సినిమారంగంలో రాజకీయరంగంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంచనాలు తారుమారు అవ్వడం ఈరెండు రంగాలలోను సర్వసాధారణం. ఈసంవత్సరం ముగింపుకు వస్తున్న నేపధ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడ ఊహించని విషయాలు ఎన్నో జరిగాయి. ఘనవిజయం సాధిస్తుంది అని అంచనాలు పెట్టుకున్న సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారితే ఎవరూ అనుకోని కొన్ని చిన్నసినిమాలు పెద్దసినిమాల స్థాయికి మించి ఘన విజయం సాధించడం ఈసంవత్సర ప్రత్యేకత.

చిన్నసినిమాలు మాత్రమే కదా అంటూ చాలామంది చిన్నచూపు చూసిన కొన్ని చిన్నసినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారడంతో చాలామంది టాప్ హీరోలు కూడ తమ ఆలోచనలు మార్చుకుని తమ సొంత బ్యానర్ల పై చిన్నసినిమాలు తీస్తున్నారు అంటే ఈచిన్న సినిమాల మ్యానియా ప్రస్తుతం ఇండస్ట్రీని ఏవిధంగా ప్రభావితం చేస్తోందో అర్ధం అవుతుంది. ఇక ఈఏడాది చిన్నసినిమాల హవా ఫిబ్రవరిలో విడుదలైన ‘ఛలో’ సినిమాతో మొదలైంది. ఈసినిమా ద్వారా రష్మిక లాంటి క్రేజీ హీరోయిన్ వెంకీ కుడుముల లాంటి కొత్తదర్శకుడు ఇండస్ట్రీకి దొరికారు. ఇదే ఫిబ్రవరిలో విడుదలైన వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కూడ హిట్ సాధించి చిన్నసినిమాల విజయానికి పెద్దపీట వేసింది. ఈమూవీ ద్వారా వరుణ్ తేజ్ కు మరొక హిట్ లభిస్తే వెంకీ అట్లూరి లాంటి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి దొరికాడు. 

ఈలిస్టులోనే స్థానం పొందిన ‘అ’ మూవీకి ప్రశంసలతో పాటు ఘనవిజయం కూడా లభించింది. ఈమూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ పాటించిన స్క్రీన్ ప్లే టెక్నిక్ ఈమూవీకి ఎంతో సహకరించింది. చిన్నసినిమాలలో ఈసంవత్సరం ఊహించని విజయం అందుకున్న సుధీర్ బాబు ‘సమ్మోహనం’ కూడ ఈలిస్టులో ప్రముఖస్థానాన్ని పొందింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈసినిమా మేకింగ్ లో కనపరిచిన ప్రతిభకు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద విజయం కూడ లభించింది. ఇక ఈవిషయంలో ఈ ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఆర్‌ ఎక్స్ 100’ గురించి పేర్కొనాలి. ఎటువంటి అంచ‌నాలు లేకుండా విడుదలైన ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లకు ఊహించని లాభాలు రావడమే కాకుండా ఈమూవీకి దర్శకత్వం వహించిన అజ‌య్ భూప‌తికి అదేవిధంగా ఈమూవీలో నటించిన పాయ‌ల్ ఘోష్‌ కి విపరీతమైన పేరును తెచ్చి పెట్టింది. విజయ్ దేవరకొండను క్రేజీ హీరోగా మరొకసారి నిలబెట్టిన ‘గీత గోవిందం’ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. అల్లు అరవింద్ కు కోట్లలో లాభాలు తెచ్చి పెట్టిన ఈమూవీ ఈసంవత్సరం సంచలన విజయ పరంపర లిస్టులో ప్రధమ స్థానంలో ఉంది. 


ఈచిన్న సినిమాల లిస్టులో ఈఏడాది విడుదలై అడవి శేషుకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టిన ‘గూఢచారి’ గురించి కూడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అతి తక్కువ బడ్జెట్ తో ఒక చిన్నసినిమాని ఇంత స్టైలిష్ గా తీయవచ్చా అంటూ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్య పోయింది. ఇదేసంవత్సరం విడుదలై మరోఊహించని హిట్ ను అందుకున్న ‘టాక్సీవాలా’ విజయ్ దేవరకొండ మ్యానియాను కొనసాగించింది. ఒక ఆత్మకథను సైన్స్ ఫిక్షన్ మూవీగా మార్చి విజయంసాదించారు. ఇకచివరిగా ఈసంవత్సరం చిన్నసినిమాల రేసుకు ముగింపు పలుకుతూ వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ కు కూడ ప్రశంసలు బాగా లభిస్తున్న నేపధ్యంలో ఈచిన్న సినిమాల హవా వచ్చే ఏడాది కూడ ఇదేస్థాయిలో కొనసాగుతుంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: