టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి బాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ లో సినీ తారాగణం బిజీ బిజీగా ఉన్నారు.  కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో తన తల్లిదండ్రుల విగ్రహాలకు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. నేడు   ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ తో కలిసి బాలయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఈ సందర్బంగా  బాలకృష్ణ మాట్లాడుతూ..ఈ సినిమా మొదటిభాగం ‘కథానాయకుడు’ బుధవారం విడుదల కాబోతోందని తెలిపారు.

యన్.టి.ఆర్  కేవలం ఒక వర్గానికో, పార్టీకో పరిమితం కాదని, అందరూ అభిమానించే మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ సినిమా రెండు భాగాలను ఇప్పటి వరకూ తొంభై రోజులు షూట్ చేశామని చెప్పారు.  ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటన అద్భుతం అని కొనియాడారు.   ఎన్టీఆర్ కేవలం తనకు తండ్రి మాత్రమే కాదనీ, ఆయన తన పాలిట గురువు, దైవం అని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ నటించిన పౌరాణిక, జానపద సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని వెల్లడించారు. వాటిలో కొన్నింటిని నెరవేర్చుకున్నానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం, రాజకీయరంగ ప్రవేశంతో పాటు తెలియని కోణాలను సైతం ఆవిష్కరించే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు.  వాస్తవానికి కథానాయకుడు సినిమా అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలని భావించామని..కానీ తండ్రిగారు రాజకీయా రంగ ప్రవేశం చేసి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9నే సినిమా రిలీజ్ కావాలని రాసిపెట్టి ఉందని అభిప్రాయపడ్డారు.  నందమూరి కుటుంబంలో పుట్టిన తాను గౌతమిపుత్ర శాతకర్ణి ద్వారా తల్లి రుణం, ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తండ్రి రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: