హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలో సర్వేనంబర్ 46లోని స్థలం ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.  అయితే అదే స్థలంలో హీరో ప్రభాస్ చెందిన గెస్ట్ హౌస్ ను కూడా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు.  దాంతో హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ప్రభుత్వ ఆక్రమిత స్థలంలో ఉందంటూ శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 


ఈ విషయమై ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. సీఎస్/7లో భూమి ఉందా? లేదా? అని పిటీషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.  అయితే తాము కొనుగోలు చేసింది రాయదుర్గంలోని పాన్ మక్త స్థలమేనని సదరు న్యాయవాది స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని తనకు అమ్మారని.. ఈ స్థలాన్ని వదులుకునేది లేదని.. అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని.. దీనిపై న్యాయపోరాటానికి ప్రభాస్ సిద్ధమయ్యారు. 


ప్రభాస్ కు ఇక్కడ 2200 గజాల స్థలం ఉంది. అందులో ఎంతో ఇష్టపడి గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి రేపు డివిజన్ బెంచ్ లో మరోసారి వాదనలు జరగునున్నాయి. తదుపరి విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, రాయదుర్గంలోని పాన్ మక్తలో ఉన్న భూమి ప్రభుత్వ భూమి అని గతంలో హైకోర్టు తీర్పు నిచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: