ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ వచ్చింది అంటే తెలంగాణాలో ‘బతుకమ్మ పండుగ’ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈపండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జరుపుకుంటున్నారు. అంతేకాదు విదేశాలలో కూడ ఈబతుకమ్మ పండుగను అత్యంత కోలాహాలంగా జరుపుకుంటున్నారు అంటే తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఏవిధంగా ఇమిడిపోయిందో అర్ధం అవుతుంది. ఈ పండుగను ‘బతుకమ్మ పండుగ’ ‘బతకమ్మ పండుగ’ ‘గౌరి పండుగ’ ‘సద్దుల పండుగ’ అనే పేర్లతో వ్యవహరిస్తారు. బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది. ఒక బాలిక అప్పట్లో తెలంగాణ ప్రాంతంలోని భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘‘బతుకమ్మా’’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందింది. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడని తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. 
Bathukamma festival in Telangana. ( Photo:DC/File)
బతుకమ్మ పండుగ మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా వుంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా వుంటుంది. చెరువులన్నీ తాజా నీటితో నిండి వుంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుక తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ  పండుగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. 
Vivekananda Vidyanikethan High School students participate in Bathukamma celebrations at Bhagathnagar in Karimnagar on Thursday. (Photo: DC)
బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజూ సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఇలా చాలా సేపు ఆడాక ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తరువాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుసెనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు. 
telangana-Bathukamma festival
బతుకమ్మ వేడుకల  చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత  ప్రేమతో మానవ హారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఈ పాటలు అన్నీ జానపద గీతాలుగా ఉండి ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఆవిష్కరిస్తాయి. చీకటి పడే వేళకి  ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని  పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ బతుకమ్మ పూజలో రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. ఇది తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకత. తెలంగాణ సంస్కృతి కొనసాగినంత కాలం బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లె దగ్గర నుండి నగరాల వరకు వాడవాడలా బుతుకమ్మ సంస్కృతి కనిపిస్తూనే ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: