పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో తన ‘జనసేన’ కార్యకర్తలతో మాట్లాడుతూ ‘జనసేన’ ను రాత్రికి రాత్రి బలమైన పార్టీగా మార్చలేమని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. వైసిపి అధినేత జగన్ కు రాజకీయ కుటుంబం నుండి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తల బలంతో జగన్ పార్టీ బలపడిందని పవన్ అభిప్రాయపడ్డాడు.

అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానులతో పాటు లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తల బలంతో తెలుగుదేశం బలపడిందని కామెంట్ చేసాడు. అటువంటి బలం ‘జనసేన’ కు రావాలి అంటే లక్షల సంఖ్యలో జనసైనికులు కావాలని అప్పుడే క్షేత్ర స్థాయిలో ‘జనసేన’ బలం పుంజుకుని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఢీ కొట్టే స్థాయికి చేరుకుంటుంది అన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్త పరిచాడు. 

‘జనసేన’ పార్టీలో మేధావులకు అనుభవజ్ఞులకు స్థానం కల్పించాలి అన్న ఆలోచనలలో తాను ఉన్నానని ‘జనసేన’ పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆఖరికి తాను తప్పు చేసినా శిక్షించే విధంగా ‘జనసేన’ విధి విధానాలు రూపొందిస్తున్నట్లు పవన్ ప్రకటించాడు. అంతేకాదు ప్రతి పార్లమెంట్ స్థానానికి 11 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని వివరిస్తూ జనసైనికులు తాత్కాలిక ప్రయోజనాల గురించి కాకుండా భవిష్యత్ గురించి ఆలోచిస్తూ త్యాగాలు చేయాలని పిలుపును ఇచ్చాడు పవన్.

అంతేకాదు రాత్రికి రాత్రి జనసేన తో అద్భుతాలు జరుగుతాయని ఎవరూ ఊహించుకోవద్దు అని పిలుపును ఇస్తూ  ఇక నుంచి సామాన్యులతో కలిసి కూర్చుని వారి సమస్యలు తెలుసుకునే విధంగా వారానికి ఒకసారి సామాన్యుడుతో ‘జనసేన’ అధ్యక్షుడు కూర్చునే విధంగా పార్టీ నిర్మాణం జరుగుతున్నట్లు పవన్ ప్రకటించాడు. పవన్ విధి విధానాలు బాగున్నా దీర్ఘకాల ప్రయోజనాల కోసం ‘జనసేన’ కార్యకర్తలు ఎంతకాలం పవన్ మాటలను నమ్ముకుని ఎన్నికల తరువాత కూడ పవన్ వెంట నడుస్తారు అన్న విషయం ప్రస్తుతం సమాధానంలేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: