రష్మిక మందన్న.. చలో సినిమాతో కెరీర్ మొదలు పెట్టి సక్సస్‌లతో చలో.. చలో అంటూ దూసుకుపోతోందీ కన్నడ భామ. హీరోయిన్ అంటే ఆకట్టుకునే అందమే కాదు.. అబ్బురపరిచే అభినయమూ ఉండాలని రుజువు చేస్తోంది. గీత గోవిందం అంత బంపర్ హిట్ అయ్యిందంటే విజయ్ దేవరకొండ అమాయక లుక్స్ తో పాటు.. అతన్ని తిప్పలుపెట్టే పాత్రలోని రష్మిక అభినయమూ కారణమే.



హీరోయిన్ అంటే సినిమాలు, షూటింగులు, షాప్ ఓపెనింగులు, కాల్ షీట్లూ.. ఇవే కాదంటోంది రష్మిక. మనిషన్నాక కాస్త కళాపోసన ఉండాలన్నట్టు.. కళాకారులకు సామాజిక స్పృహ కూడా ఉండాలని తన చేతల ద్వారా చెప్పకనే చెబుతోందీ ముద్దుగుమ్మ. అందుకే జల కాలుష్యం- నీటి సంరక్షణ అనే కాన్సెప్ట్ తో ఓ ఫోటో షూట్ చేసి అందరి ప్రశంసలూ పొందుతోంది.



ఈ కార్యక్రమం కోసం కర్ణాటకలోని బెళ్లందూర్ సరస్సు వద్ద నీటి అడుగున షూటింగ్ చేసింది. ప్లాస్టిక్ వంటి వ్యర్థాల వాడకం ద్వారా చెరువులు, సరస్సులు ఎలా కాలుష్యం బారిన పడుతున్నాయో చెప్పడం ఈ ఫోటోషూట్ ఉద్దేశ్యం. దీనికి అనుగుణంగానే రష్మిక నీటిలో మునిగితే ఆమె చుట్టూ ప్లాస్టిక్ కవర్లు తేలడం కనిపిస్తుంది.


ఒకప్పుడు చక్కటి సరస్సులా ఉండే బెళ్లందూర్ తటాకం.. కాలుష్య వర్థాల బారిన పడి విషతుల్యం కావడం తనను కలచివేసిందంటోంది రష్మిక. అదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. మన నీటిని మనమే కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహ కలిగి ఉండాలంటున్న రష్మికను అభినందించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: