బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ అనే పదం సినిమా వాళ్ళకు కొత్తేం కాదు. ఏదైనా క్యారెక్టర్ చేయాలనుకుంటే దానికి తగ్గట్లుగా బాడీ షేప్ అండ్ లుక్ ని మార్చేసుకోవడమే అన్నమాట. ఇది బాలీవుడ్ లో ఎప్పటినుంచో జరుగుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అయితే ఇచ్చిన పాత్రకు అనుగుణంగా మారిపోతుంటాడు. ఆ మధ్య వచ్చిన దంగల్ సినిమాలో అచ్చుగుద్దినట్లుగా ఒరిజినల్ రెజ్లర్ లాగానే కనిపించాడు.


ఇక కోలీవుడ్ లో విక్రమ్ పేరు కూడా చెప్పుకోవచ్చు. ఇతగాడు చేయని ప్రయోగాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. ఏ పాత్ర ఇచ్చినా అందుకు తగ్గట్లుగా బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ చేసేస్తాడు. దాంతో సినిమాలో ప్రేక్షకులకు విక్రమ్ బదులుగా పాత్రే కనిపిస్తూంటుంది. ఇక హాలీవుడ్ లో అయితే క్రిస్టియన్ బేల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ హీరోగారు కూడా బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ లో నెంబర్ వన్.


తాజాగా వీరి కోవలోకి టాలీవుడ్ హీరో రానా కూడా చేరాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా మెప్పించిన ఈ యంగ్ హీరో కూడా బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ తో షేప్ మార్చేశాడు. కండలు తిరిగిన రానా కాస్తా స్లిమ్ గా తయారైపోయాడు. ఈ హీరో గారి ఫొటో చూస్తే చాలు షాక్ అయ్యేలా బాడీ షేప్ అండ్ లుక్ చేంజ్ చేసేశాడు.


ఇదంతా ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ కోసం అన్నమాట. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడులా రానా కనిపించబోతున్నాడే విషయం తెలిసిందే కదా. ఇక బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. చంద్రబాబు స్పీచ్  వీడియోలతో పాటు పలు వీడియోలు తెప్పించుకుని అనుకరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడట. రానా ఆ రకంగా చంద్రబాబులా మారిపోతున్నాడట.    



మరింత సమాచారం తెలుసుకోండి: