సూపర్ స్టార్ కృష్ణ జీవితం పై ఒక బయోపిక్ త్వరలో రాబోతున్నట్లు ఆ బయోపిక్ కు తాను నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు యంగ్ హీరో సుధీర్ బాబు ఆమధ్య మీడియాకు లీకులు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆవార్తలు అన్నీ అసత్యాలనీ తాను సూపర్ స్టార్ కృష్ణ జీవితం పై ఎవరైనా బయోపిక్ తీస్తే బాగుంటుంది అని మాత్రమే చెపితే తాను ఏకంగా కృష్ణ జీవితం పై బయోపిక్ మూవీని తీసున్నట్లుగా మీడియా ప్రచారం చేసిందని సుదీర్ బాబు ఈవార్తల పై చాల ఆలస్యంగా స్పందించాడు.

అంతేకాదు తన మావగారు కృష్ణ జీవితం పై బయోపిక్ తీసే అర్హత సమర్థత తనకు లేవు అని అంటూ ఎప్పటికైనా కాలం కలిసి వస్తే తన బావ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా తీయాలి అన్నది తన డ్రీమ్ అంటూ మరో ఊహించని యూటర్న్ తీసుకున్నాడు సుధీర్ బాబు. ఈవారం విడుదల కాబోతున్న ‘నన్ను దోచుకుందువటే’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు ఈకామెంట్ చేసాడు.

ఇదే సందర్భంలో ఈమూవీ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ వాస్తవానికి ఈసినిమా దర్శకుడు ఆర్ఎస్ నాయుడు తనకు ‘నన్ను దోచుకుందువటే’ సినిమా కథను మొదట్లో చెప్పినప్పుడు తనకు నచ్చలేదనీ అయితే ఆకథను దర్శకుడు నాయుడు పూర్తిగా డెవలప్ చేసి ఒక బౌండ్ బుక్ లా తయారు చేసి ఇచ్చినప్పుడు ఈమూవీ కథకు తాను విపరీతంగా కనెక్ట్ అయిపోయాను అని అంటున్నాడు. అమెరికాలో స్థిరపడి కోట్లు సంపాదించాలి అని కలలు కంటున్నా ఒక యువకుడుకి అనుకోకుండా అతడి జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి అతడి అభిప్రాయాలను ఎలా మార్చింది అన్న అంశం చుట్టూ ఈమూవీ తిరుగుతుందని సమాచారం.

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘సమ్మోహనం’ కు పాజిటీవ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో ఆసినిమా నిలబడలేకపోయింది. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య ఏర్పడిన విపరీతమైన పోటీ వాతావరణంలో ఒక సరైన హిట్ పడకపోతే సుధీర్ బాబు కెరియర్ నిలబడటం కష్టం అన్నకామెంట్స్ వస్తున్న నేపధ్యంలో తానే నిర్మాతగా మారి చేస్తున్న ఈమూవీ ప్రయోగం సుధీర్ బాబు కెరియర్ కు ఎంతో కీలకంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: