ఎన్టీఆర్ సామాన్యుడు కాదు. పౌరాణిక పాత్రలను ఎవరికీ మిగల్చలేదు. ఆఖరుకు ఆంజనేయుడు, నారదుడు తప్ప అన్ని పాత్రలు అన్నగారు వేసేశారు. అద్భుతంగా పండించారు కూడా. జానపదాలు విషయానికి వస్తే అందులో ఎన్ని రకాల మారు వేషాలు, మలుపులూ ఉన్నాయో అన్నీ వేసేసి బాహుబలి లాంటి వాటిని ఎపుడో జనానికి  చూపించేసిన ఘనుడు ఎన్టీఆర్. చారిత్రాత్మక  పాత్రల్లోనూ అదే తీరు. అక్భర్ నుంచి మొదలుపెట్టి చాణక్య చంద్రగుప్తుల దాకా నటించి తన నట దాహం తీర్చుకున్నారు నందమూరి.


స్వీయ కధతో సినిమాలు చేయడంలోనూ ఎన్టీఆర్ దే మొదటి స్థానం. ఆనాడు బయోపిక్ అన్న పేరు అయితే లేదు కానీ రామారావు గారు తన నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా  ఓ మూవీ చేసి ఆ రోజుల్లోనే ఔరా అనిపించుకున్నారు. ఆ చిత్రం పేరు కధానాయకుని కధ. ఈ సినిమాను తారకరామపిక్చర్స్ పతాకంపై కేడీవీ.ప్రసాద్ నిర్మించారు. దర్శకుడు:డి.యోగానంద్. ఈ చిత్రంలో కధానాయిక వాణిశ్రి. 1975 ఫిబ్రవరి 21న విడుదలైన‌   చిత్రం విజయ దుందుభి మోగించింది.


ఈ సినిమాలో పల్లెటూరి వాడిగా ఎన్టీఆర్ మొదట్లో కనిపిస్తారు. ఆ తరువాత ఆయన సినిమాల్లోకి వెళ్ళదం హీరో కావడం ఎందరో హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడం అదంతా చూపించారు. ఓ పాటలో భారతితో ఆయన సినీ హీరో గా పాడిన పాటను కెమెరాతో దర్శకులు చిత్రీకరిస్తూండగా దాన్ని సినిమాలో సినిమాగా చూపిస్తారు.



మరి అన్నగారు తన‌ సినిమా  జీవితాన్ని అలా తానే హీరోగా చేస్తూ తీయడం బహుశా ముందు రోజులను ఊహించుకుని తీసి ఉంటారేమో అనిపిస్తుంది. ఇపుడంటే బయోపిక్ ల హవా వుంది. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లోనే ఎన్టీఆర్ తన ఆలొచనలతో కొత్త పోకడలతో కధానాయకుని కధని సూపర్ హిట్ చేసేశారు.



మళ్ళీ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ కధానాయకుడు పేరు మీద ఆయన కుమారుడు బాలక్రిష్ణ సినిమా  తీస్తున్నారు. ఇది మంచిదే కానీ తన జీవితాన్ని మించిన కధా వస్తువు వేరేది ఉండదని ఎన్టీఆర్ ఆనాడే భావించడం ఎంతైనా గొప్ప విషయం కదా. చెప్పాల్సి వస్తే బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ కధానాయకుడు కొత్త ప్రయోగం ఏ మాత్రం కాదని ఆయన తండ్రి ఎన్టీఆర్ ఎపుడో చెప్పకనే  చెప్పేశారు. ఇదీ అన్న గారిఅసలైన టాలెంట్.


మరింత సమాచారం తెలుసుకోండి: