గత రెండురోజులుగా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు వేస్తున్న సెటైర్లు బాలకృష్ణ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై బాలయ్య అభిమానులు నాగబాబును టార్గెట్ చేస్తూ రివర్స్ పంచ్ లు వేస్తున్నా ఈ విషయమై జూనియర్ కళ్యాణ్ రామ్ లు మౌనం వహించడం బాలయ్య అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు టాక్.
జూనియర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పుడు బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరించి జూనియర్ కళ్యాణ్ రామ్ లకు మానసిక ధైర్యం అందించిన విషయాన్ని ఆతరువాత జరిగిన ‘అరవింద సమేత’ మూవీ ఫంక్షన్ కు బాలకృష్ణ అతిధిగా వచ్చిన విషయాన్ని అప్పుడే జూనియర్ కళ్యాణ్ రామ్ లు మర్చిపోయారా అంటూ బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తమ సోదరి నందమూరి సుహాసిని విజయం కోసం కూడ పాటుపడని ఈసోదరులు కనీసం బాలయ్య పై నాగబాబు చేస్తున్న ఈమాటల దాడిని ఎందుకు ఖండించడం లేదు అంటూ నందమూరి అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.
వాస్తవానికి బాలకృష్ణకు చిరంజీవికి మధ్య చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేకపోయినా ఏనాడు ఇలా ఒకరినొకరు అగౌర్వపరుచుకునే రీతిలో కామెంట్స్ చేసుకోలేదు అనేది బాలయ్య అభిమానుల అభిప్రాయం. అదేవిధంగా బాలయ్యకు ఉన్న క్రేజ్ తో ఏవిషయంలోనూ సరిపోని నాగబాబు వరసపెట్టి బాలయ్యను టార్గెట్ చేస్తూ చేస్తున్న ఈ కామెంట్స్ వెనుక ఎదో ఒక వ్యూహం ఉండి ఉంటుంది అన్నది అభిమానుల సందేహం. ఇలాంటి పరిస్థుతులలో నాగబాబు బాలకృష్ణ పై చేసిన కామెంట్స్ ను మరొక విధంగా విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చంద్రబాబును తన ‘జనసేన’ కోసం టార్గెట్ చేస్తుంటే తన తమ్ముడు పవన్ కు సహాయంగా నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తూ అంతర్లీనంగా తాను కూడ ‘జనసేన’ వ్యక్తిని అని సందేశాలు ఇస్తున్నట్లుగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఎలా ఉన్నా నందమూరి కుటుంబం అంతా ఒక్కటే అని అనేకసార్లు మీడియా ఇంటర్వ్యూలలో చెప్పే జూనియర్ కళ్యాణ్ రామ్ లు బాలయ్య పై నాగబాబు చేస్తున్న మాటల దాడిని ఖండించకపోతే బాలయ్య అభిమానుల ఆగ్రహంలో వీరిద్దరూ చిక్కుకోవడం ఖాయం అని అంటున్నారు..