విజయం వస్తేనే ఏ రంగంలో వారికి అయినా గుర్తింపు. పరాజయాలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత సమర్ధుడు అయినా ఎవరూ పలకరించరు. తెలియనట్లు మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఇది ప్రతి రంగంలోనూ ఉండే విషయమే. ముఖ్యంగా మన టాలీవుడ్ పరిశ్రమలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఆ దర్శకుడి ఫోన్ కూడా ఎత్తని సెలబ్రిటీలు ఒక్క విజయం వస్తే చాలు ఆ దర్శకుడి కోసం వరసపెట్టి ఫోన్స్ చేస్తూ, ఎస్.యం.ఎస్ లు పెడుతూ నానా హడావుడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ పరిస్థితి ఇలాగే ఉంది. ‘అష్టా చమ్మా’ లో ఈ దర్శకుడుకి మంచి పేరు వచ్చినా రెండేళ్ళ క్రితం వచ్చిన ‘గోల్కొండ హై-స్కూల్’ పరాజయం కావడం తో ఇతడి పేరు కూడా టాలీవుడ్ మర్చిపొయింది.

గత వారం విడుదల అయిన ‘అంతకు ముందు - ఆ తరువాత’ సర్ ప్రైజ్ హిట్ తరువాత మీడియా కు ఇంద్రగంటి మోహన్ కృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ గా మారిపోయాడు. వరసపెట్టి వెబ్ మీడియా లో, ఛానల్స్ లో ఇతడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఇంటర్వ్యూ లు కూడా ప్రసారం అయిపోతున్నాయి. సాంప్రదాయ రచయితల కుటుంబం నుంచి వచ్చిన మోహన్ కృష్ణ బూతు శబ్దం లేకుండా యువతరాన్ని థియేటర్స్ కు రప్పించి సినిమాను హిట్ చేయవచ్చని తన లేటెస్ట్ మూవీ ‘అంతకు ముందు – ఆ తరువాత’ ద్వారా నిరూపించాడు. రొమాన్స్ కు, సెక్స్ కు ఉండే సున్నితమైన తేడాను నేటి యువతరం ప్రస్తుతం బాగా ఇష్టపడుతున్న సహజీవనం బ్యాక్ డ్రాప్ అంశంగా సినిమాను తీసి విజయం సాధించాడు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా బొంబాయి, ఇతర రాష్ట్రాల హీరోయిన్స్ ను కోరుకుంటూ ఉంటే మోహన్ కృష్ణ మాత్రం తెలుగు అమ్మాయిల తోనే సినిమాలు తీయడం ఇతడి స్పెషాలిటీ. ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హై-స్కూల్’ సినిమాలను అచ్చమైన తెలుగు అమ్మాయి స్వాతి తో తీస్తే, ప్రస్తుత ‘అంతకు ముందు – ఆ తరువాత’ సినిమా మరో అచ్చ తెలుగు అమ్మాయి ఇషా తో తీసి తెలుగు అమ్మాయిలు కూడా బాగా నటించగలరు అని ప్రూవ్ చేశాడు. దీనితో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించే బ్రాండ్ అంబాసిడర్ గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ కు పేరు రావడమే కాకుండా తెలుగు సినిమాలలో హీరోయిన్ ఛాన్స్ లు కోసం టాలీవుడ్ నిర్మాతల చుట్టూ తిరుగుతున్న తెలుగు అమ్మాయిలకు గాడ్ ఫాదర్ గా మారిపోయాడట మోహన్ కృష్ణ. ప్రస్తుతం మోహన్ కృష్ణ పేస్ బుక్, ట్విట్టర్ తెలుగు అమ్మాయి ల ఫోటోలతో నిండిపోయి మోహన్ కృష్ణ ను ఖంగారు పెడుతున్నాయట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: