దివంగత నటుడు, నతరత్న ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బయోపిక్ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్మించడమే గాక ఎన్టీఆర్ పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ప్రారంభంలో దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే సినిమాకు తాను న్యాయం చేయలేననిపించడంతో దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు.


ఇక అప్పటి నుండి దర్శకుడి కోసం వేటను కొనసాగించింది ఆ చిత్ర యూనిట్. మధ్యలో కొందరి దర్శకుల పేర్లు వినిపించినా అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ఎందుకంటే నేడు ఈ బయోపిక్ కు సంబంధించి బాలకృష్ణ ఒక కీలక ప్రకటన చేసాడు. తన నూరవ చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణి కి దర్శకత్వం వహించి అఖండ విజయం సాధించడానికి కారణమయిన క్రిష్ జాగర్లమూడిని ఎన్టీఆర్ బయోపిక్ కి కూడా దర్శకుడిగా నియమిస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించాడు.


బాలకృష్ణ సినిమా వ్యవహారాలను చూసుకొనే ఎన్బీకే ఫిలిమ్స్ ఈ మేరకు యూట్యూబ్ లో ఆయన వాయిస్ ఓవర్ అందించిన ఒక వీడియోను అప్ లోడ్ చేసింది. కాగా దర్శకుడిగా భాద్యతలను అప్పగించడం పట్ల దర్శకుడు క్రిష్ ట్విట్టర్లో స్పందించాడు. "నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: