తెలుగు జాతి గర్వించేలా తెలుగు ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన మహానటులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దూకేందుకు ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.  కాగా, ఎన్టీఆర్' బయోపిక్‌ మూవీ టీమ్ రోజుకో వార్తతో ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతోంది. తాజాగా చిత్రబృందం మరో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బాలకృష్ణ స్టిల్ రిలీజ్ అయ్యింది..అయితే అది ఎన్టీఆర్ పొలిటికల్ స్టిల్.

మరోవైపు ఏఎన్ఆర్, చంద్రబాబు నాయుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి.  ఈ ప్రాజెక్ట్‌ నుంచి దర్శకుడు తేజను పక్కకు తప్పించిన తర్వాత క్రిష్ జాగర్లముడి డైరెక్షన్‌లో షూటింగ్ పక్కాగా జరుగుతున్నది. మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని రెండున్నర గంటల్లో చూపిస్తే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారా? అనే ప్రశ్న మొదటి నుంచి వెంటాడుతున్నది.  దాంతో ఈ విషయంపై తర్జన భర్జన చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని క్రిష్‌తోపాటు చిత్ర యూనిట్ భావిస్తున్నదట. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ప్రణాళికలో కొద్దిగా మార్పు చేసినట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్ సినీ, వ్యక్తిగత జీవితాన్ని మొదటి భాగంలో.. రాజకీయ కోణాన్ని మరో భాగంలో చూపించలాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  సంక్రాంతికి పార్ట్-1ను రిలీజ్ చేసి.. మరో రెండు నెలల్లోపు పార్ట్-2 రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.   గతంలో ఎన్టీఆర్ ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు. 

గండి కోట రహస్యం, చిక్కడు దొరకడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన జానపద చిత్రాలకు ఆయన ప్రాణం పోశారు.  తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా జానపద పాత్రకు సంబంధించినదిగా కనిపిస్తుంది.  అయితే ఈ పోస్టర్ లో ‘ఎన్టీఆర్’ కథనాయకుడు అని కనిపిస్తుంది. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..’అని క్రిష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే కాదు ఈ చిత్రం జనవరి 9 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.  ఈ పోస్టర్ చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ ని చూస్తున్నట్టుందని నందమూరి అభిమానులు తెగ ఆనందంలో మునిగిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: