తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.  కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నల చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన ఆచిత్రం పేరునే తన ఇంటిగా మార్చుకున్నారు. ఇండస్ట్రీలో ఆయన సేవలకు గాను 'పద్మశ్రీ' పురస్కారం వరించింది.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. నలుగురికి 'పద్మ విభూషణ్' .. 14 మందికి 'పద్మ భూషణ్' .. 94 మందికి 'పద్మశ్రీ' పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ఆర్ట్స్ - లిరిక్స్ విభాగంలో పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి 'పద్మశ్రీ' అవార్డు దక్కింది.  సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల.
Image result for సిరివెన్నెల సీతారామశాస్త్రి
 ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్‌ పూర్తి చేసిన సీతారామశాస్త్రి 1984లో చిత్రం సాహిత్యం వైపు అడుగులేశారు. అంత అర్థవంతంగా ఉండబట్టే  ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి  పరుగుతీసింది. తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ  సుస్థిరం చేసుకున్నారు.
Image result for padma shri awards
'విధాత తలపున ప్రభవించినది..' అంటూ తన సాహితీ సేద్యాన్ని ప్రారంభించి.. 'ఈ గాలి .. ఈ నేల .. ఈ ఊరు' అంటూ ప్రకృతిలోని పరిమళాలను అక్షరాలకు అద్ది .. మనసు గోడలకు మధురానుభూతులను మెత్తిన గొప్ప గేయ రచయిత ఆయన. 'తెల్లారింది లెగండో .. కొక్కొరొక్కో .. ' అంటూ 'కళ్లు' సినిమా కథలోని సారాంశాన్ని ఒక్క పాటలో ఆవిష్కరించిన ఘనత ఆయనది.  ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా,  చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన.
Related image
'జగమంత కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది .. ' అంటూ జీవిత సత్యాన్ని .. తత్త్వాన్ని చాటిన గొప్పతనం ఆయన సొంతం. 'ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ .. ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ .. 'అంటూ మహాత్ముడికి మనమిచ్చే అసలైన నీరాజనమేమిటనే ఆలోచన రేకెత్తించిన గొప్ప భావశాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.  2019 ఏడాదికి గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: