ఊహ తెలిసినప్పటి నుంచి మనిషి జీవితంలో చివరి మజిలీ వరకు అందరికీ అన్ని దశలలోను మిత్రులు ఉంటారు. అయితే వారిలో జీవితాంతం మన వెంట ఉండి నడిపించే మిత్రులు చాల తక్కువమంది ఉంటారు. అటువంటి స్నేహితులను గుర్తుకు చేసుకుంటూ ‘స్నేహమేరా జీవితం’ అంటూ నేడు ప్రపంచ వ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుగుతోంది. 

పార్లీ అనే మనోవిశ్లేషకుడి అభిప్రాయం ప్రకారం నిజమైన మిత్రుడంటే ఓటమిలో ఓదార్చి మన గెలుపును తనదిగా భావించి ఆనందించేవాడు. సమస్యల్లో ఉన్నప్పుడు సలహా లిస్తూ ధైర్యం చెప్పేవాడు అని పార్లీ అభిప్రాయం. మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం అనీ అనేక పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓవ్యక్తిని చంపింది. అతని మరణవార్త విని ఆమరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వం వీరిస్నేహానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించారట.

క్షణాలు గడచిపోతున్నా ఏళ్లు దొర్లిపోతున్నా స్నేహం మాత్రం చెదిరిపోదు.  స్నేహంలో ఆడ మగ తేడాలు కాని చిన్నా పెద్దా వ్యత్యాసాలు కాని ఉండవు. అన్ని బంధాలకు అతీతంగా ఉండేది స్నేహం. కుచేలుడిచ్చిన పిడికెడు అటుకులకు కృష్ణుడు బంగారు పట్టణాన్నే బహుకరించి స్నేహం విలువను ఈలోకానికి తెలియచేశాడు. స్నేహం పై ఎన్నో కథలు పాటలు మాత్రమేకాదు కవితలు గ్రీటింగ్ కార్డ్‌లు మెసేజ్‌లు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ లతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం హోరెత్తి పోతోంది.  
స్నేహంలోని గొప్పదనం ఎన్నిరకాలుగా వర్ణించినా తక్కువే అని అంటారు. ఈభావాన్ని స్వయంగా అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం అర్థంకాదు. అంతటి ఉన్నతమైన స్నేహం కోసం కేటాయించుకున్నదే స్నేహితుల రోజు. బంధాలు ఏర్పడడానికి కారణమౌతోంది. కానీ ప్రస్తుతం మారిపోయిన పరిస్థుతులలో ఇద్దరి వ్యక్తుల మధ్య అవసరాలు, అట్రాక్షన్ వల్లనే స్నేహం పుడుతోందని మనస్తత్వ శాస్త్రవేత్తలు విశ్లేషణలు చేస్తున్నారు. 
beach, friends, friendship, fun
ఫ్రెండ్ లేనివాడు ఒక అనాథ అంటూ ప్రెంచ్ భాషలో సామెత కూడ ఉంది. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకరినొకరు ఇచ్చుకునే బహుమతులలో ఎక్కువగా ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కీలక పాత్రను పోషిస్తాయి. అందమైన బంధానికి గుర్తుగా నిలిచే ఈస్నేహితుల దినోత్సవంలో ‘నువ్వు పెదవి విప్పి ఒక్కమాట చెప్పకపోయినా నీ మౌనాన్ని వెనుక ఉన్న బాధని అర్ధం చేసుకోగలవాడే నిజమైన స్నేహితుడు’ అని ఒక ప్రముఖ అమెరికన్ రచయిత చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుంటూ వెలకట్టలేని కానుకల మధ్య ఈనాటి మైత్రి దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులందరికీ ఇండియన్ హెరాల్డ్ ‘ఫ్రెండ్ షిప్ డే’ శుభాకాంక్షలు..


మరింత సమాచారం తెలుసుకోండి: