ఈరోజు నుండి ప్రారంభం అవుతున్న దేవి నవరాత్రులలో అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా అమ్మను ఆరాధించి పదవ రోజును  విజయ దశమిగా జరుపుకోవడం కొన్ని వేల సంవత్సరాల నుండి మన భారతీయ సంస్కృతిలో కొనసాగుతోంది. ఈ పండుగను ‘నవరాత్రి’ ‘శరన్నవరాత్ర్రులు’ అని కూడ అంటారు. 

ఈ పండుగకు సంబంధించి మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి ఆతరువాత మూడురోజులు సరస్వతి దేవిల అనుగ్రహం కోసం విశేష పూజలు నిర్వహిస్తారు. ఈతొమ్మిది రోజులలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించి మనలను రక్షిస్తుంది అని మన నమ్మకం. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కోక్క రూపంలో అమ్మవారిని ఆరాధించడం వలన ఒకో విశేష ఫలితం లభిస్తుందని ఋషులు తమ ఆధ్యాత్మిక గ్రంధాలలో తెలియచేసారు. 

ఈరోజు ఈ అవతారంలో నేడు అమ్మవారిని ‘శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి’ అవతారంగా పూజిస్తారు. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీబాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి అని మన నమ్మకం. 

నేడు ప్రారంభపు రోజు అయిన పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ ఉంచి  నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం  వస్తుంది అని అంటారు. ఈరోజు పూజ అనంతరం అమ్మవారికి నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు సమర్పించాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: