సినిమా రంగం అంటే బయటకు కనిపించేటంత అందమైనది కాదు. అక్కడ రంగులు, హంగులు అన్నీ కూడా ఆర్భాటమే. కెమెరా ముందు ఉన్న అనుబంధం, ఆప్యాయత వెనక ఉండడం అరుదు అంటారు. అదొక ప్రప్రంచం అని కూడా చెబుతారు. సినిమా పరిశ్రమను కరెన్సీ నదిగా కూడా కొందరు అభివర్ణిస్తూ ఉంటారు.


అటువంటి చోట మంచితనం తక్కువగా ఉంటుంది, సినిమా నిర్మాణమే వ్యాపారమైనపుడు అన్నీ వ్యాపారాత్మకంగానే  ఉంటాయి. కమర్షియల్ పోకడలే ఉంటాయి. అటువంటి చోట కూడా నిబద్దత, నిజాయతీ వంటివి స్వర్ణ యుగం కాలంలో చెప్పుకునే వారు. ఓ నిర్మాతకు అండగా ఉండాలని, ఆయనకు చేదోడు వాదోడుగా మెలగాలని నటీనటులు ఆ రోజుల్లో అనుకునే వారట. ఓ సినిమా ఫ్లాప్ అయితే ఆ కష్టాన్ని తమదిగా భావించి నిర్మాతకు మరో సినిమా చేసిపెట్టడమో, లేక తమ పారితోషికం వెనక్కి ఇవ్వడమో చేసేవారట.  ఇపుడు ఆ అచ్చటా, ముచ్చటా లేదన్నది అందరికీ తెలిసిందే.


కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఇపుడు ఓ హీరోయిన్ ఫ్లాప్ మూవీ తో కష్టాల బారిన పడిన తన నిర్మాతను ఆదుకునేందుకు ముందుకు రావడం గొప్ప విశేషంగానే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి ఇటీవలే శర్వానంద్‌తో కలిసి ‘పడి పడి లేచే మనసు’తో మన ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. టాక్ ఫర్వాలేదనిపించింది, కానీ కలెక్షన్లు నిరాశజనకంగా ఉన్నాయి. దీంతో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ ఫ్లాప్‌ సినిమాల జాబితాలోకి వెళ్లింది. 


దాంతో ఆ నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి.  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవి సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందట. సినిమా ప్రారంభానికి ముందు ఆమెకు సగం పారితోషికం ఇచ్చిన నిర్మాతలు.. మిగతా సగాన్ని సినిమా విడుదలయ్యాక ఇవ్వబోయారట. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో డబ్బులు తీసుకోవడానికి సాయి పల్లవి అంగీకరించలేదట. నిర్మాతకు నష్టాలను తగ్గించడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 


ఈ నిర్ణయంతో ఇపుడు సాయిపల్లవి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిదని అంతా అంటున్నారు. మెడిసిన్ చదువుతూ సినిమాల్లోకి వచ్చిన ఈ కన్నడ పిల్ల ఫిదా మూవీతో కుర్రకారుని ఫిదా చెస్తే తన మంచి మనసుతో మొత్తం టాలీవుడ్ ని ఫిదా చేసిందని అంటున్నారు. హిట్లు బాగా తగ్గిన ఈ రోజుల్లో సాయి పల్లవి లాంటి వారు మరింతమంది వస్తేనే సినిమా రంగం బతికి బట్ట కడుతుంది. మరి మన హీరోలు కూడా ఆమె బాటన పయనిస్తారా  లేదా చూడాలి.మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: