించినా.. ఓ బంగ‌రు రంగుల చిల‌కా ప‌ల‌క‌వే అంటూ ప్రేయ‌సిని ప్రేమ‌గా పిలిచినా.., ఓ అల్ల‌రి చూపుల రాజా ఏమ‌నీ.. అంటూ ప్రేయసి తేనెలొలికినా.., కొమ్మ‌కొమ్మ‌కో స‌న్నాయి కోటి రాగాలు ఉన్నాయ‌ని మౌనంగా చెప్పినా.., మాటే మంత్ర‌ము మ‌న‌సే బంధ‌ము ఈ మ‌మ‌తే ఈ స‌మ‌తే మంగ‌ళ‌వాద్య‌ము.. అంటూ నాలుగుమాట‌ల్లోనే మూడుముళ్ల బంధాన్ని వర్ణించినా.., గున్న‌మామిడి కొమ్మ‌మీద గూళ్లు రెండున్నాయి.. చిల‌కేమో ప‌చ్చ‌నిది కోయిలేమో న‌ల్ల‌నిది.. అయినా ఒక మ‌న‌సేదో ఆ రెంటిని క‌లిపిందంటూ స్నేహాన్నిక‌ళ్ల‌కు క‌ట్టినా.. ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మ‌లో కొమ్మ‌నై ఈ అడ‌వి దాగిపోనా అంటూ..ప్ర‌క‌`తిలో ఒడిన‌ ప‌ర‌వ‌శించినా..  అమ్మా చూడాలి.. నిన్నూ నాన్న‌ను చూడాలి.. నాన్న‌కు ముద్దు ఇవ్వాలి.. నీ ఒడిలో నిద్దుర‌పోవాలి.. అంటూ గుండెల్ని పిండేసినా.. అది వీళ్ల‌కే సాధ్య‌మైంద‌ని చెప్పాలి.

Image result for acharya atreya quotes

ఇలా.. ఈ గాలి ఈ నేల ఈ ఊరు.. సెల‌యేరును మ‌ర‌వ‌ని వారి క‌లాలు కురిపించిన క‌మ్మ‌ని ప‌దాల జ‌ల్లుల‌తో తెలుగు త‌నువూగింది. తొల‌క‌రి వ‌ల‌పుల‌లో తెలుగు హృద‌యాలు పుల‌కించిపోయాయి. వెదురులోనె ఒదిగింది కుదురు లేని గాలి.. ఎదురులేక ఎదిగింది మ‌ధుర‌గాన కేళి.. ఇలా  ఒక‌టా..రెండా.. ఎన్ని పాటలు విన్నా.. ఎన్నెన్నిసార్లు విన్నా.. చివ‌ర‌కు.. త‌నివితీర‌లేదే నా మ‌న‌సునిండ‌లేదే అంటూ పాడుకోవాల్సిందే. అందుకే ఆ మ‌హాక‌వులు సృష్టించిన ప‌ద‌కేళి ద‌శాబ్దాలుగా తెల్ల‌వార‌క‌ముందే ప‌ల్లెను లేపుతూ.. తెలుగువారినంద‌రినీ త‌ట్టిలేపుతోంది.  క‌థ‌లో మాట‌లు ప‌డ‌ని చోట ఆ దిగ్గ‌జ గేయ‌ర‌చ‌యిత‌లు పాటై ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించారు. 

Image result for sirivennela seetharama sastry

స‌మ‌యం.. సంద‌ర్భం.. స‌న్నివేశం.. ఏదైనా, ఎక్క‌డైనా సంగీత ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు సాహిత్యం అందించ‌డంలో, క‌థలో భావం దెబ్బ‌తిన‌కుండా పాట రాయ‌డంలో వారికివారే సాటి. అందుకే క‌థ‌, పాట‌, సంగీతం.. పాలునీళ్ల‌లా క‌లిసిపోయి ఒక్క‌టిగా ప్రేక్ష‌కుల మ‌దిని దోసుకున్నాయి. తెలుగునేల‌పై క‌ల‌కాలం నిలిచిపోతున్నాయి.తొలిత‌రం ర‌చ‌యిత‌లు ఆచార్య ఆత్రేయ‌, డాక్ట‌ర్ సి. నారాయ‌ణ‌రెడ్డి, శ్రీ‌శ్రీ‌, దాశ‌ర‌థి క‌`ష్ణ‌మాచార్యులు, వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు.. ఇలా మ‌రెంద‌రో క‌వులు సినీ సాహిత్యాన్ని సుసంప‌న్నం చేశారు. ఆత్రేయ‌, నారాయ‌ణ‌రెడ్డి, వేటూరి భౌతికంగా మ‌న‌మ‌ధ్య లేకున్నా.. వారందించిన పాట‌లు మ‌న‌ల్ని నిత్యం ప‌ర‌వ‌శింపుజేస్తూనే ఉన్నాయి. 

Image result for sri sri

దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కులు గంట‌సాల‌, కేవీ మ‌హ‌దేవ‌న్‌, చ‌క్ర‌వ‌ర్తి, ఇళ‌య‌రాజా త‌దిత‌రులు అందించిన సుస్వ‌రాలు ప్ర‌తీ సినిమాను విజ‌య‌వంతం చేశాయి. అదేస‌మ‌యంలో గంట‌సాల‌, జాన‌కి, సుశీల‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌ర గాయకులెంద‌రో ఆ మ‌హాక‌వులు పాట‌ల్ని పాడి వాటికి ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేశారు. పౌరాణిక చిత్రాల‌తోపాటు అభినంద‌న‌, సీతాకోక‌చిలుక‌లు, మంచి మ‌న‌సులు, స్వాతిముత్యం, సిరివెన్నెల‌, సాగ‌రసంగ‌మం, కిన్నెర‌సాని, మేఘ‌సందేశం, స్వ‌ర్ణ‌క‌మ‌లం, ముత్యాల‌ముగ్గు, దేవ‌త‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నోచిత్రాలు తెలుగు లోగిళ్ల‌లో క‌దలాడుతున్నాయి. 

Image result for gantasala

అయితే సినీసాహిత్య‌లో పోక‌డ‌లో కొన్ని సంవ‌త్సరాలు వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రానురాను అదిమ‌రింత వేగం పుంజుకుంటోంది. పాట‌ల్లో సాహిత్య విలువ‌లు త‌గ్గిపోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఇప్ప‌టికీ కొంద‌రు ర‌చ‌యితలు త‌మ పాట‌ల్లో సాహిత్య విలువ‌ల్ని అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాయి. చంద్ర‌బోస్‌, అనంత శ్రీ‌రాం, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, కందికొండ‌, సుద్దాల అశోక్‌తేజ‌, భువ‌న‌చంద్ర, యాద‌గిరి త‌దిత‌రులు ఇప్ప‌టికీ మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు. కానీ గ‌తంతో పోల్చితే మాత్రం త‌క్కువ‌నే చెప్పుకోవాలి. 


పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేస్తూ వ‌స్తున్న పాట‌లు తెలుగు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. చాలా వ‌ర‌కు పూట‌పాట‌లుగా మిగిలిపోతున్నాయి. సాహిత్య విలువ‌ల‌తోపాటు సంగీతం కూడా అలానే ఉండ‌డంతోపాటు కేవ‌లం ఆపూట మందం యూత్ ఆక‌ట్టుకోవ‌డం వ‌ర‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అవుతున్నారు. ప‌దికాలాల‌పాటు నిలిచే పాట‌లు రావడం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీలో ఓ మంచి ప‌రిణామం చోటుచేసుకుంటుంద‌నే చెప్పాలి. సాధార‌ణంగా సినీగేయ ర‌చ‌యిత‌లంద‌రూ పురుషుల‌నే అనుకుంటాం. కానీ ఇటీవ‌ల మ‌హిళ‌లు కూడా సినీగేయ‌ర‌చ‌యిత‌లుగా రాణిస్తున్నారు. 


ఇటీవ‌ల వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమాలో పాట‌ల‌న్నీ ర‌చ‌యిత్రి శ్రేష్ట‌నే రాయ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా ఫిదా సినిమాలో ఊసుపోదు.. ఊరుకోదు.. అంటూ సాగే పాట రాసింది పింగిలి చైత‌న్య‌. ఇలా సినీరంగంలో మ‌హిళ‌లు గేయ‌ర‌చ‌యిత‌లుగా రాణించ‌డం సుభ‌ప‌రిణామ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. తెలుగు గాలిని, తెలుగు నేల‌ను, తెలుగు సెల‌యేరు, తెలుగు ప‌ల్లెను, తెలుగు అనుబంధాల‌ను విడ‌వ‌కుండా సాగే పాటే ప‌దికాలాల‌పాటు నిలుస్తుంది. దీనిని ఇప్ప‌టి ర‌చ‌యిత‌లూ గుర్తించి, ఆ దిశ‌గా సాగాల‌ని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: